TOP NEWS @ 7pm
posted on Oct 6, 2021 @ 6:56PM
1. ఏపీలో రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని, అవినీతి, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ సీఎం జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ‘‘ఒక సైకో నుంచి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఎదురైందని.. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
2. తాలిబన్ దేశం నుంచి ఏపీకి డ్రగ్స్ సరఫరా అవుతోందని టీడీపీ నేత పట్టాభి మరోసారి ఆరోపించారు. డ్రగ్స్‌తో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి సంబంధం ఉన్నా.. పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం సరికాదన్నారు. ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని హెచ్చరించారు. ఆధారాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేస్తామని పట్టాభి తెలిపారు. మరోవైపు, కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత పట్టాభి, ఇతర నాయకులపై వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు.
3. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌పై ఉన్న 11 ఛార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని రఘురామ స్పష్టం చేశారు.
4. రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నా కేంద్రంలో చలనం రాలేదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను బయటకు రానివ్వడం లేదని, పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. యూపీ ఘటనలో కేంద్రమంత్రి కొడుకును ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ ఒక్కటేనని జగ్గారెడ్డి ఆరోపించారు.
5. జడ్జీలను దూషించిన కేసులో సీబీఐ చేసిన దర్యాప్తుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించిన స్టేటస్ రిపోర్టును సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్ వేశామని అధికారులు కోర్టుకు తెలిపారు. విదేశాల్లో ఉన్న నిందితులను విచారించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
6. హైకోర్టు దెబ్బకు జగన్ ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు.. పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయబోమంటూ ఆయన న్యాయస్థానంలో ప్రమాణపత్రం దాఖలు చేశారు.
7. తెలుగు అకాడమీ నిధుల స్కాం కేసులో 10 మందిని అరెస్ట్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. స్కాంలో మూడు కేసులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారించామన్నారు. రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ తెలిపారు. స్కాంలో సాయికుమార్ ప్రమేయం చాలా కీలకంగా ఉందన్నారు.
8. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. వివిధ అలంకరణలో భక్తులకు దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. 12వ తేదీన సరస్వతి దేవి అలంకరణ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
9. దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్ట ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు.
10. లఖింపూర్ ఘటన సున్నిత అంశమని, దీనిని అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌లో వాతావరణాన్ని పాడు చేయాలని ప్రయత్నించొద్దని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక చేశారు. మరోవైపు, యూపీ మంత్రి శ్రీనాథ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ బాధిత కుటుంబాలతో సెల్ఫీలు దిగేందుకే ప్రతిపక్ష పార్టీ నేతలు అక్కడికి వెళ్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటన కూడా అందుకే అని మంత్రి అనడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.