ఏకగ్రీవ సంప్రదాయం సరైనదేనా?
posted on Oct 5, 2021 @ 7:03PM
పొరుగు రాష్ట్రం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కాకలు రేపుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. నిజానికి ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందు నుంచే అధికార తెరాస, ప్రథాన ప్రత్యర్ధి బీజేపీ ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నాయి. అక్టోబర్ 2 న నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. అయితే అదే రోజున, అదే షెడ్యూలు ప్రకారం పోలింగ్ జరిగే ఏపీలోని కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గంలో మాత్రం సందడి లేదు. ఎన్నికల వాతావరణం పెద్దగా కనిపించడం లేదు.
సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ నిర్ణయం తీసుకోవడంతో అంతవరకు అంతో ఇంతో ఉన్నట్టు అనిపించిన ఎన్నికల వేడి, ఒక్కసారిగా చప్పగా చల్లారి పోయింది. అంతకు ముందే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ కూడా అధికార పార్టీ దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి వెంకట సుబ్భయ్య సతీమణి, దాసరి సుధకు టికెట్ ఇవ్వడంతో, తమ పార్టీ అభ్యర్ధిని నిలపడం లేదని ప్రకటించారు.జనసేన మిత్ర పక్షం బీజేపీ పోటీకి దిగుతామని ప్రకటించినా, రాష్ట్రంలో బీజేపీ బలం సున్నాకు ఎక్కువ నోటాకు తక్కువ, కాబట్టి, బీజేపీ పోటీని ఎవరూ సీరియస్’గా తీసుకోవడం లేదు. ఆటలో అరటి పండులానే చూస్తున్నారు.అందుకే,అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అన్నట్లుగా బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్ధి డాక్టర్ సుధ గెలుపు ఖరారైపోయిన నేపధ్యంలో ఎన్నికల వేడి ఇలా పుట్టి అలా చల్లారి పోయింది.
అధికార పార్టీ అభ్యర్ధి, దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి వెంకట సుబ్భయ్య సతీమణి, దాసరి సుధ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, కడప మేయర్ సురేశ్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఏపీ సగర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గానుగపెంట రమణమ్మ, అనుడా చైర్మన్ గురుమోహన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇంతమంది నాయకులు వెంటవచ్చినా, ఏ ఒక్కరిలోనూ ఉత్సాహం అనేది ఏ కొంచెం కనిపించలేదు.నిజానికి, తెలుగు దేశం పార్టీ అందరికంటే ముందే, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినా, ఓబులాపురం రాజశేఖర్’ని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. ప్రచారం కూడా ప్రారంభించింది. అయితే, అధికార పార్టీ దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే టికెట్ ఇవ్వడంతో, టీడీపీ పోలిట్బ్యూరో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పార్టీలు పాటించిన సంప్రదాయం ప్రకారం, టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే దివంగత ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులు పోటీచేస్తే, ప్రత్యర్ధి పార్టీలు పోటీకి అభ్యర్ధులను నిలపరాదనే సంప్రదాయం విషయంలో ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మేథావి వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ విధంగా దివంగత ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమనే భావన కూడా ఉంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఈ సంప్రదాయం ఏర్పడిందో కానీ,(కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరిని నక్సల్స్ హత్య చేసిన సందర్భంలో ఈ సంప్రదాయం మొదలైనట్లు గుర్తు) అన్ని సందర్భాలలో ఇదే సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పాటించలేదు, విభజిత రాష్టాలలోనూ పాటించలేదు. తెలంగాణలో దుబ్బాక,నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో అధికార తెరాస దివంగత ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చింది, అయినా, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్ధులను నిలిపాయి. దుబ్బాకలో అయితే,దివంగత ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినా, అక్కడ బీజేపీ అభ్యర్ధి విజయం సాదించారు. నిజానికి, ఒక్క దుబ్బాకలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా దివంగత ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు పోటీ చేసి ఒడి పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సంప్రదాయం విషయంలో పునరాలోచన చేయవలసిన అవసరం ఉందని అంటున్నారు.
అదలా ఉంటే, ఇప్పుడు బద్వేల్’లో అధికార పార్టీ అభ్యర్ధి గెలుపు ఖరారైన నేపధ్యంలో,వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దాదాపు రూ.300 కోట్లతో సాగు, తాగు నీరు ప్రాజెక్టులను ప్రకటించింది.అదే విధంగా బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో పనులు చేపట్టింది. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.1000 కోట్లతో సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ వస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు, అవసరం తీరిపోయింది కాబట్టి ప్రారంభించిన పనులు, వాగ్దానం చేసిన ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోతాయని ప్రజలు కూడా అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు.