విపక్షాల సవాళ్లకు జవాబేది? టీఆర్ఎస్ ఓటమి ఒప్పుకున్నట్టేనా?
posted on Oct 5, 2021 @ 8:15PM
హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గరవుతున్నకొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. వేడి పెరిగే కొద్దీ అధికార తెరాసలో వణుకు పెరుగుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు సంధిస్తున్న సవాళ్ళకు తెరాస నాయకులు సమాధానలు చెప్ప లేక కిందా మీదా అవుతున్నారు. నిజానికి మొదటి నుంచీ కూడా అనేక విషయాల్లో డిఫెన్సు పడిపోయిన తెరాస నాయకులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగి పోతున్నారు. అవస్థలు పడుతున్నారు. అందుకే, ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన కారణాల మొదలు ఇప్పుడు తాజాగా అయన చేసిన రాజకీయ సన్యాసం సవాలు వరకూ ఏ ఒక్క సవాలుకు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఏ ఒక్క నాయకుడు జవాబు చెప్పే సాహసం చేయలేక పోతున్నారు.
తాజాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల నేరుగా, కేసీఆర్ కే సవాలు విసిరారు.ఉప ఎన్నికల్లో తాను ఓడిపోతే, రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి చెపుతానని, తెరాస ఓడిపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. నిజానికి ఇదే సవాలును ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అద్యక్షు బండి సంజయ్ గతంలోనూ చేశారు. అయినా కేసీఆర్ కాదు, చివరకు తెరాస నాయకులూ ఎవరూ ఆ సవాలు స్వీకరించలేదు. చివరకు, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, సమాధానం చెప్పలేక మోకాలుకు బోడి గుండుకు ముడి పెడుతూ.. బెంగాల్లో భవానీపూర్ నియోజక వర్గంలో బీజేపీ ఓడిపోతే ప్రధాని మోడీ రాజీనామా చేశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే, ఎప్పుడో రెండు నెలల క్రితం దమ్ముంటే, గెలుపు మీద ధీమా ఉంటే, కేసీఆర్ లేదా హరీష్ రావు పోటీచేయాలని ఈటల విసిరిన సవాలుకు, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఇంతవరకు స్పందించలేదు. జవాబు చెప్పలేదు.
అన్నిటికంటే విచిత్రం ప్రతిపక్షాలు ఒకటంటే మీరు నాలుగు అనండి, అని హైదరాబాద్ కార్యకర్తలకు క్లాసు పీకిన, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షడు, మంత్రి కేటీఆర్, తన దగ్గరకు వచ్చే సరికి, కోర్టును ఆశ్రయించి, రక్షణకవచం తెచ్చుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ విషయంలోనూ కేటీఆర్, ఎస్కేప్ రూట్ లో పక్కదారి చూసుకున్నారు. నీ సంగతి చెప్పవయ్యా అంటే, కేటీఆర్ సమాధానం చెప్పకుండా రాహుల్’ గాంధీ పరీక్షలు చేయించుకుంటే తానూ చేయించుకు కుంటానని తప్పించుకున్నారు. నిజానికి, కేటీఆర్ సవాలు స్వీకరించక పోవడంతో అంతవరకు రామన్న మంచి బాలుడు అనుకున్న వారిలో కూడా, అనుమానాలు రేకెత్తించింది.
రాజకీయాలలో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలలో ప్రత్యర్ధులు విసిరినా సవాలుకు, సమాధానం చెప్పక పోవడం, చెప్పలేక పోవడం రెండూ కూడా ఓటమిని అంగీకరించడంమే అవుతుందని, అంటారు. అదే నిజం అయితే, తెరాస ఓటమిని అంగీకరించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులే కాదు, సామాన్య జనం కూడా అంటున్నారు. నిజానికి, దళిత బంధు వంటి భారీ పథకాన్ని ఓటర్లకు ఎరవేసినప్పటికీ, రూ.4,700 కోట్ల విలువ చేసే పనులకు జీవోలు జారీ చేసినా, అధికార పార్టీ ఇంకా ప్రతిపక్ష పార్టీల సవాళ్ళకు సమాధానం చెప్పలేక పోవడం, నిజంగా అధికార పార్టీ బలహీనతను బయట పెడుతోందని పరిశీలకులు అంటున్నారు.