రంజాన్, క్రిస్టమస్‌లకే కానుకలా? దసరాకి గిఫ్ట్‌లు ఏవి?
posted on Oct 6, 2021 @ 4:19PM
దసరా పండుగ రాబోతోంది. శరన్నవరాత్రుల సీజన్ ఇది. దుర్గమ్మ కొలువున్న ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడపోతోంది. వేడుకగా జరిగే దసరా పండుగకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవుతోంది. ఇదే అంశంపై తాజాగా ఎంపీ రఘురామ స్పందించారు. రంజాన్ పండుగకు తోఫాలు, క్రిస్టమస్‌కు కానుకలు ఇస్తారని.. మరి హిందువుల పండుగలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
పండుగలతో పాటు వివిధ అంశాలపైనా స్పందించారు రఘురామ. అమరావతిని పాఠ్యాంశం నుంచి తీసేయడం దారుణమన్నారు. అసలు అమరావతి పాఠ్యాంశం ఎందుకు తీసేయాల్సి వచ్చిందని రఘురామ నిలదీశారు.
నరేగా నిధులపై హైకోర్టు తీర్పు హర్షనీయమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదన్నారు. అందరికీ నరేగా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెండర్లకు ప్రభుత్వం పిలిచినా.. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో ఎక్కడ టెండర్లు వేసినా తెలుగువారు ముందుంటారు కానీ ఏపీలో టెండర్లు పిలుస్తే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని రఘురామ అన్నారు.