జగనన్న సర్కార్ పిచ్చి పీక్స్.. వైసీపీ వెలుగుల్లో బెజవాడ దుర్గమ్మ గుడి!
posted on Oct 7, 2021 @ 1:53PM
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి.. ప్రభుత్వానికి సంబంధించిన ఓ కార్యక్రమానికైనా వైసీపీ రంగులు వేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలకు అవే రంగులు... దీనిపై కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా జగనన్న సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ స్కూళ్లకు వైసీపీ రంగులను వేయడం తీవ్ర వివాదాస్పమైంది. కోర్టు ఆదేశాలతో తిరిగి తొలగించాల్సి వచ్చింది. జగన్ సర్కార్ తీరుతో ఖజానాలు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ప్రభుత్వ వాహనాలకు చివరకు చెత్తను తరలించే వాహనాలకు కూడా అవే రంగులు వేశారు.
తాజాగా బెజవాడ కనకదుర్గ గుడికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఏపీలోని అన్ని దేవాలయాలను ముస్తాబు చేశారు. తిరుమల, శ్రీశైలం ఆలయాలతో పాటుగా బెజవాడ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ దీపాలతో అలంకరించారు. అయితే తిరుమల, శ్రీశైలం ఆలయాల్లో ఏటా కనిపించిన మాదిరే వేడుకల ఏర్పాట్లు కనిపించగా.. ఒక్క విజయవాడ కనకదుర్గ గుడిలో మాత్రం గతేడాది వేడుకలకు తాజాగా ఇప్పటి వేడుకలకు మాత్రం తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏర్పాట్లలో భాగంగా ఆలయం చుట్టూ అలంకరించిన విద్యుద్దీపాలు అచ్చు గుద్దినట్లుగా వైసీపీ జెండా రంగులతో కూడిన వెలుగులను విరజిమ్మాయి. ఈ చిత్రాలే ఇప్పుు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కనిపించిన ప్రతి దానికీ జగన్ సర్కారు తన పార్టీ రంగులు వేస్తూ వస్తోంది. దీనిపై కోర్టులు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నాయి. రంగుల విషయంలో హైకోర్టు సీరియస్ కావడంతో ఇకపై ఏ ప్రభుత్వ భవనానికి గానీ, వాహనానికి గానీ రంగులు వేయబోమని, తమ తప్పు తెలుసుకున్నామని తెలిపింది జగన్ రెడ్డి సర్కార్. అయితే క్లీన్ ఏపీ కింద కొనుగోలు చేసిన చెత్త సేకరణ యంత్రాలకు వైసీపీ రంగులను చెరిపేసిన తర్వాత మరోమారు కనిపించండంటూ జగన్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ అయిన గంటల వ్యవధిలోనే బెజవాడ కనకదుర్గ గుడి చుట్టూ వైసీపీ రంగులు కనిపించడం షాకింగ్ గా మారింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ఆలయమే. ఏ రకంగా చూసినా దుర్గ గుడి కంటే తిరుమల ఆలయం పెద్దదే. అయితే దుర్గ గుడి మాదిరిగా తిరుమల ఆలయం చుట్టూ విద్యుద్దీపాలు వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేసినా..అందులో వైసీపీ రంగులు కనిపించలేదు. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జుల ఆలయంంలో రాత్రి విద్యుద్దీపాలు వెలుగులు విరజిమ్మినా.. జగన్ పార్టీ జెండా రంగులు మాత్రం కనిపించలేదు. ఈ రెండు ఆలయాల్లో కనిపించని విధంగా ఒక్క బెజవాడ దుర్గ గుడి వెలుగుల్లో మాత్రమే వైసీపీ రంగులు కనిపించడంపై ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతోంది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం అయిన కారణంగానే దుర్గ గుడిలో వైసీపీ వెలుగులు కనిపించాయా? అన్న దిశగా చర్చలు సాగుతున్నాయి. బెజవాడ గుడిలో వైసీపీ రంగులను పోలిన విద్యుత్ దీపాలు అలంకరించడంపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. గుళ్లను కూడా వదలలేదా జగనన్న అంటూ సెటైర్లు వేస్తున్నారు.