పీకే టీమ్ షాకింగ్ సర్వే.. సీఎం జగన్‌కు సంచలన రిపోర్ట్!
posted on Oct 5, 2021 @ 9:22PM
జగన్ తరఫున పీకే టీమ్ మళ్లీ రంగంలోకి దిగింది. వచ్చే రెండున్నరేళ్లు వైసీపీ కోసం పని చేయనున్నారు. గతంలోలానే ఈసారి కూడా జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు పని చేయనుంది. తాజాగా, ప్రశాంత్ కిశోర్ బృందం సభ్యులు విశాఖకు వచ్చారని తెలుస్తోంది. రెండు మూడు రోజులుగా పీకే టీం విశాఖలో సీక్రెట్ సర్వే జరుపుతున్నట్టు సమాచారం. వివిధ అంశాల మీద ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది పీకే టీమ్.
విశాఖలో పీకే బృందం సర్వే వైసీపీ నేతల్లో ప్రకంపణలు రేపుతోంది. సర్వే చెక్‌లిస్ట్ అంతా వైసీపీ పాలన, వైసీపీ నేతల పని తీరు, నామినేటెడ్ పోస్టులు, అసంతృప్తులు, పబ్లిక్ ఇమేజ్, ప్రజల్లో నాయకులపై వ్యతిరేకత.. ఇలా వైసీపీ లీడర్స్‌పై పీపుల్స్ పల్స్ తెలుసుకుంటోంది పీకే టీమ్.
సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని తెలుస్తోంది. ఏ నాయకుడిని అడిగినా.. ఏ ప్రజలను ప్రశ్నించినా.. విజయసాయిపై ఫిర్యాదులు చేస్తున్నారట. అధికారులు సైతం కేవలం విజయసాయి చెప్పినట్టే వింటున్నారని.. మిగతా నేతలను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మిగతా నాయకులందరినీ డమ్మీ చేశారని.. విశాఖలో విజయసాయి పెత్తనం బాగా పెరిగిపోయిందని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. విజయసాయి భూదందాలు, అక్రమాలపైనా కుప్పలు తెప్పలు కంప్లైంట్స్ వినిపిస్తున్నారట.
ఇక పీకే టీమ్ సర్వేతో వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయని అంటున్నారు. నామినేటెడ్ పదవులు ఆశించి దక్కిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు గుర్తించారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని.. ఆర్థికంగా అండగా నిలిచిన వారికే పదవులు ఇచ్చారనే నిరాశ నేతల నుంచి వ్యక్తం అవుతోంది.
ఇలా, సంస్థాగతంగా విశాఖ వైసీపీలో లోటుపాట్లను తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన పీకే టీమ్‌కు ఊహించనిరీతిలో నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోందని సమాచారం. ఆ విషయాలన్నీ క్రోడీకరించి.. విశ్లేషించి.. సీఎం జగన్‌కు సమగ్ర రిపోర్ట్ ఇవ్వనున్నారు. అయితే, పీకే బృందం విశాఖలో సర్వే చేస్తోందనే విషయం తెలిసి.. వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తమ గురించి ఎవరు ఎలాంటి అభిప్రాయాలు చెబుతున్నారో.. ఎవరు ఎవరికి ఎసరు పెడుతున్నారోననే అనుమానం స్థానిక వైసీపీ నాయకులను కలవరపాటుకు గురి చేస్తోంది. రానున్న రెండేళ్లూ.. జగన్‌కు కాకుండా, పీకే టీమ్‌కు భయపడుతూ బతకాల్సిందేనని అధికారపార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.