TOP NEWS @ 7pm
posted on Oct 5, 2021 @ 6:55PM
1. రెండు, మూడు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని చెప్పారు. జోన్ల ఆమోదం కోసం పంపితే విపరీతమైన జాప్యం జరిగిందని.. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధన పెట్టామన్నారు కేసీఆర్. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని.. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పారు.
2. ఏపీ గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. ఏపీలో గంజాయి సాగులో వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఆశి ట్రేడింగ్ సుధాకర్ వెనుక ఉన్న వైసీపీ పెద్దలు ఎవరో తేలాలన్నారు. పోలీసులు డ్రగ్స్ విషయంలో ఉద్దేశపూర్వంకంగా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులను కాపాడేందుకు డీజీపీ, విజయవాడ సీపీ తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు ధూళిపాళ్ల.
3. సీఎం జగన్‌కి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవడంలో.. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం జగన్, వ్యవసాయ శాఖ మంత్రి విఫలమయ్యారని మండిపడ్డారు. కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు.
4. అటవీ హక్కులు అడిగితే కొట్టడం, అరెస్ట్ చేయడం ఆనవాయితీగా మారిందని.. అడవి బిడ్డలపై అకృత్యాలు పెరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టంపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అన్యాయమన్నారు. ఇక, ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. అడవులున్న చోటే హరిత హారం పేరుతో భూములు గుంజు కుంటున్నారని.. కేంద్రం మీద నెపం నెట్టి తప్పించుకుంటే ఊరుకునేది లేదని సీతక్క హెచ్చరించారు.
5. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1013 పిటిషన్ల బిల్లులను నాలుగు వారాల్లోగా మొత్తం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టేసింది. బకాయిలను 12 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని తీర్పు వెల్లడించింది.
6. కరెంట్ బిల్లులు కట్టకపోతే ఫైన్‌లు వేస్తారు.. ఫ్యూజులు తీస్తారు.. మరీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే ఏం చేయాలి? అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. మద్యం సహా ప్రజల బలహీనతలతో ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు. ధర్మం, న్యాయం కోసం చివరివరకు పోరాడతానని స్పష్టం చేశారు రఘురామ.
7. తనపై పెట్టిన అవిశ్వాసంపై కాకినాడ మేయర్ సుంకర పావని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన అభివృద్ధి మినహా రెండేళ్లలో వైసీపీ చేసింది ఏమీ లేదని అన్నారు. న్యాయ పరంగా గెలుపు తనదే అని.. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని మేయర్ పావని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళనైన తనను గద్దె దించేందుకు వైసీపీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ రెడ్డి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
8. ఉప ఎన్నికల వేళ హుజురాబాద్‌లో భారీగా డబ్బులు చేతులు మారుతోంది. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ.10.40 లక్షలు పట్టుబడ్డాయి. టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసుల ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. ఆ డబ్బు ఎవరిదని పోలీసులు ఆరా తీస్తున్నారు.
9. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని నిర్బంధించిన సీతాపూర్‌లోని పీఏసీ గెస్ట్ హౌస్ పైన ఓ డ్రోన్ సంచరించినట్టు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ సంచలన ఆరోపణలు చేశారు. 30 గంటలుగా ఆమెను నిర్బంధంలోనే ఉంచారని, ఆమెను ఉంచిన గదిపైన ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించిందని ట్వీట్ చేసారు. భవంతిపై ఎగురుతున్న డ్రోన్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
10. ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంచు విష్ణు. ‘‘ప్రకాశ్‌రాజ్ గారు.. ‘మంచు’ ఫ్యామిలీ అంటూ ఇంకోసారి నా కుటుంబం పేరు తీస్తే మీ పేరు పక్కన ‘గారు’ అనేది ఉండదు. మీకు దమ్ము, సత్తా ఉండి.. మగాడు అనుకుంటే నా పేరే తీయండి.. మా అక్క, తమ్ముడు, నాన్నను లాగకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులపైనాన మండిపడ్డారు. 10వ తేదీ తర్వాత మనం ముఖాలు చూసుకోవాలి. 11వ తేదీ ప్రకాశ్‌రాజ్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతారు. మీరంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పెద్దలకు మర్యాద ఇవ్వండి. ‘మా’ కుటుంబాన్ని దయచేసి విడగొట్టకండి.. అంటూ మంచు విష్ణు ఎమోషనల్‌గా మాట్లాడారు.