తప్పైపోయింది.. ఇంకోసారి చేయం.. లెంపలేసుకున్న వైసీపీ సర్కారు..
posted on Oct 6, 2021 @ 4:37PM
గోడ కనబడితే చాలు గోకుడే. ఉన్న రంగు గోకేసి.. వైసీపీ రంగులు పూసేయడమే పనిగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. గోడ కనిపించిన చోటల్లో నీలం, ఆకుపచ్చ రంగులు వేసేసింది. గతంలో పంచాయతీ బిల్డింగులను అన్నింటినీ ఇలా వైసీపీ రంగులతో నింపేయడంతో.. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టూ మొట్టికాయల మీద మొట్టికాయలు వేసింది. ఆ తలబొప్పి తగ్గకముందే.. మళ్లీ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై కన్నేసింది. చెత్త ప్రభుత్వం కాబట్టి.. చెత్త తయారీ భవనాలకు పార్టీ రంగులు వేస్తే సింబాలిక్‌గా ఉంటుందనుకున్నారో ఏమో.. వాటికీ ఆ మూడు రంగులు పులుమేసింది. దీంతో.. మరోసారి హైకోర్టు ముందు దోషిగా నిలబడింది వైసీపీ సర్కారు. అక్కడ గట్టి వార్నింగ్ పడటంతో.. ఈసారి సుప్రీంకోర్టుకు వెళ్లకుండా.. బుద్దిగా కోర్టు చెప్పినట్టు చేసి.. లెంపలేసుకున్నంత పని చేసింది జగన్‌రెడ్డి ప్రభుత్వం. ఇంతకీ ఏం జరిగిందంటే....
ఏపీలో ఇక ప్రభుత్వ ఆస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయబోమని హైకోర్టులో సర్కార్ ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఇప్పటి వరకూ వేసిన రంగులన్నీ తీసేస్తున్నామని చెప్పింది. ఇక ముందు ఆ తప్పు జరగబోదని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ స్వయంగా హైకోర్టుకు తెలిపారు.
టీడీపీ హయాంలో చెత్త నుండి సంపద తయారీ అంటూ వర్మీ కంపోస్ట్ కేంద్రాలను నిర్మించారు. ఇటీవల అధికారులు వాటికి వైసీపీ రంగులేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు ఇదేం పద్దతని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రంగులు తీసేయాలని.. ఇక ముందు సైతం వేయబోమని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన గడువు చివరి రోజు రావడంతో హడావుడిగా ప్రమాణపత్రం దాఖలు చేశారు. రంగులు తీసేశామని.. ఇక ఏ ప్రభుత్వ భవనానికీ రంగులు వేయబోమని ప్రమాణం చేసింది జగన్ ప్రభుత్వం.
గతంలో పంచాయతీ భవనాలపై రంగులు వేసిన అంశంలోనూ సుప్రీంకోర్టు వరకూ పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన ఏపీ ప్రభుత్వం చివరికి రంగులు తీయాల్సిందేనని తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా హైకోర్టు చెప్పిన వెంటనే రంగులు తీసేసింది. భవిష్యత్‌లో కూడా వేయబోమని ప్రమాణపత్రం దాఖలు చేసింది. కాదూ కూడదంటే.. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే ప్రమాదం ఉండటంతో ఉన్నతాధికారులు ఇలా అఫిడవిట్ దాఖలు చేయక తప్పలేదు. ఈ బుద్దేదో పంచాయతీ ఎన్నికలప్పుడే వచ్చుంటే.. మళ్లీ ఇలా కోర్టు ముందు దోషిగా నిలబడే దుస్థితి వచ్చుండేది కాదుగా? అని ఎద్దేవా చేస్తున్నారు విమర్శకులు.