హుజురాబాద్ ఎన్నికల ఎఫెక్ట్.. సింగరేణిలో దసరాకు ముందే బోనస్
posted on Oct 5, 2021 @ 9:32PM
తెలంగాణలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది హుజురుబాద్ ఉప ఎన్నిక కేంద్రంగానే ఉంటోంది. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లోనే అమలు చేస్తున్నారు. ఏడేండ్లుగా పెండింగులో ఉన్న కొత్త రేషన్ కార్డుల పంపిణి హుజురాబాద్ లోనే తిరిగి మొదలైంది. 57 ఏండ్లకు పెన్షన్ స్కీం కూడా అక్కడే మొదటగా అమలవుతోంది. తాజాగా సింగరేణి కార్మికులకు దసరాకు ముందే బోనస్ ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్, ఇది కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే చేశారనే చర్చ సాగుతోంది. మాములుగా దీపావళికి బోనస్ ఇస్తుంటారు. కాని ఈసారి మాత్రం దసరాకు ముందే ఇస్తామని చెప్పడంతో ఈ చర్చ సాగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోనూ సింగరేణి కార్మికుల కుటుంబాలు భారీగానే ఉన్నాయి. అందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరమున్నదన్నారు. బొగ్గుతవ్వకంతో పాటు ఇసుక,ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని సిఎం తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సింగరేణిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలపడంలో కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని సిఎం అన్నారు. నిబద్దతతో నిరంతర శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్తుకోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గుతవ్వకంలోనే కాకుండా ఇసుక సున్నపురాయి ఇనుము తదితర ఖనిజాల తవ్వకాలలో వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. బొగ్గుతోపాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పనికల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థలో పనిచేసి రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రెండు వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పట్ల సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉద్యోగులకు సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను కేసిఆర్ ఆదేశించారు.