టాప్ న్యూస్ @ 1PM
posted on Oct 7, 2021 @ 1:06PM
పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరింది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. ఆ లేఖను పరిశీలించి నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
------
నియంత, అసమర్ధుడు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. జగన్ ఒక్క చాన్స్ తీసుకోని ప్రజలకు బ్రతికే చాన్స్ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులను జగన్ వాళ్ల తాత ఆస్తుల మాదిరిగా తాకట్టు పెడుతున్నారని కన్నా విమర్శించారు. అమ్మ ఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నాన్న చేతిలో మద్యం బాటిల్ పెట్టి దోచుకుంటున్నారన్నారు. నవరత్నాలు పేరుతో ఓట్లు కొనుకొంటున్నారని విమర్శించారు.
------
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై గురువారం హైకోర్టు డివిజినల్ బెంచిలో విచారణ జరిగింది. ఈనెల 4 న రూ.372 కోట్లు పంచాయతీ అకౌంట్లలో జమ చేశామని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. గతంలో పంచాయతీ అకౌంట్లలో జమ చేసిన రూ.1100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో కేవలం రూ.60 కోట్లు మాత్రమే పంచాయితీ అకౌంట్లలో ఉన్నాయని తెలిపింది. దసరా లోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
------
వృద్ధులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.ఫించన్ రూ.3 వేలు పెంచుతామని చెప్పి మూడేళ్లు కావొస్తున్నా.. కనీసం రూ.300 కూడా పెంచకపోగా కుంటి సాకులు చెబుతూ ఉన్న ఫించన్లు కోత కోసి వృద్దుల కడుపు మాడుస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే అంటూ పెన్షన్ వృద్ధుల నోటి దగ్గర కూడును కూడా లాక్కోవడం అత్యంత దుర్మార్గమన్నారు
-------
గంజాయి వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బట్ట కాల్చి ముఖంపై వేస్తున్నాయని...తాలిబన్‌కు ఏపీకి సంబంధం అంటగడుతున్నారని అన్నారు. సీఎం ప్రతిష్టను దిగజార్చాలని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలను నివారించడానికి సెబ్ ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్‌లో డ్రగ్స్ దొరకాయని మోదీకి సంబంధం ఉందంటారా అని ప్రశ్నించారు.
------
బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యర్థి పేరును ప్రకటించారు. జాతీయ పార్టీ ప్రకటించిన జాబితాను విడుదల చేశారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇటీవలే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
----
బతుకమ్మలపై నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కారు వెళ్లడంపై దుమారం రేగుతోంది. మహిళల, తెలంగాణ రాష్ట్ర పండుగను కించపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లా ధర్మారెడ్డి అహంకారానికి ఈ ఘటన నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
----------
పంజాగుట్టలో శ్రీకృష్ణ జ్యువెల్లెర్స్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. మొత్తం ఆరు బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదు బయటపడినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో యజమానులను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
----------
లఖింపూర్ బాధితుల పట్ల యోగి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తమ పార్టీ నేతలను కాపాడుకోవడానికి బాధితులకు న్యాయాన్ని అందకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. న్యాయం పొందడం ప్రజల హక్కని, బాధితులకు న్యాయం అందే వరకు తన పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
------
ఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై బీజేపీ పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.లఖింపూర్ ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయిన కొత్త వీడియోను వరుణ్ గాంధీ షేర్ చేస్తూ రైతుల గుంపుపై కారు నడిపి, వారిని హత్య చేశారని వరుణ్ ఆరోపించారు.