రూ. 130 కోట్లకు ఐపీ పెట్టి వ్యాపారీ పరారీ.. చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం
posted on Oct 6, 2021 @ 3:29PM
చిత్తూరు జిల్లాలో మరో ఘరానా మోసం బయటపడింది. బట్టలు, వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి వేలాది మందిని మోసం చేసి ఐపి పెట్టి పరారయ్యాడు.విషయం తెలుసుకున్న బాధితులు అతని బట్టల దుకాణం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ షాపు వద్ద ఆందోళన చేపట్టారు. వ్యాపారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు వ్యాపారి సుమారు రూ. 130 కోట్లకు పైగా ఐపి పెట్టి పరారైనట్లు సమాచారం.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కేంద్రంలో వస్త్ర వ్యాపారి పాండురంగయ్య శెట్టి గత 60 సంవత్సరాలుగా వస్త్ర దుకాణం నిర్వహించారు. ఆయనపై ఉన్న నమ్మకంతో స్థానికులు ఆయన వ్యాపారానికి అప్పుగా పెద్ద మొత్తం ఇస్తూ వచ్చారు. దాదాపు 998 మందికి పైగా రూ. 130 కోట్ల మేర ముట్ట చెప్పినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారికి సకాలంలో పిలిచి వడ్డీని ఇవ్వడంతో మరికొందరు అప్పు ఇచ్చారు.ఇలా డబ్బు ఆశతో కోట్ల రూపాయలు ఇచ్చి మోసపోయారు బాధితులు..
గత 5 రోజులుగా ఈ వస్త్ర వ్యాపారి మృతి చెందాడని పుకార్లు వచ్చాయి. మంగళవారం వస్త్ర వ్యాపారి కోర్టులో ఐపి వేస్తున్నారని సమాచారం రావడంతో బాధితులు ఆందోళనలో పడ్డారు. వ్యాపారి తన కుటుంబ సభ్యులతో సహా అదృశ్యం కావడంతో అప్పులిచ్చిన బాధితులు పెనుమూరులోని తమ దుకాణం వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు నచ్చచెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు డీఎస్పీ సుధాకర్ రెడ్డి.
వ్యాపారి పాండురంగయ్య శెట్టి ఫ్యామిలీ పరారీలో ఉండటంతో లబోదిబోమంటున్న 998 మంది బాధితులు. పాండురంగయ్య ఆస్తి 14 కోట్లుగా ఉంటే అతని అప్పు 130 కోట్లు పైగానే ఉందంటున్నారు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పులు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది మధ్యతరగతి, పేద ప్రజలే ఉన్నారు. పిల్లల చదువుల కోసమని కొందరు, ఆడపిల్లల పెండ్లీల కోసమని మరికొందరు కష్టపడి కూడబెట్టిన డబ్బులు కావడంతో బోరుమంటున్నారు. పెద్ద మొత్తం కావడంతో జిల్లా కోర్టుకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదని న్యాయస్థానం తిరస్కరించడంతో బాధితులు హై కోర్టును ఆశ్రయించినట్లు తెలియవచ్చింది.