కేసీఆర్ కేంద్రంలో చేరబోతున్నారా? అందుకే అసెంబ్లీలో అలా అన్నారా?
posted on Oct 5, 2021 @ 7:22PM
కేసీఆర్. రాజకీయ చాణక్యుడు. ఇటీవల రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర పెద్దలను వరుసబెట్టి కలిశారు. మోదీని మీట్ అయ్యారు. అమిత్‌షాతో రెండు సార్లు భేటీ అయ్యారు. పలువురు కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపారు. అన్ని రోజులుండి.. ఇంకా ఎవరెవరిని కలిశారో.. ఏం మాట్లాడారో మాత్రం బయటకు రాలేదు. ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ సమావేశాల సారాంశం ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అప్పుడే అనుమానం వచ్చింది. గులాబీ బాస్ అన్ని రోజులు హస్తినలో ఉండటమేంటని? బీజేపీ బాసులతో అంతగా మీటింగ్‌లు ఎందుకంటూ.. అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. అయితే, నిప్పు ఉన్నా.. పొగ మాత్రం బయటకు రాలేదు. తాజాగా, తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన మాటలతో కాస్త క్లారిటీ వచ్చినట్టైంది. మరోసారి విశ్లేషణలు మొదలయ్యాయి. ఇంతకీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఏమన్నారంటే...
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావొచ్చు. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ఇదీ ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగ్స్. కేసీఆర్ లాంటి నేత.. ఇలాంటి వ్యాఖ్యలను అంత ఈజీగా అనేస్తారా? ఆ మేరకు ఏదో విషయం ఉండి ఉంటేనే ఆయన అలా అని ఉంటారనే విశ్లేషణ మొదలైపోయింది. కేంద్రంలో టీఆర్ఎస్‌కు పాత్ర దొరికే అవకాశం కావొచ్చు.. అన్నారంటే గులాబీ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్యం అవుతుందనేగా ఆ మాటకు అర్థం? అంటే, కేసీఆర్ ఎన్డీయేలో చేరబోతున్నారా? కేంద్రంలో మంత్రి పదవులు తీసుకుంటారా? అంటూ చర్చ మొదలైపోయింది.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. కాంగ్రెస్ కనుక ఒక్కసారి పైకిలేస్తే.. మళ్లీ ఆ పార్టీని అణగదొక్కడం అంత ఈజీ కాదు. కేసీఆర్‌కు పక్కలో బల్లెంలా మారిన రేవంత్‌ను, కాంగ్రెస్‌ను బలంగా తొక్కేసేయాలని అదను కోసం కేసీఆర్ చూస్తున్నారు. మధ్యలో పానకంలో పుడకలా బీజేపీ ఎగిరెగిరిపడుతోంది. అటు, బీజేపీకి సైతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్సే ప్రధాన శత్రువు కానీ, టీఆర్ఎస్ కానే కాదు. అందుకే, హస్తం పార్టీని అణచివేయాలనే వ్యూహంలో.. ఉమ్మడి ప్రయోజనాల కోసం.. ఆ రెండు పార్టీలు రాజీ పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతిచ్చి.. ఆ మేరకు కొన్ని మంత్రి పదవులు ఆశించే అవకాశం లేకపోలేదు. మరి, కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్‌తో అవసరమేంటనే అనుమానం రావొచ్చు.
ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలనాథులకు వార్ వన్‌సైడ్ కాకపోవచ్చు. పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. వచ్చేసారి బీజేపీ ఎంపీ స్థానాలకు భారీగా గండి పడే అవకాశం ఉంది. అందుకే, ఆ సమయానికి అవసరమైతే టీఆర్ఎస్ మద్దతు తీసుకోవాలనేది కమలం ప్లాన్. అందుకే.. సీఎం కేసీఆర్ నర్మగర్బంగా.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావొచ్చు.. అని అసెంబ్లీలో అన్నారని అంటున్నారు. ఇటీవలి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఆ మేరకు ప్రాథమిక చర్చలు జరిగాయని ఇప్పటికే లీకులు వచ్చాయి. ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు.. బీజేపీ-టీఆర్ఎస్ కలిసినా కలవొచ్చు. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.