ప్రపంచంలో ధనవంతులైన బిచ్చగాళ్లు వీళ్లే.. హైదరాబాద్ లోనూ మిలియనీర్లు!
posted on Oct 6, 2021 @ 8:28PM
నగరాల్లోని సిగ్నల్ పాయింట్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, చౌరస్తాలో మనం చాలామంది బెగ్గర్స్‌ని చూస్తూ ఉంటాం. వారు పొట్టకూటి కోసం యాచిస్తూ కనిపిస్తారు. అయితే వీళ్లలో కొందరి సంపాదన తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. కొంతమంది బిచ్చగాళ్లు మిలియనీర్లుగా కూడా ఉన్నారు. మెట్రోపాలిటన్లలో కొంతమంది యాచకులు బహుళ ఫ్లాట్లు కలిగి ఉన్నారంటే నమ్మాల్సిందే. అడుక్కుంటూ ఇంత సంపాదించారా అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతగా సంపాదించినా వారు ఇప్పటికీ యాచిస్తూనే ఉంటారు.
ప్రపంచంలోని ధనవంతులైన బిచ్చగాళ్ల గురించి తెలుసుకుంటే షాక్ అవాల్సిందే. వీరికి ధనవంతులలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉంటారు. కానీ ఇప్పటికీ వీధుల్లో యాచిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ధనవుంతులైన బిచ్చగాళ్లలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు లండన్ కు చెందిన సైమన్ రెట్. ఇతని మొత్తం ఆస్తి 5 లక్షల యూకే ఫౌండ్లు. లండన్‌లోని పుట్నీ హై స్ట్రీట్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్ వెలుపల చిరిగిపోయిన బట్టలు ధరించి యాచిస్తాడు.సైమన్ సంవత్సరానికి 50 వేల బ్రిటన్ ఫౌండ్లు సంపాదిస్తాడు. ఖరీదైన భవంతిలో నివస్తాడు. సైమన్ గురించి తెలుసుకున్న లండన్ మేజిస్ట్రేట్ షాకయ్యారు. యాచించకుండా అతనిపై నిషేదం విధించారు. అయినా యాచిస్తూ పలుసార్లు పోలీసులకు చిక్కాడు సైమన్ రైట్. కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. అయినా ఏదో ఒక చోట పోలీసుల కళ్లుగప్పి యాచిస్తూనే ఉంటాడు.
భారత్ లో అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా ముంబైలోని భారత్ జైన్ ఉన్నారు. ప్రపంచంలో ఇతనిది రెండో స్థానం. భారత్ జైన్ నికర ఆస్తి రెండు కోట్లు. ఇతడు ఎక్కువగా ముంబైలోని పరేల్ ప్రాంతంలో యాచిస్తాడు. జైన్ రోజుకు 10 గంటలు యాచించడం ద్వారా రోజుకు సుమారు 2500 సంపాదిస్తాడు. ఇతని ఆదాయం సగటు భారతీయ ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ. ముంబైలోని ఆజాద్ మైదాన్ లేదా ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో భారత్ జైన్ ఎక్కువగా యాచిస్తారు. భరత్ జైన్ కు పటేల్ నగర్‌లో 80 లక్షల రూపాయల విలువ చేసే రెండు 1 BHK అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. భాండుప్‌లో ఒక వాణిజ్య స్థలాన్ని కలిగి ఉన్నాడు. ఈ స్థలాన్ని అతను నెలకు 10,000 అద్దెకు ఒక జ్యూస్ షాపుకు ఇచ్చాడు.
సౌదీ అరేబియాకు చెందిన ఈషా నికర విలువ 1 మిలియన్ డాలర్లు. ఈషా చనిపోయాకా ఆమె ఆస్తులు ప్రపంచానికి తెలిశాయి. ఈషా మరణించినప్పుడు ఆమె వయస్సు 100 సంవత్సరాలు. ఆమె మరణం తర్వాత, ఈషా చిన్ననాటి స్నేహితురాలు సయీది 1 మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఆమె ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఆమె సంపదలో ఆమె మరణం తర్వాత అధికారులకు అప్పగించిన 4 భవనాలు ఉన్నాయి. సయీదీ చెప్పిన వివరాల ప్రకారం ఈషా యాభై సంవత్సరాలుగా యాచిస్తోంది. ఈషా తల్లి, సోదరి కూడా యాచించేవాళ్లు. వీళ్లు ఏడాది పొడవునా, ముఖ్యంగా ఈద్ సమయంలో ఎక్కువగా డబ్బులు సంపాదించేవారు. ఈషా ఆస్తులలో అనేక కుటుంబాలు ఉచితంగా నివసిస్తున్నాయి.
యూఎస్ కు చెందిన ఇర్విన్ కోరీ యాచన ద్వారా సంపాదించి మిలియనీర్ అయ్యారు. ఇర్విన్ మొత్తం ఆస్తి నాలుగు మిలియన్ యూఎస్ డాలర్లు. ఇర్విన్ కోరీ ప్రముఖ హాస్యనటుడు. అతను విజయవంతమైన కెరీర్‌తో మంచి సంపదను సంపాదించాడు. అతను 3.5 మిలియన్ డాలర్ల విలువైన భవనంలో నివసించేవాడు. పదవీ విరమణ తర్వాత గత 17 సంవత్సరాలుగా అతను యాచిస్తున్నాడు. మాన్హాటన్ లోని 35 వ వీధి ఆయన సెంటర్. ఇర్విన్ ప్రతిరోజు 150-250 ఫౌండ్లు సంపాదిస్తాడు. అంటే అతను గత 17 సంవత్సరాలుగా యాచించడం ద్వారా ఒక మిలియన్ USD కంటే ఎక్కువ సంపాదించాడు. యాచన ద్వారా వచ్చే డబ్బును ఇర్విన్ క్యూబాలోని ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తాడు.
ఇక ముంబైకి చెందిన సంభాజీ కాలే ప్రొఫెషనల్ బిచ్చగాడు. కొత్త ముంబైలో నివసిస్తున్నాడు,ఇతని కుటుంబంలో నలుగురు ఉన్నారు. వాళ్ల మొత్తం ఆస్తి కోటిన్నర రూపాయలు. సంభాజీ కాలేకి సాంప్రదాయక ఉద్యోగం లేదు, అతను మరియు అతని నలుగురు కుటుంబం ముంబై వీధుల్లో డబ్బు కోసం అడుక్కుంటూ రోజు గడుపుతారు. ప్రతిరోజూ సంభాజీ కుటుంబం వేలాది రూపాయలను ఇంటికి తెస్తుంది. కుటుంబం వారి నెలవారీ ఖర్చుల తర్వాత ప్రతి నెలా 50 వేల రూపాయలు ఆదా చేస్తుంది. కొంత పెట్టుబడి కంపెనీలలో పెడుతుంది. పెట్టుబడులు కూడా సంభాజీకి లాభాలు తెచ్చిపెట్టాయి. సంభాజీకి ముంబైలో ఒక ఫ్లాట్ మరియు షోలాపూర్ సిటీలో రెండు ఇళ్లు ఉన్నాయి.
భారతదేశంలోని ధనిక బిచ్చగాళ్ల జాబితాలో మూడో నెంబర్ కోల్‌కతాలో నివసించే లక్ష్మి. ఈమె1964 నుంచి అంటే 16 సంవత్సరాల వయసులో కోల్‌కతాలో యాచించడం ప్రారంభించింది.50 సంవత్సరాలకు పైగా భిక్షాటన ద్వారా లక్షల రూపాయలు సేకరించింది. నేటికీ లక్ష్మి యాచన ద్వారా ప్రతిరోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది. ముంబైలో నివసిస్తున్న గీతా కూడా గొప్ప బిచ్చగాళ్ల జాబితాలోకి వస్తుంది. ముంబైలోని చార్ని రోడ్ వద్ద గీత యాచిస్తూ ఉంటుంది. ఆమెకు సొంత ఫ్లాట్ ఉందని, ఆమె తన సోదరుడితో కలిసి నివసిస్తుందని చెబుతారు. గీత యాచించడం ద్వారా ప్రతిరోజూ సుమారు 15 వందల రూపాయలు సంపాదిస్తుంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ బిచ్చగాళ్లకు కొదవలేదు. వేలాది మంది యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రతి ప్రధాన కూడలిలో బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వీళ్లలోనూ చాలా మంది లక్షలాధికారులు ఉన్నారని చెబుతారు. కొందరికి ఖరీదైన భవంతులు కూడా ఉన్నాయంటారు. అయినా యాచక వృత్తిని మాత్రం ఆపడం లేదు.