120 కార్లు సీజ్.. ఐటీ రైడ్స్‌తో హల్‌చల్..
posted on Oct 7, 2021 @ 2:26PM
అదేదో సినిమాలో చూపించినట్టు.. ఐటీ అధికారులు హల్‌చల్ చేస్తున్నారు. మొత్తం 300 మంది ఆఫీసర్స్. టక్కుగిక్కు వేసుకొని.. టపటపా దూసుకొచ్చారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అంటూ ఇంట్లో అందరినీ కట్టడి చేశారు. ఇక తమదైన స్టైల్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే, సినిమాలో మాదిరి వీరేమీ నకిలీ ఐటీ అధికారులు కాదు.. నిజమైన ఆఫీసర్సే. తెల్లవారుజామున 5 గంటల నుంచి బెంగళూరు ఐటీ రైడ్స్‌తో హెరెత్తుతోంది.
ఒకటి రెండు కాదు.. 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ సిబ్బంది. పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్న పలువురు ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్‌హౌజులపై వందలాది మంది అధికారులు రైడ్ చేశారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది.
వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఛార్డెట్ అకౌంటెంట్ల నివాసాల్లో ఈ తనిఖీలు జరుపుతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సన్నిహితుడు అమిత్ ఉమేశ్ నివాసంలోనూ ఐటీ సోదాలు జరుగుతుండటం కలకలంగా మారింది. ఉమేశ్ నివాసం, కార్యాలయాలు, బంధువులకు చెందిన మొత్తం 6 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇక, కర్ణాటక ఇరిగేషన్ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇలా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ సన్నిహితుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దాడుల వెనుక రీజనేంటని తెగ చర్చించుకుంటున్నారు కన్నడ కమలనాథులు.