దేశానికి నేనే దిక్కు .. మమతా బెనర్జీ హాట్ కామెంట్స్..
posted on Oct 7, 2021 @ 1:53PM
“కాంగ్రెస్ పార్టీ పనై పోయింది. బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అందుకే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి,ఆధు నవ భారత నిర్మాణ బాధ్యతను దేశ ప్రజలు తృణమూల్ పై ఉంచారు”, భవానీపూర్ ఉపఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకున్న తృణమూల్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన బోల్డ్ స్టేట్మెంట్ ఇది.
అంటే ఈ దేశానికి తానే దిక్కని ఆమె చెప్పకనే చెప్పారు. బీజేపీని ఎదిరుంచి నిలిచే శక్తి, యుక్తి, కుయుక్తి తనకు మాత్రమే ఉన్నాయని, ఆమె, ఒక సంచలన ప్రకటన చేశారు. ఇంతవరకు, రాష్ట్రాల్లో ఎలా ఉన్నా,బీహార్ వంటి రాష్ట్రల్లో కాంగ్రెస్ ప్రాతీయ పార్టీల నాయకత్వంలో పోటీ చేసినా, దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి (యూపీఏ)కి కాంగ్రెస్, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి (ఎన్డీఏ)కి బీజేపీనే సారధ్యం వహిస్తున్నాయి. కానీ, ఇప్పుడు విపక్షాల నాయకత్వ పీఠం నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించి తృణమూల్’ను ప్రతిష్టించేందుకు మమత సిద్డమయ్యారు.
నిజానికి, మమత ఇప్పుడు తమ మనసులోని మాటను బయట పెట్టారు. కానీ, ఆమెలో అలాంటి భావన ఒకటి ఎప్పటినుంచో గూడుకట్టుకుని ఉందని, ఆమె సన్నిహితులు ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. ఆమెలో జాతీయ అకాక్షలు ఉన్నాయన్నది రహస్యమేమీకాదు. అది అందరికీ తెలిసిన నిజం. దేశ ప్రధాని కావలానే, ఆశ ఆకాంక్ష ఆమెలో ఎప్పటి నుంచో నిండుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత మే ఢిల్లీ వెళ్లి ఓ వారం రోజులు అక్కడే ఉండి, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికీ బీజేపీ, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి, ఒక ప్రయత్నం చేశారు. ఇపుఉడు మళ్ళీ ఆ దిశగా మరో అడుగు వేశారు. అదేమీ తప్పుకాదు కానీ, ఆమె అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి, అనే విషయంలో మాత్రం ఎవరికుండే అభిప్రాయం వారికుంది. భవానీపూర్ ఉపఎన్నికల్లో గెలిచి, ఈరోజు (గురువారం అక్టోబర్ 7) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న మమతా బెనర్జీ, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక, “జాగో బంగ్లా”లో ‘ఢిల్లీ పిలుస్తోంది’ మకుటంతో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఆమె, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, త్రుణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో దేశ ప్రజలు తృణమూల్ వైపు చూస్తున్నారు. దేశ ప్రజలంతా కట్టకట్టుకుని, దేశాన్ని బీజేపీ ఫాసిస్ట్ పాలననుంచి కాపాడే శక్తి సామర్ధ్యాలు ఒక్క తృణమూల్ కాంగ్రెస్’కు మాత్రమే ఉన్నాయనే నమ్మకానికి వచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.
అంతే కాదు బీజేపీతో బహుముఖ పోరాటం చేసే సత్తా సామర్ధ్యం తమకే ఉన్నాయని కూడా ఆమె చెప్పు కొచ్చారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది.కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోంది. అదలా ఉంటే, తృణమూల్ ముందు ఇప్పుడు మరో సవాలు వచ్చి పడింది. ఢిల్లీ పిలుస్తోంది’ . దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధనాల నుంచి, ప్రజావ్యతిరేక రాజకీయాల నుంచి ఉపశమనం కోరుకుంటున్నారు. ఫాసిస్ట్ శక్తులను ఓడించాలని కోరుకుంటున్నారు, ఆ బాధ్యతను తమపై ఉంచారని’’ఆమె తమ వ్యాసంలో చెప్పు కొచ్చారు. అలాగే, దేశ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ ఆలంబనగా నవభారత స్వప్నం కంటున్నారని, ఆమె పేర్కొన్నారు. ఇప్పడు తృణమూల్ బెంగాల్ సరిహద్దులను దాటింది అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. బెంగాల్ ముందుండి (బెంగాల్ అంటే మమత) దేశాన్ని నడిపించాలని కొరుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ ఒకే వేదికపైకి వచ్చి ప్రజల అకాక్షలు నేరవేర్చాలని మమతా బెనర్జీ వ్యాసంలో పేర్కొన్నారు.
ఒక విధంగా ఇది మమతా బెనర్జీ అహంభావానికి నిదర్శనంగా కనిపించవచ్చును కానీ, మమతా బెనర్జీ వెనకుండి ముందుకు నడిపించే ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని,రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ప్రశాంత్ కిశోర్ ప్రోద్బలంతోనే ఇటీవలనే, గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని వదిలి తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. అలాగే, అంతకు ముందే, అస్సాంకు చెందిన మహిళా అధ్యక్షురాలు సుమిత్రా దేవ్, కూడా ప్రశాంత్ కిశోర్ చొరవతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. ఆమెను, మమతా బెనర్జీ రాజ్యసభకు పంపుతున్నారు.ఇలా, ప్రశాంత్ కిశోర్, దేశ రాజకీయ చిత్ర పాఠం నుంచి కాంగ్రెస్ పార్టీని తొలిగించి, మమతా కాంగ్రెస్సే భారత జాతీయ కాంగ్రెస్ అనే విధంగా చరిత్రను చిత్రించే వ్యూహం తో ముందుకు సాగుతున్నారు. అయితే ఎంత ప్రశాంత్ కిశోర్ వ్యూహమే అయినా, మమత అన్నట్లుగా బీజేపీని ఎన్నికలలో ఎదుర్కోవడంలో వరసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ విఫలమైన మాట నిజమే అయినా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు, ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరుకోవడం,అంత ఈజీ విషయం అయితే కాదు. ఇది గతంలో అనేక మార్లు రుజువైంది.
మరోవైపు ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలను కాంగ్రెస్, ఎన్సీపీ,బీజీపీ యేతర పార్టీలు కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తిస్తున్నాయి. అందుకే, రాహుల్ గాంధీ యువ నాయకత్వం సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త హంగులు దిద్దుతున్నారు. అలాగే, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ప్రశాంత్ కిశోర్ ట్రాప్’లో పడేందుకు సిద్దంగా లేవన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి అంటున్నారు. ఎరైనా, చివరకు ప్రశాంత్ కిశోరే,అయినా, కొందరిని కొన్ని సందర్భాలలో మోసం చేయవచ్చును కానీ, ఆదరిని అన్ని సందర్భాలలో మోసం చేయడం కుదరదని, అది అయ్యే పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.