ఏపీలో నియంత పాలన.. 30 కోట్లు హాంఫట్.. కరెంట్ కిరికిరి.. టాప్ న్యూస్ @ 1pm

1. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం పట్ల టీడీపీ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తే దారులపై కక్ష సాధింపులా అని నిలదీశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని అన్నారు. 2. దేశంలో, రాష్ట్రంలో నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. దేశంలో ప్రజలను బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారన్నారు. దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ తీసుకువచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని తెలిపారు. మోదీ సోషలిస్ట్ విధానాలను పక్కనపెట్టి కాపిటలిస్ట్ విధానాలు తీసుకువచ్చి దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. 3. వైసీపీ నేతలు రూ. 30 కోట్లు హాంఫట్ చేశారు. పంటల బీమా సొమ్ములో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. పత్తి చేలుగా మామిడి, పామాయిల్ తోటలను చూపించి కోట్లలో బీమా సొమ్ము స్వాహా చేశారు. పత్తి సాగు చేయకుండానే వైసీపీ నేతలు తుఫానులో దెబ్బ తిన్నట్లు రికార్డులు పుట్టించారు. ఒక్క మైలవరం నియోజక వర్గంలోనే రూ. 4 కోట్లు స్వాహా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదే దందా. రూ. 30 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. 4. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అమ్మవారిని దర్శించుకోడానికి కొండ పైకి వెళ్తున్న ఆయన వాహనాన్ని ఘాట్ రోడ్డు వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో కేశినేని నాని తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే కొండపైకి వెళ్లి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. 5. రాయ్‌చూర్‌ ను తెలంగాణలో కలిపేయాలి’’ అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.‘‘తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి సరిహద్దుల ఆవల నుంచి కూడా ఈవిధంగా ధ్రువీకరణ లభిస్తోంది. సాక్షాత్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయ్‌చూర్‌ను తెలంగాణలో కలపాలని చెబుతున్నారు. ఆయన డిమాండ్‌ను స్వాగతిస్తూ అందరూ చప్పట్లు కొడుతున్నారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  6. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ....బీరుల తెలంగాణగా మార్చారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 7. దిశ కేసులో మాజీ సీపీ సజ్జనార్ వరుసగా రెండవరోజు  హైపవర్  కమిషన్ ముందు హాజరయ్యారు.  సజ్జనార్ ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. నేడు మరోసారి సజ్జనార్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. దిశ ఘటన పరిణామాల తరువాత ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై కమిషన్ విచారణ చేయనుంది. 8. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 1,72,113 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా ఉంది. 9. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వి.దుర్గా ప్రసాద్‌పై వేటు పడింది. ఏసీఏ నిబంధనలను ఉల్లంఘించారనే కారణాలపై అంబుడ్స్‌మెన్ విచారణ నిర్వహించింది. అంబుడ్స్‌మెన్ విచారణలో కార్యదర్శి దుర్గా ప్రసాద్‌పై వచ్చిన అభియోగాలపై విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో కార్యదర్శిని తప్పించడం‌తో పాటు 5 వేలు జరిమానా విధించారు. 10. విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. బొగ్గు కొరతతో పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు నెలకొనడంపై దృష్టి సారించింది. దేశంలో విద్యుత్ సంక్షోభం వస్తుందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం పీఎంవో సమీక్ష నిర్వహించనుంది. అసలు దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎన్ని, వాటికున్న బొగ్గు నిల్వలు ఏ మేరకు ఉన్నాయి.. ఇప్పటి వరకు బొగ్గు నిల్వలు అడుగంటిపోవడానికి గల కారణాలేంటి? వాటికి సంబంధించి కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖ ఏయే చర్యలు చేపట్టాయన్న విషయంపై పీఎంవో సమీక్ష నిర్వహించనుంది.  

టాలీవుడ్ పెద‌రాయుడు.. మోహ‌న్‌బాబును ఆప‌త‌ర‌మా? మెగా ఆధిప‌త్యం ఫ‌స‌క్కేనా?

మంచు మోహ‌న్‌బాబు. టాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌. ఆయ‌న‌కున్నంత టెంప‌రిత‌నం మ‌రెవ‌రికీ లేదంటారు. బ‌హిరంగ వేదిక‌ల‌పైనా ఆయ‌న నోటి దురుసును ఏమాత్రం త‌గ్గించుకోరు. తాజాగా, మా ఎన్నిక‌ల్లో మ‌రోసారి చెల‌రేగిపోయారు. త‌న‌యుడు మంచు విష్ణు బ‌రిలో నిల‌వ‌డం.. అటువైపు నుంచి ప్ర‌కాశ్‌రాజ్ ఉండ‌టం, ఆయ‌న్ను మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ చేయ‌డంతో 'మా' పోరు మామూలుగా జ‌ర‌గ‌లేదు. విష్ణు గెలిచారు అని చెప్ప‌డం కంటే మోహ‌న్‌బాబు త‌న‌ కొడుకును గెలిపించుకున్నార‌ని అన‌డ‌మే క‌రెక్ట్. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విష్ణునే ఒప్పుకున్నారు. ఇక‌, పోలింగ్‌కు ముందు, పోలింగ్ వేళ‌.. అసెంబ్లీ రౌడీలా రెచ్చిపోయారు మోహ‌న్‌బాబు. ఓ సంద‌ర్భంలో న‌టుడు బెన‌ర్జీని చంపేస్తాన‌ని కూడా బెదిరించార‌ట‌. ఆ రెండు వారాలూ మోహ‌న్‌బాబు.. రాజ‌కీయ న‌వ‌ర‌సాలు పండించార‌నే చెప్పాలి. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు, సీనియ‌ర్ల‌కు స్వ‌యంగా ఫోన్ చేసి.. త‌న త‌న‌యుడికి ఓటేయ‌మ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ ఆరోప‌ణ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స్ట్రాంగ్ కౌంట‌ర్లు ఇస్తూ.. త‌గ్గేదే లే.. అంటూ స్ట్రాంగ్ పిల్ల‌ర్‌గా నిలిచారు. ఆన్‌లైన్ టికెట్ల వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మోహ‌న్‌బాబును బ‌య‌ట‌కు లాగాల‌ని ప్ర‌య‌త్నించినా.. 'మా' ఎన్నిక‌ల త‌ర్వాత స్పందిస్తానంటూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అలా..అలా.. 'మా' అధ్య‌క్షునిగా విష్ణు గెలుపులో అంతా తానై చ‌క్రం తిప్పారు మోహ‌న్‌బాబు.   సినిమా ఇక్క‌డితో అయిపోలేదంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. టాలీవుడ్‌లో ఇన్నేళ్లూ మంచు ఫ్యామిలీ కాస్త సైడ్‌వేస్‌లోనే ఉంది, దాస‌రి మ‌ర‌ణం, మోహ‌న్‌బాబు సినిమాల‌కు దూర‌మ‌వ‌డం.. పిల్ల‌లు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో.. మంచు ఫ్యామిలీ సిని ప‌రిశ్ర‌మ విష‌యాల్లో పెద్ద‌గా జోక్యం చేసుకునేది కాదు. అప్ప‌ట్లో టాలీవుడ్ డైమండ్ జూబ్లీ వేడుక‌ల్లో.. వేదిక మీద.. టాలీవుడ్ "లెజెండ్" అవార్డ్ విష‌యంలో.. మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్‌బాబు మ‌ధ్య తారాస్థాయిలో వివాదం జ‌రిగింది. మోహ‌న్‌బాబు అభ్యంత‌రంతో "లెజెండ్‌" అవార్డును స్వీక‌రించ‌నే లేదు చిరంజీవి. ఆ ప‌రిణామంతో ఆవేశంతో ఊగిపోయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. అదే వేదిక‌గా ప‌రోక్షంగా మోహ‌న్‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అప్ప‌టి నుంచి మోగా ఫ్యామిలీకి, మంచు కుటుంబానికి మ‌ధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్‌వార్ నెల‌కొంది. బ‌య‌ట‌కు తామిద్ద‌రం మంచి మిత్రుల‌మంటూ.. ఆ ఇద్ద‌రు న‌టులు.. ఎంత‌బాగా న‌టించినా.. వారి మ‌ధ్య వైరం జ‌గ‌మెరిగిందే. దాస‌రి మ‌ర‌ణం త‌ర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు చిరంజీవి. సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌న్నీ ఆయ‌న వ‌ద్ద‌కే వెళుతుంటాయి. ఇండ‌స్ట్రీలో మెగా-అల్లు ఆధిప‌త్యం కాద‌న‌లేనిది. ఇటు అక్కినేని, అటు ద‌గ్గుబాటి ఫ్యామిలీలు సైతం మెగా కుటుంబంతో అత్యంత స‌న్నిహితంగా ఉండ‌టంతో.. టాలీవుడ్ ఆ న‌లుగురిదే అన్న‌ట్టు సాగింది. ఆ ఏళ్ల ఆధిప‌త్యాన్ని.. సింగిల్‌గా చిత‌క్కొట్టారు మోహ‌న్‌బాబు. చిన్న ఫ‌లితంతో పెద్ద విజ‌య‌మే సాధించారు. మెగా కుటుంబం మ‌ద్దతుగా నిలిచినా కూడా.. ప్ర‌కాశ్‌రాజ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి.. "మా" మాదే.. ఇక‌పై టాలీవుడ్ కూడా మాదేన‌నే రేంజ్‌లో మీసం మెలేశారు మోహ‌న్‌బాబు.  అస‌లే ఆవేశ‌ప‌రుడు. ఆపై మెగా వైరం. అవ‌కాశం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోహ‌న్‌బాబుకు మా రూపంలో అనుకోని ఆయుధం చేజిక్కింది. ఇక మోహ‌న్‌బాబు.. టాలీవుడ్‌ పెద‌రాయుడిలా మారుతారా? టాలీవుడ్ రౌడీలా చెల‌రేగిపోతారా? మెగా ఆధిప‌త్యానికి చెక్ పెడ‌తారా? పెట్ట‌గ‌ల‌రా? ఇక‌పై మోహ‌న్‌బాబును ఆప‌త‌ర‌మా? 

చేరికలకు సీనియర్ల బ్రేకులు.. కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డే టార్గెట్టా?

తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోందా? పార్టీలో చేరికలను సీనియర్లు అడ్డుకుంటున్నారా? గాంధీభవన్ లో  అసలేం జరుగుతోంది? ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చగా మారింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామం కాగానే.. ఆ పార్టీలో జోష్ కనిపించింది. గతంలో పార్టీని వీడిన చాలా మంది నేతలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డితో మంతనాలు సాగించారు. దీంతో వాళ్లంతా హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరిగింది. కాని తర్వాత సీన్ మారిపోయింది. ఒకరిద్దరు నేతలు తప్ప ప్రచారం జరిగిన నేతలంతా కాంగ్రెస్ లో చేరలేదు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే చేరికలు ఆగిపోయాయని తెలుస్తోంది.  మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరికకు బ్రేకులు పడినట్లు సమాచారం. జిల్లాలో బలమైన బీసీ నేతగా ఉన్న ఎర్ర శేఖర్ జడ్చర్ల నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ  జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత లేదని ఉద్దేశంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చలు కూడా జరిపారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని భావించినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నెల 12న మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో జరగనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్ సభలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు పీసీసీ నుంచి కూడా సంకేతాలు వచ్చాయి. ఎర్ర శేఖర్ జడ్చర్ల నియోజకవర్గంలోని తన అనుచరుల వద్ద సమావేశం కూడా అయ్యారు. చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే సోమవారం సాయంత్రానికి సీన్ మారినట్లు సమాచారం. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని ఆయన సమక్షంలో చేరాలని సూచించారని తెలుస్తోంది. అయితే  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎర్ర శేఖర్ ను పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానానికి లేఖ రాయడంతో ఎర్ర శేఖర్ చేరిక ఆగిపోయిందని తెలుస్తోంది. కోమటిరెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా  ఎర్ర శేఖర్ రాకను వ్యతిరేకించారని అంటున్నారు. ఎర్ర శేఖర్ సోమవారం సాయంత్రం నుండి ఫోన్ లోనూ అందుబాటులో లేకపోవడం, ఇతర పలు విషయాలు శేఖర్ చేరికకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ లో తిరిగి చేరాలని భావించినా.. ఆయనకు కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా చేసిన హర్షవర్ధన్ రెడ్డి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు నేతలు వ్యతిరేకించడంతో వాయిదా పడుతూ వస్తోంది.  కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో కేడర్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇతర పార్టీలు వలసల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. పార్టీ చేరాలనుకుంటున్న వారిపై ఆపడం ఏంటనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి బలం పెరగకుండా ఉండాలనే లక్ష్యంతోనే కొందరు సీనియర్లు ఇలా అడ్డుపులల్లు వేస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతోంది. 

అమ్మఒడి అంత ఈజీ కాద‌మ్మా.. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన జ‌గ‌న‌న్న..

అమ్మఒడి. విద్యార్థుల‌కు ఆర్థిక ఒడి. ప్రైవేట్‌, గ‌వ‌ర్న‌మెంట్ అనే తేడా లేకుండా.. స్కూల్‌కు వెళ్లే ప్ర‌తీ స్టూడెంట్‌కు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తుంది ప్ర‌భుత్వం. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. కానీ, అమ‌లులోనే అనేక కొర్రీలు పెడుతోంది. ప్ర‌తీ స్టూడెంట్‌కు అమ్మఒడి రాదు.. కండీష‌న్స్ అప్లై అంటోంది. ఆ అర్హ‌త‌లు ఉన్న‌వారికే అమ్మఒడి ఇస్తామంటూ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసింది. తాజాగా, ఈ ఏడాది నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జ‌గ‌న్‌. 75 శాతం హాజ‌రు త‌ప్ప‌కుండా ఉంటేనే అమ్మఒడి వ‌ర్తిస్తుంది. లేదంటే.. ఆర్థిక సాయం బంద్‌.  ఇక‌, అమ్మఒడి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇక నుంచి విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యా సంవత్సరం మధ్యలో ఇస్తున్నారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2021-22) యథావిధిగా వచ్చే జనవరిలోనే ఇస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.  మ‌రోవైపు, ఉపాధ్యాయుల మ్యాపింగ్‌పైనా ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా దృష్టిపెట్టింది. ఈ విధానాన్ని టీచ‌ర్లు వ్య‌తిరేకిస్తున్నా.. దూకుడుగా ముందుకు పోతోంది. ఈ నెలాఖరు నాటికి మ్యాపింగ్‌ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.  తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపైనా త‌గ్గేదే లేదంటోంది ప్ర‌భుత్వం. ప్రభుత్వానికి అప్పగిస్తే నడుపుతామని, లేదంటే వారే ప్రైవేటుగా నడుపుకోవచ్చని బ‌య‌ట‌కు చెబుతున్నా.. లోలోన మాత్రం ఎయిడెడ్ స్కూల్స్‌ను విలీనం చేయాల్సిందేనంటూ స‌ర్కారు తీవ్ర ఒత్తిడి చేస్తోంద‌ని అంటున్నారు.    

రాయచూర్ ను తెలంగాణలో కలపండి..బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్.. కేటీఆర్ ట్వీట్

తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపండి అంటూ గతంలో మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహోర్‌ తాలూకాలోని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం  ఇచ్చారు. తాజాగా  కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్‌ డిమాండ్‌ చేయడం కలకలం రేపుతోంది. కర్ణాటక ఎమ్మెల్యే శివరాజ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. సోమవారం రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యేశివరాజ్.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్‌, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్‌ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్నారని అన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. అలా చేయలేకపోతే.. తెలంగాణలో కలిపేయాలని ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేశారు.  కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ పై తెలంగాణ  మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'తెలంగాణ ఖ్యాతి సరిహద్దులు దాటింది.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. అక్కడున్న ప్రజలంతా ఆయన సూచనను చప్పట్లతో స్వాగతించారు' అంటూ ట్వీట్‌చేశారు. దీనిపై వందల సంఖ్యలో నెటిజన్లు 'తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. కేసీఆర్‌ లాంటి సీఎం మరొకరు ఉండరు.. కేసీఆర్‌ పాలనకు ఫిదా అయిన బీజేపీ ఎమ్మెల్యే.. కేసీఆరా మజాకా' అంటూ ట్వీట్‌ల ద్వారా స్పందించారు. డాక్టర్‌ శివ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను అటాచ్‌ చేసి క్రిషాంక్‌ అనే టీఆర్‌ఎస్‌ నాయకుడు చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 

మల్లన్న సాగర్ లో 10 టీఎంసీలు.. ఆకాశమార్గంలో వీక్షించి పులకించిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో అత్యంత కీలకమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. కొన్ని రోజులుగా రిజర్వాయర్ లో నీటిని నింపుతుండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 10.6 టీంసీల నీరు ఉంది.  గోదావరి జలాలతో నిండుతున్న  భారీ జలాశయం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్  ఆకాశమార్గంలో వీక్షించారు. హెలికాప్టర్‌ ద్వారా గోదావరి జలాలు మల్లన్న పాదాలను తాకిన దృశ్యాలను చూసి గులాబీ బాస్ పులకించి పోయారు.  మల్లన్నసాగర్‌ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇటీవలే 10 టీఎంసీల గోదావరి జలాలను తరలించారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో అత్యంత కీలకమైన రిజర్వాయర్‌ నిర్మాణాన్ని విపక్షాలు అడ్డుకొన్నప్పటికీ.. సీఎం పట్టుదలతో రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తిచేశారు.మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులు నింపుతూ.. చివరి ప్రాజెక్టు అయిన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టును 2020 ఏప్రిల్‌, మే నెలలో గోదావరి జలాలు ముద్దాడాయి. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌ను నింపి రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని పంపించడం వల్ల కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందిస్తున్నారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని తరలించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌తో ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు పక్కనే ఉన్న ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.  ఒకపక్క సిద్దిపేట అభయారణ్యం.. దాని అంచున వెలసిన అపూర్వ జలసిరి. సిద్దిపేట జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతం అంచున ఈ జలసిరి వెలుస్తున్నది. ప్రాజెక్టు కింద పోను మిగిలిన అటవీ ప్రాంతంలో మల్లన్న వనం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్‌ అటవీ అధికారులను ఆదేశించారు. నల్లమల అడవులను తలదన్నేలా ఈ అటవీప్రాంతం విస్తరించి ఉన్నది. ఇందులో తీరొక్క మొక్కలు, వన్యప్రాణులు, కుంటలు ఉన్నా యి. రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉన్న ఈ అటవీప్రాంతం 4,794.47 హెక్టార్లలో విస్తరిం చింది. ఇందులో 1,327.45 హెక్టార్ల అటవీ ప్రాంతం మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం తో మునిగింది. ఇది పోను 3,467.02 హెక్టార్ల బ్యాలెన్సు అటవీ ప్రాంతాన్నే 'మల్లన్న వనాలు'గా తీర్చిదిద్దేందుకు అటవీ అధికారులు కృషిచేస్తున్నారు.  రాజీవ్‌ రహదారి పక్కనే ఉం డటం వల్ల హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాం తాల నుంచి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను చూడటానికి ఇప్పటికే పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవిదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా.. దీనిని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా, అభయారణ్యం తరహాలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో వివిధ రకాల జంతువులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో చిరుత సంచరించింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం నుంచి 20 కి.మీ మేర అటవీ ప్రాంతం గుండా వెళ్తే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ ఈ అటవీ ప్రాంతం చుట్టూ అందంగా ఆవరించి కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ పునరుజ్జీవనంలో భాగంగా ఖాళీ భూమిలో వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఆయుర్వేద మొక్కలు పెంచుతున్నారు.   

'మందుల' రెడ్డి వెనకున్న రాజకీయ శక్తులెవరు? అక్రమ సొమ్ము బినామీలెవరు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డిపై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసులో స‌హ నిందితుడిగా ఉన్న హెరిటో ఫార్మా చైర్మ‌న్ బండి పార్ధ‌సార‌ధి రెడ్డికి సంబంధించి చీక‌టి కోణాలు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నాలుగు రోజులుగా హెటిరో ఫార్మా కార్యాల‌యాలు, యూనిట్లు, కంపెనీ డైరెక్ట‌ర్లు, సీఈఓ ఇళ్ల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు. రూ. 142 కోట్ల నగదు సీజ్ చేశారు.  6 రాష్ట్రాల్లో హెటిరో సంస్ధల్లో 60 చోట్ల 4 రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని గుర్తించారు. బీరువాల నిండా రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి. నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్‌ చేశారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ. 142 కోట్లు దాచారని అధికారులు వెల్లడించారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని తెలిపారు. ఒక్కో అల్మారాలో రూ. 5 కోట్ల నగదు దాచారని తెలిపారు.  బీరువాల్లో లబించిన డబ్బుల కట్టలు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్నారు.హెటిరో సంస్థ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూసిన‌ట్లుగా శ‌నివారం ఐటీ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.  హెటిరో ఫార్మాలో రూ.550 కోట్ల నిధుల‌కు అస‌లు లెక్క‌లే లేవ‌ని, ఇందులో రూ.142.87 కోట్ల మేర న‌గ‌దు ప‌ట్టుబ‌డిందని వెల్లడించింది .కంపెనీకి సంబంధించి చీక‌టి కోణాలు కూడా భారీ ఎత్తునే వెలుగు చూసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. హెటిరో ఫార్మాకు సంబంధించిన ప్ర‌ధాన కార్యాల‌యం హైద‌రాబాద్‌లోని స‌న‌త్ న‌గ‌ర్‌లో ఉంది. ఇక ఆ సంస్థ ఉత్ప‌త్తి చేసే ఔష‌ధాల‌కు సంబంధించి హైద‌రాబాద్‌తో పాటు విశాఖ‌ల్లోనూ యూనిట్లు ఉన్నాయి. అయితే ఐటీ సోదాలు మాత్రం ఆ సంస్థ‌కు చెందిన‌విగా భావించిన 50 ప్రాంతాల్లో జ‌రిగాయి. ఓ ప్రాంతంలో సోదాలు చేస్తే.. ఆ సంస్థ‌కు చెందిన మ‌రో స్థావ‌రం బ‌య‌ట‌ప‌డుతూ వ‌చ్చాయి. ఇలా హైద‌రాబాద్‌లోని బోర‌బండ‌లోనూ ఓ కీల‌క స్థావ‌రం కూడా ఐటీ అధికారుల దృష్టికి వ‌చ్చింది. హెటిరో ర‌హ‌స్య స్థావ‌రంగా భావిస్తున్న ఈ డెన్‌లోనే  ఏకంగా రూ.142.87 కోట‌మ్ల న‌గ‌దు క‌ట్ట‌ల రూపంలో బ‌య‌ట‌ప‌డిందని తెలుస్తోంది. ఈ న‌గ‌దును త‌ర‌లించేందుకు ఐటీ అధికారులు ఏకంగా నాలుగు వాహ‌నాల‌ను వినియోగించాల్సి వచ్చింది. ఈ న‌గ‌దుకు సంబంధించి ఒక్క‌టంటే ఒక్క పత్ర‌మూ లేద‌ట‌. అస‌లు విశాలంగా ఉన్న కంపెనీ హెడ్ ఆఫీస్ ఉండ‌గా.. బోర‌బండ‌లోని సీక్రెట్ డెన్‌ను ఆ సంస్థ యాజ‌మాన్యం ఏర్పాటు చేసుకున్న వైనం.. యాజ‌మాన్యం అక్ర‌మాల‌ను ఇట్టే క‌ళ్ల‌కు క‌ట్టేసిన‌ట్టుగా చెప్పింది.  ఇటీవ‌లే దేశంలో అత్యంత ధ‌న‌వంతుల జాబితాను హురూన్ అనే సంస్థ విడుద‌ల చేసింది. ఈ జాబితాలో హెటిరో చైర్మ‌న్‌గా ఉన్న పార్థ‌సార‌ధి రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.  ఈ జాబితాకు వారం ప‌ది రోజుల ముందు ఆయ‌న‌కు టీటీడీ బోర్డులో వ‌రుస‌గా రెండో సారి స‌భ్య‌త్వం ఇచ్చింది  జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు. ఈ జాబితా విడుద‌లైన రెండు రోజుల‌కే ఐటీ అధికారులు దాడులు మొద‌లెట్టేశారు. ఒక్క‌రోజుతోనే దాడులు ముగించ‌క‌పోగా.. రోజుల త‌ర‌బ‌డి సోదాలు.. రోజుకో కొత్త డెన్‌ను వెలికి తీస్తూ అందులోని అక్ర‌మాలు లాగేశారు. హెటిరో సంస్థల్లో భారీగా నగదు, బ్లాక్ మనీ పట్టుబడటంతో ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది. హెటిరో సంస్థ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే వాదన వస్తోంది. అక్రమ సొమ్ముకు బినామీలెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. 

రూ.2వేలు దాటేసిన గ్యాస్.. లీట‌ర్ పాలు రూ.వెయ్యికిపైనే.. వింటున్నారా మోదీజీ!

దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర వెయ్యి దిశ‌గా దూసుకుపోతోంది. లీట‌ర్ పాలు సెంచ‌రీ కొట్టేందుకు సై అంటున్నాయి. పప్పులు, నూనెలు ఇలా అన్ని నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లూ పైపైకి పెరుగుతున్నాయి. మోదీ పాల‌న‌లో ఇదేమి ధ‌రాఘాత‌మంటూ సామాన్యులు అల్లాడిపోతున్నారు. ధ‌ర‌ల‌పై మండిప‌డుతూనే.. జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గ్యాస్ బండ ధ‌ర వెయ్యి ఉంటేనే మ‌నం ఇంత ఇదైపోతున్నాం.. అదే గ్యాస్ సిలిండ‌ర్ రేట్ రూ.2,657కి చేరితే..? అందులోనూ రెండు రోజుల గ్యాప్‌లోనే రూ.1257 పెరిగితే ప‌రిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. లీట‌ర్ పాలు వంద వైపు ప‌రుగులు పెడితేనే ప‌రేషాన్ అవుతున్నాం.. అదే లీట‌ర్ మిల్క్ రేట్ 2 డేట్ గ్యాప్‌లో వెయ్యి రూపాయ‌లు పెరిగి రూ.1195కి చేరితే..? గ్యాస్, మిల్క్ అనే కాదు.. ప‌ప్పు, పంచ‌దార‌, నూనె, బియ్యం, గోధుమపిండి.. ఇలా ప్ర‌తీ ఒక్క ఐట‌మ్‌.. ఆకాశాన్ని అంటితే..? వాటిని కొనేదెలా? తినేదెలా? అందుకే, ఏం కొనేట‌ట్టు లేదు.. ఏం తినేట‌ట్టు లేదంటూ.. సింహ‌ళ భాష‌లో బాధ‌ప‌డుతున్నారు శ్రీలంక వాసులు. ఎందుకంటే.. ఇదంతా శ్రీలంక‌లో ధ‌ర‌ల మోత గురించే....  శ్రీలంక‌లో ఒక్కసారిగా నిత్యావసర ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. శుక్రవారం రూ.1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్‌ సిలిండర్ ధర.. స‌డెన్‌గా రూ.2,657కు చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాల ధర రూ.250 నుంచి రూ.1195కు చేరింది. అన్నిర‌కాల నిత్యావసర వస్తువులతో పాటు సిమెంట్ త‌దిత‌ర వ‌స్తువుల ధ‌ర‌లూ భారీగా పెరిగాయి. ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక దేశం. నిత్యావసర ధరల నియంత్రణను శ్రీలంక‌ ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం.  ఏడాదిగా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో శ్రీలంక‌ విదేశీ మారక ద్రవ్యం విలువ భారీగా పతనమైంది. కరోనా కార‌ణంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు అయిన‌ పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వాటికి కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి.. ఫలితంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో రాజ‌ప‌క్సే ప్ర‌భుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. అది కూడా బెడిసికొట్టింది. ధరలపై నియంత్రణ తీసుకురావడంతో నిల్వ‌ల‌ను బ్లాక్ మార్కెట్ చేసేశారు వ్యాపారులు.  అక్రమ నిల్వలు పెరిగిపోవ‌డంతో మార్కెట్లో సరఫరా తగ్గి ఆహార కొరత ఏర్పడింది. దీంతో, హ‌డావుడిగా ధరలపై నియంత్రణ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది ప్ర‌భుత్వం. స‌ర్కారు ఇలా నియంత్ర‌ణ ఎత్తివేయ‌గానే.. ధ‌ర‌లు చుక్క‌ల‌ను తాకేలా అమాంతం పెంచేశారు వ్యాపారులు. ఫ‌లితంగా.. శ్రీలంక‌లో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.2,657.. లీట‌ర్ పాల రేటు రూ.1195. మ‌న ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం గ్యాస్ బండ ధ‌ర వెయ్యి స‌మీపంలో ఉంది. భ‌విష్య‌త్తులో ఇక్క‌డా 2వేలు దాటేసినా ఆశ్చ‌ర్యపోన‌వ‌స‌రం లేదంటున్నారు.   

రెండు రోజుల్లో అంధకారంలోకి ఏపీ? జగనన్న పాలన స్పెషలా? 

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోంభం ముదురుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలను భారీగా బాదడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పవర్ భారం అలా ఉండగానే.. ఇప్పుడు కోతలు మొదలుకావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో.. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో  విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు,మూడు రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అంటున్నారు. విద్యుత్ కోతలు తప్పవని పాలకులే చెబుతుండటంతో ఏపీలో ఏం జరగబోతుందోనన్న చర్చ మొదలైంది.  విద్యుత్ సంక్షోభం, చార్జీల పెంపుపై సీఎం జగన్ కు తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ప్రజలకు భారంగా మారాయని మండిపడ్డారు నారా లోకేష్. కరెంట్ ట్రూఅప్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడినపెట్టాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారని ఆరోపించారు. వైసీపీ పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలు తప్ప మరేముందని విమర్శించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.20,261 కోట్ల అప్పులు చేశారని, ఆ భారాన్ని ట్రూఅప్ చార్జీల పేరుతో లాగేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. యూనిట్ గరిష్ఠంగా రూ.20కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ లోకేశ్ ప్రశ్నించారు. యూనిట్ కు అదనంగా చెల్లిస్తున్న రూ.10 ఎవరి జేబులోకి వెళుతోందని నిలదీశారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసి ప్రజలపై భారాన్ని మోపడంతో పాటుగా, నేరాన్ని కేంద్రంపై మోపే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్‌ రంగంలో సంక్షోభం తలెత్తిందని కేశవ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో వచ్చే నెలలో ఇళ్లకు కరెంట్ ఉంటుందో ఉండదో చెప్పలేమంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఏపీకి కరెంట్ గండం.. జగన్ పై లోకేష్ ఆగ్రహం.. బండికి వార్నింగ్.. టాప్ న్యూస్@ 7PM

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఉత్సవర్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బర్డ్‌ ఆస్పత్రికి చేరుకుని చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు అలిపిరి మెట్ల మార్గాన్ని, నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ------- టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ప్రజలకు భారంగా మారాయని తెలిపారు. కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూఅప్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడినపెట్టాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారని లోకేష్ ఆరోపించారు.  ----- రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చన్నారు. ఇళ్లలో కరెంట్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-8 మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు. బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు. డబ్బు వెచ్చించినా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదన్నారు సజ్జల.  --- ఈనెల 30న జరగనున్న బద్వేలు ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. నామినేషన్లు పరిశీలించారు. బద్వేలు ఉప ఎన్నిక కోసం 27 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, నేటి పరిశీలనలో 9 మంది అనర్హులుగా తేలారు. వారి నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం బద్వేలు బరిలో 18 మంది మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13 వరకు గడువు ఉంది. --- హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 61 మంది నామినేషన్‌ వేశారు. అయితే 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బరిలో 43 మంది అభ్యర్థులు నిలిచారు. 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంది. అదే రోజు అభ్యర్థుల ఫైనల్ లిస్టును అధికారులు  ప్రకటించనున్నారు. ------- ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శంషాబాద్‌, ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీ సమేతంగా వెళ్లిన కేసీఆర్... చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత  సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు. ------ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌కి మద్దతిచ్చిన వారిని తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు. జనసేన పోరాడే పార్టీగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉద్యమ రైతులను చంపించిన బీజేపీకి మద్దతెలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.  -------- దేశంలో అనేక రాష్ట్రాలో విద్యుత్, ఇంధన రంగ సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీలతో నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలో విద్యుత్ స్థితిగతులు, బొగ్గు కొరతలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఎన్టీపీసీఅధికారులు కూడా పాల్గొన్నారు. ---- జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో ఐదుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ తర్వాత కశ్మీర్‌లో పాక్‌ప్రేరిత తాలిబన్ల ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వాపోయారు. కశ్మీర్‌లో భయాలన్నీ నిజమౌతున్నాయన్నారు --------- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కీలక సంభాషణ ఫలవంతం అయింది. భారతీయులకు విధించిన క్వారంటైన్ నిబంధన ఉపసంహరించుకునేందుకు బ్రిటన్ నిర్ణయించింది. ఇకపై కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారతీయులను నేరుగా అనుమతించేందుకు సమ్మతి తెలిపింది. ఈ నిబంధన నేటి నుంచే అమల్లోకి వస్తుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. సరైన వ్యాక్సిన్ ధ్రువపత్రాలు చూపితే సరిపోతుందని పేర్కొన్నాయి.  

హిందుత్వానికి పంగ‌నామాలా? ఆయ‌న జ‌గ‌న్ బినామినా?

వైసీపీ అధికార ప‌త్రిక‌లో ఫుల్ పేజీ ప్ర‌క‌ట‌న. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇచ్చిన ఖ‌రీదైన యాడ్. తిరుమ‌ల‌లో కొత్త‌గా నిర్మించిన గోమందిరంను సీఎం జ‌గ‌న్ ప్రారంభించ‌బోతున్న‌ట్టు చెప్పే ప్ర‌క‌ట‌న అది. గోమందిరం నిర్మించిన ఏ.జే.శేఖ‌ర్ అనే ప్ర‌ముఖుడే పేప‌ర్లో ఈ యాడ్ ఇచ్చారు. ఇంత‌కీ ఆ ఏ.జే.శేఖ‌ర్ ఎవ‌రనేది ఆస‌క్తిక‌ర అంశం.  ఏ.జే.శేఖ‌ర్ అంటే వెంట‌నే తెలీక‌పోవ‌చ్చు కానీ, శేఖ‌ర్‌రెడ్డి అంటే మాత్రం కాస్త తెలిసిన పేరే అనిపిస్తుంది. ఆయ‌న గురించి డీటైల్స్ చెబితే.. ఓ.. ఆయ‌నా అని నోరెళ్ల‌బెడ‌తారు. గ‌తంలో పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో  అప్ప‌టి టీటీడీ బోర్డు మెంబ‌ర్, చెన్నైకి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ శేఖ‌ర్‌రెడ్డి ఇంట్లో క‌ట్ట‌ల‌కు క‌ట్ట‌లు కొత్త 2వేల నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. వంద‌ల కోట్ల విలువైన క‌రెన్సీ నోట్ల‌ను శేఖ‌ర్‌రెడ్డి ఇంట్లో సీజ్ చేశారు అధికారులు. ఆ శేఖ‌ర్‌రెడ్డినే ఈ ఏ.జే.శేఖ‌ర్‌. అప్ప‌ట్లో ఆయ‌న్ను లోకేశ్‌బాబుకు బినామీ అంటూ ప్ర‌చారం చేసింది వైసీపీ మూక‌. అప్పుడు టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా ఉన్న శేఖ‌ర్‌రెడ్డి.. ఇప్పుడు ఏ.జే.శేఖ‌ర్‌గా జ‌గ‌న్ పంచ‌న చేరి.. ఏపీలో సిలికా గనులు దక్కించుకున్నారని అంటారు. చెన్నై టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు ప్రెసిడెంట్ పదవి క‌ట్ట‌బెట్టి.. టీటీడీ బోర్డులో ప్రత్యేక అతిథునిగా చేసింది. ఆయ‌న తిరుమలలో గోమందిరం నిర్మించి.. సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం ప‌లుకుతూ.. సాక్షిలో ఖ‌రీదైన ఫుల్ పేజీ యాడ్ ఇవ్వ‌డం విశేషం. మ‌రి, ఒక‌ప్పుడు శేఖ‌ర్‌రెడ్డికి- నారా లోకేశ్‌కి లింక్ పెట్టి అభూత క‌ల్ప‌న‌లు అల్లిన వైసీపీ.. ఇప్పుడు ఏ.జే.శేఖ‌ర్‌.. సీఎం జ‌గ‌న్‌కు బినామీనా అని ప్ర‌శ్నిస్తే ఏం స‌మాధానం ఇస్తుందో మ‌రి?   ఇక జ‌గ‌న్ తిరుమ‌ల ప్ర‌క‌ట‌న‌పై పేప‌ర్లో ఫుల్ పేజీ క‌ల‌ర్ యాడ్ ఇవ్వ‌డంపై ప్ర‌తిప‌క్ష బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ప్రజలను నమ్మించడానికి తిరుపతిలో గోమందిర ప్రారంభోత్సవానికి వెలుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నారని  బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. కమిట్మెంట్ లేని కలర్ పత్రిక ప్రకటనలు అవసరమా? అని ప్రశ్నించారు. నిత్యం అసభ్య పదజాలంతో విమర్శించే పత్రికలకు కూడా ప్రకటనలు ఇచ్చి మరీ దేవాలయల ద‌గ్గ‌ర‌ జరుగుతున్న అన్యమత ప్రచారాలను పక్కదోవ పట్టించేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు.  ప్రచార జిమ్మిక్కులతో కాకుండా, టీటీడీ నియమాల ప్రకారం.. సీఎం జ‌గ‌న్‌ సతీసమేతంగా.. హిందు ఆచార సాంప్రదాయం ప్రకారం.. తిరుమలేశున్ని ఎప్పుడు సేవిస్తారని లంక దిన‌క‌ర్‌ నిలదీశారు. ఓవైపు అన్యమత ప్రచారానికి రాష్ట్రంలో ఊతం ఇస్తూ.. మరోవైపు జ‌గ‌న్‌ నుదుట బొట్టు పెట్టుకున్న ఫోటోతో పత్రిక ప్రకటన ఇచ్చి.. హిందత్వానికి జగన్మోహన రెడ్డి పంగనామాలు పెడుతున్నారని లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. రవాణా మంత్రి ఆర్యా రాజీనామా 

మరో నలుగు నెలల్లోఅసెంబ్లీ ఎన్నికల జరగనున్న ఉత్తరాఖండ్‌ లో అధికార బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యష్‌పాల్‌ ఆర్యా, ఆయన కుమారుడు, నైనిటాల్‌ ఎమ్మెల్యే సంజీవ్‌ ఆర్యాబీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. యష్‌పాల్‌ ఆర్యా తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పటికే ఆరు నెలలలో ముగ్గురు ముఖ్య మంత్రులను మార్చి, సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న బీజేపీకి  ఆర్యా తండ్రీకొడుకుల రాజీనామా గట్టి ఎదురు  దెబ్బగా పరిశీలకులు సైతం భావిస్తున్నారు. యష్‌పాల్‌ ఆర్యా, ఆయన కుమారుడు సంజీవ్‌ ఆర్యా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ  సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కున్నారు. నిజానికి, గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వరితించారు. 2007 నుంచి 2014 వరకు ఉత్తరాఖండ్ పీసీసీచీఫ్’గా ఉన్నారు. 2016లో ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పై తిరుగుబాటు చేసి  బీజేపీలో చేరారు.  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యశ్‌పాల్.. ఎన్‌డీ తివారీ హయాంలో 2002 మార్చి 15 నుంచి 2007 మార్చి 11 వరకు ఉత్తరాఖండ్ స్పీకర్‌గా ఉన్నారు. యశ్‌పాల్ కాంగ్రెస్‌ గూటికి వెళతారని కొద్ది రోజులుగా  ప్రచారం జరుగుతోంది. ఆయనను బీజేపీ నుంచి వెళ్లకుండా అడ్డుకోడానికి సీఎం పుష్కర్ సింగ్ ధామీ శతవిధాలుగా ప్రయత్నించారు. అయినా  చివరకు ఆర్యా సొంత గూటికి చేరారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం చూస్తుంటే ఉత్తరాఖండ్‌లో గాలి ఎటు వీస్తుందో స్పష్టమైన సంకేతమని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. యశ్‌పాల్‌ కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వచ్చినట్టయ్యిందని అన్నారు. 

హుజురాబాద్ బరిలో ముగ్గురు రాజేందర్లు.. ఈటలకు భారీ ఊరట..

తెలంగాణలో రాజకీయాల్లో కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కీలక పరిణామం జరిగింది. అధికార టీఆర్ఎస్ ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు భారీ ఊరట లభించింది. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు గురువారంతో ముగిశాయి. మొత్తం 61 మంది 69 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల పరిశీలనలో 19 మందికి చెందిన 23 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల తిరస్కరణలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఊరట కలిగింది. హుజురాబాద్ లో రాజేందర్ పేరుతో ఉన్న మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వాళ్ల ఇంటిపేరు కూడా ఈ తోనే వచ్చింది. దీంతో రాజేందర్ పేర్లతో ఓటర్లు తికమక పడే అవకాశం ఉందని, ఇది ఈటల రాజేందర్ కు నష్టం కల్గిస్తుందనే ఆందోళన బీజేపీలో వ్యక్తమైంది. అయితే నామినేషన్ల స్క్రూటీనీలో రాజేందర్ పేరుతో ఉన్న మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పలపల్లి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇమ్మడి రాజేందర్ నామినేషన్లు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. వీళ్లు  ముగ్గురు కూడా ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.  రాజేందర్ పేరుతో నామినేషన్లు దాఖలు కావడం వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఇ రాజేందర్ పేరుతో ఉన్న ఇతరులను తీసుకువచ్చి హుజూరాబాద్ లో నామినేషన్లు వేయించారని, ఓటర్లను గందరగోళానికి గురిచేసే కుట్ర చేసిందని మండిపడింజది. తాజాగా పరిశీలనలో వాళ్ల నామినేషన్లు తిరస్కరంచబడంతో కమలనాధులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున గెల్లు  శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున వెంకట్ బల్మూరి పోటీలో ఉన్నారు.

ప్ర‌జ‌లంతా కరెంట్‌ వాడకం తగ్గించుకోండి.. చేతులెత్తేసిన జ‌గ‌న్ స‌ర్కారు..

అనుకున్న‌ట్టే అవుతోంది. విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వం చేతులెత్తేస్తోంది. ఇప్ప‌టికే అన‌ధికారికంగా ఎడాపెడా క‌రెంట్ కోత‌లు విధిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే అధికారికంగా ప‌వ‌ర్ క‌ట్స్ త‌ప్ప‌క‌పోవ‌చ్చంటూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సాయంత్రం ఏసీలు వాడొద్ద‌ని అధికారులు వేడుకుంటుంటే.. ఇక‌, స‌జ్జ‌ల ప్ర‌జ‌ల‌ ముందుకు వ‌చ్చి.. ఏకంగా సాయంత్రం వేళ‌ల్లో ఏసీలే కాదు.. ఎలాంటి విద్యుత్ ఉప‌క‌ర‌ణాలూ వాడొద్దంటూ ఉచిత స‌ల‌హా ప‌డేశారు. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌గా.. తాజాగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేల్చిన‌ ప‌వ‌ర్ బాంబ్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌కంపితుల‌ను చేస్తోంది. ఇంత‌కీ సజ్జ‌ల‌ ఏమ‌న్నారంటే... ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సమస్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు విధించాల్సి రావొచ్చని హెచ్చరించారు. ఇళ్లల్లో కరెంట్‌ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-10 గంటల మధ్య విద్యుత్‌ వినియోగం తగ్గించాలని సూచించారు.  బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందని తెలిపారు. డబ్బు వెచ్చించినా ఇది పరిష్కారమయ్యే పరిస్థితి లేదని వివరించారు. విద్యుత్ అంశంపై కేంద్ర మంత్రి చెప్పింది అవాస్తవమన్నారు. సీఎం ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సజ్జల చెప్పారు.   ప్ర‌భుత్వ త‌ర‌ఫున స‌జ్జ‌ల చేసిన విజ్ఞ‌ప్తిపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇళ్ల‌లో క‌రెంట్ వాడ‌కం త‌గ్గించుకోవాల‌ని చెప్ప‌డ‌మేంట‌ని మండిప‌డుతున్నారు. క‌రెంట్‌తో అత్య‌వ‌స‌రం ఉండేదే.. సాయంత్రం 6 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌. అలాంటిది ఆ స‌మ‌యంలో క‌రెంట్ వాడ‌కం త‌గ్గించుకోవాలంటూ ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డమేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అన్నీ మేమే చేస్తే.. ఇక మీరున్న‌ది ఎందుకంటూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో ఎలాంటి విద్యుత్ సంక్షోభం లేకున్నా.. ఏపీలో మాత్రం ఈ విప‌రీత క‌రెంట్ కోతలు ఏంటంటూ.. ఇదంతా జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్య‌మేనంటూ మండిప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు.  వైసీపీ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా థర్మల్ ప్లాంట్లు మూతపడే స్థితికి చేరుకున్నాయని అంటున్నారు. విజయవాడ సమీపంలోని ఏకైక థర్మల్ ప్లాంట్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్‌లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. సరిపడ నిల్వలు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించారు. దీంతో విద్యుత్ కోతలకు రంగం సిద్ధమైనట్టేన‌ని తెలుస్తోంది.  అటు, అప్పు చెల్లించకపోవడంతో ఏపీలో విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి. హైడల్ పవర్‌తో పాటు ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న 15 వందల మెగావాట్లు.. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్‌తో ప్రస్తుతం రాష్ట్రాన్ని నడుపుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయాలంటే థర్మల్ విద్యుత్ మినహా ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకుండా పోయింది. థర్మల్ విద్యుత్‌కు సంబంధించి ఇప్పటికే రాయలసీమ, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఉత్పాదన ఖర్చు అధికంగా ఉందన్న కారణంతో ఈ రెండు ప్లాంట్లను మూసివేశారు. ఒక్క విజయవాడకు సమీపంలోని ఎన్టీటీపీఎస్‌లో మాత్రమే ఉత్పాదన జరుగుతోంది. దాని ప‌రిస్థితీ అంతంత మాత్రంగానే ఉండ‌టంతో.. ఇక త్వ‌ర‌లోనే ఆంధ్రప్ర‌దేశ్ అంధ‌కార‌మ‌యం కానుంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 

రేవంత్ తో కొండా దంపతులకు గ్యాప్! అందుకే పక్కన పెట్టేశారా?    

హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్ని పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. మండలాల వారీగా సీనియర్ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అధికార టీఆర్ఎస్ ఎన్నికల బాధ్యతలన్ని మంత్రి హరీష్ రావు చూస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులు హుజురాబాద్ లోనే మకాం వేశారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతర మంత్రులు సభలకు హాజరవుతున్నారు. బీజేపీ కూడా పార్టీ సీనియర్ నేతలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఆలస్యంగా ప్రచారంలోకి దిగిన కాంగ్రెస్ కూడా సీనియర్ నేతలను హుజురాబాద్ లో మోహరించింది. అయితే కాంగ్రెస్ ప్రచారకుల జాబితాలో మాజీ మంత్రి కొండా సురేఖ పేరు లేకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. అన్ని పార్టీలకు చెందిన వరంగల్ నేతలే ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొండా సురేఖది వరంగల్ జిల్లా అయినా ఆమెను ఎక్కడా ఇంచార్జ్ గా నియమించలేదు. అంతేకాదు హుజురాబాద్ లోని కమలాపుర్ మండలం గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన పరకాల నియోజకవర్గానికి కలుపుకునే ఉంటుంది. పరకాలతోనే కమలాపూర్ వాసులు అటాచ్ ఉంటారు. అయినా కొండాకు హుజురాబాద్ ప్రచారం బాధ్యతలు అప్పగించకపోవడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. నిజానికి హజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కొండా కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాననే సంకేతమిచ్చారు. బలమైన నేతగా ఉన్న కొండాను ఉప ఎన్నిక బరిలో దించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. అయితే  పార్టీలో సీనియర్ నాయకులు స్థానికులకే అవకాశం ఇద్దామని ప్రతిపాదించడంతో రేవంత్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందనే విషయం బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి వెంకట్ కూడా స్థానికుడు కూడా వెంకట్ ది పెద్దపల్లి, స్థానికురాలు కాదనే కారణంతో కొండా సురేఖను కాదన్నప్పుడు... పెద్దపల్లికి చెందిన వెంకట్ ను ఎలా ఖరారు చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది. వెంకట్ ను అభ్యర్థిగా పెట్టిన తర్వాత కొండాను బరిలోకి దించకపోవడానికి లోకల్ అంశం కారణం కాదని తేలిపోయింది. కొండా సురేఖ హుజూరాబాద్లో పోటీ చేయకపోవడం వెనక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ప్రతిపాదనను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని అంటున్నారు. ఓ సీటు విషయంలో సురేఖ పెట్టిన షరతును రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదని, అందుకే హుజురాబాద్ లో పోటి నుంచి కొండా తప్పుకున్నారని అంటున్నారు. భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో తాము సూచించిన అభ్యర్థులకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలో సీట్లు ఇవ్వాలని కొండా షరతు పెట్టారట. అయితే భూపాలపల్లి విషయంలో రేవంత్ ససెమిరా అన్నారట. అంతేకాదు కొండా దంపతులకు ఇష్టం లేకపోయినా గండ్ర సత్యనారాయణను రేవంత్ పార్టీలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఆయనకే భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. తన ప్రతిపాదనలను తిరస్కరించడంతో పాటు తమకు తెలియకుండానే గండ్ర సత్యనారాయణను కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో రేవంత్ రెడ్డిపై కొండా దంపతులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయంపై రేవంత్ ను నేరుగా అడిగారని తెలుస్తోంది. అందుకే కొండా దంపతులకు హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలు రేవంత్ రెడ్డి ఇవ్వలేదని కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతోంది. అయితే మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాకు నేతలను ఇంచార్జులుగా నియమించి.. హుజురాబాద్ లో మంచి సంబంధాలున్న కొండా దంపతులకు బాధ్యతలు అప్పగించకపోవడంపై కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.   

90 మంది సిట్టింగులకు ఫిట్టింగ్? వైసీపీ ఎమ్మెల్యేలకు  పీకే భయం? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గత ఎన్నికల్లో ఎలా గెలిచారో...అందరికీ తెలిసినవిషయమే. ఒక్కచాన్సు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని పాదయాత్ర పొడుగునా ఇచ్చిన హామీలు, నవరత్నాల పేరిట కురించిన ఉచిత వరాలు, ప్రత్యేక హోదా, రాజధాని విషయంలో చేసిన మోసపూరిత వాగ్దానాలు ఇలా అనేక కారణాల వలన చేత, వైసీపీ, జగన్ రెడ్డి ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్ సభ సీట్లు గెలుచుకున్నారు.  సహజంగా ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఐదేళ్ళపాలన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది అది నిజం.  టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పినట్లుగా టీడీపీ ఓటమిలో ఎంతోకొంత స్వయంకృతం కూడా ఉంటే ఉండవచ్చును. అయినా, ఇవన్నీ కూడా జగన్ రెడ్డి గెలుపుకు కారణమే అయినా, అసలు కారణం పీకే, ప్రశాంత్ కిశోర్. ఒక్క ఛాన్స్’డైలాగు అయినా నవరత్నాల  వంటకాలు  అయినా, అభ్యర్ధుల ఎంపిక మొదలు వైసీపే విజయానికి తోడ్పడిన ప్రతి అంశం కూడా, పీకే సృష్టే అనేది కొంచెం ఆలస్యంగానే అయినా అందరికీ తెలిసిన నిజం. గెలిచించి వేసీపీ, జగన్ రెడ్డే అయినా గెలిపించిన  వాడు మాత్రం పీకేనే, అనేది అందరూ అనుకునే విషయం. అందులో అంతా కాకపోయినా కొంతైనా నిజం ఉందనేది కాదన లేని నిజం.  అయితే, ఇలా, వందల (వేల?) కోట్ల రూపాయలు ఫీజుగా వ్యూహరచన చేసేవాడు ఎవడైనా, ఒకటే అలోచిస్తారు, తమ క్లైంట్’ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తారు.మంచి చెడు, తమ వ్యూహం, వేసే అడుగు  సమాజానికి మేలు చేస్తుందా? ఈడు చేస్తుందా? అనేది ఆలోచించరు. ఉచ్చనీచాలు పట్టించుకోరు. ప్రజలను మోసం చేసేందుకు ఏ మాత్రం వెనకాడరు. గత (2019) అసెంబ్లీ ఎన్నికల్లో మోసాలను మూటకట్టే, జగన్ రెడ్డిని పీకే గెలిపించారు. పర్యవసానం చూస్తున్నాం, అనుభవిస్తున్నామని జనాలు అంటున్నారు. పీకే ‘వ్యూహం’ లో భాగంగా మేనిఫెస్టోలో పెట్టిన, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దివాళా అంచుల్లోకి నేట్టేశాయి. అంతే కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్పు సూక్తం కూడా పేకే పుణ్యమే అంటున్నారు.  మళ్ళీ ఎన్నికలకు కూడా జగన్ రెడ్డి, పీకేతో డీల్ కుదుర్చుకున్నారని వార్తలొస్తున్నాయి. ఎవరో కాదు,స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయం  కాబినెట్ సమావేశంలో మంత్రుల చెవిలో వేశారు. ప్రశాంత్ కిశోర్ బృందం వస్తోంది, ఇక ఎన్నికల మూడ్ లోకి వచ్చేయండని  స్వయంగా ముఖ్యమంత్రే మంత్రులకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. అ వార్తలను, సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఖండించలేదు కాబట్టి నిజమే అనుకోవచ్చును.అంతే కాకుండా, ఇప్పటికీ పీకే బృందం ఎంట్రీ ఇచ్చందని, వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంకొన్ని చోట్ల ‘పని’ ప్రారంభించడం , నివేదికలు సిద్డంచేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సిట్టింగు ఎమ్మెల్యేలకు ‘తొలి ప్రమాద హెచ్చరిక’ లు అందినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సిట్టింగు ఎమ్మెల్యేలలో వణుకు మొదలైనదని అంటున్నారు.  పీకే పెరామీటర్స్ ప్రకారం చూస్తే  కనీసం తక్కువలో తక్కువ, అదికూడా ఇప్పటికున్న సమాచారం ప్రకారం 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు లేనేలేవు. అంటే ఏమి చేసినా వారు ఓడిపోవడం ఖాయం. మరో 40-50 మంది గత ఎన్నికల్లో కంటే రెట్టింపుకు పైగా ఖర్చుచేసి తమ అడుష్టాన్ని పరిక్షించుకో వచ్చును. అందుకు సిద్దం ఆయితేనే, టిక్కెట్ అశించాలని సందేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది. మరో వంక పీకే టీము, ఏపీ కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తాత్కాలిక ప్రాతిపదికిన  నెల‌కు ల‌క్షన్నర వేత‌నంతో పనిచేసేందుకు 150 మంది గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న మెరికలు కావాలని, దేశంలోని వివిధ ఐఐటీలను పీకే టీమ్ సంప్ర‌దించిన‌ట్టుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వీరు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తారు.  అంతే కాకుండా, పీకే టీము స్పీడ్ చూస్తుంటే, ముందస్తు ఎన్నికలు తప్పవనే భయం, ఆందోళన కూడా ఎమ్మెల్యేలు వ్యక్త పరుస్తున్నారు. మొత్తానికి, వైసీపీ ఎమ్మెల్యేలను  పీకే భయం వెంటాడుతోందని  ఎమ్మెల్యేల  మాటల్లోనే వ్యక్తమవుతోంది.

స‌జ్జ‌న్నార్ ద‌స‌రా ధూంధాం.. ఏపీ ఆర్టీసీ ఢాం ఢాం..

ద‌స‌రా వ‌చ్చేస్తోంది. తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ పండుగ హోరెత్తుతోంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో దేవీన్న‌వ‌రాత్రులు దేదీప్య‌మానంగా జ‌రుగుతున్నాయి. ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ భారీగా పెరిగింది. శుక్ర‌వారం ద‌స‌రా పండుగ కావ‌డంతో.. ప్ర‌యాణీకుల రాక‌పోక‌ల‌తో తెలుగురాష్ట్రాల్లో సంద‌డి నెల‌కొంది. సంద‌ట్లో స‌డేమియాలా.. ద‌స‌రా పండ‌గ‌కి ఎప్ప‌టిలానే దోచుకోడానికి సిద్ధ‌మైపోయాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు. ద‌స‌రా పేరు చెప్పి.. ప్ర‌త్యేక బ‌స్సుల‌ను సాకుగా చూపించి.. 50శాతం టికెట్ రేట్లు పెంచేసి.. ప్యాసింజ‌ర్ల‌ను దోచుకోవ‌డం ఏటేటా జ‌రిగే దోపిడీ తంతే. ఈసారి కూడా అలానే చేస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలు ద‌స‌రాకు స్పెష‌ల్ స‌ర్వీసులు న‌డిపిస్తూ.. టికెట్ ధ‌ర‌లు అమాంతం పెంచేశాయి. పండ‌గ పేరుతో ఖ‌జానా నింపేసుకోవాల‌ని స్కెచ్ వేశాయి. కాక‌పోతే చిన్న ఛేంజ్‌.  తెలంగాణ ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌న్నార్ రావ‌డంతో సీన్ మారిపోయింది. పండ‌గ పేరుతో ప్ర‌యాణీకుల‌ను దోచుకోవ‌డ‌మేంట‌ని అధికారుల‌పై మండిప‌డ్డారు. పెంచిన ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు పొందుతున్నారు. కానీ, ఏపీలో అలా లేదు. ఏపీలో ఆర్టీసీ ప్ర‌భుత్వంలో విలీన‌మైంది. ఆర్టీసీని ప్ర‌భుత్వ‌ప‌రం చేసేసి చేతులు దులిపేసుకున్నారు సీఎం జ‌గ‌న్‌.  ఇక, అస‌లే అప్పుల రాష్ట్రం. ఇప్ప‌టికే ప‌న్నుల‌పై ప‌న్నులు బాదేస్తున్నారు. లిక్క‌ర్ ఆదాయంతోనూ అప్పులు తెస్తున్నారు. ఆర్ అండ్ బీ ఆస్తుల‌నూ త‌న‌ఖా పెట్టేస్తున్నారు. ఎక్క‌డ అణాపైసా క‌నిపించినా.. లాగేసుకుంటున్నారు. అలాంటి వైసీపీ స‌ర్కారుకు ద‌స‌రా రావ‌డం పండుగలా మారింది. మ‌రేమీ ఆలోచించ‌కుండా అద‌న‌పు చార్జీలు బాదేసింది. ఓవైపు తెలంగాణ ప్ర‌భుత్వం పెంచిన ఛార్జీల‌ను త‌గ్గిస్తే.. ఏపీ మాత్రం అలానే కంటిన్యూ చేస్తోంది. ప్రయాణీకుల నుంచి ఒత్తిడి వ‌స్తున్నా.. డోంట్‌కేర్ అంటోంది.  ద‌స‌రా పండుగ‌కు ఏపీలో కంటే తెలంగాణ‌లోనే ర‌ద్దీ ఎక్కువ‌. ఏపీలో సంక్రాంతి ఎలానో.. తెలంగాణ‌లో ద‌స‌రా అలాగ‌. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా జంట పండుగ‌ల‌కు తెలంగాణ ప్ర‌జ‌లంతా సొంతూళ్ల బాట ప‌డ‌తారు. వ‌చ్చీపోయే వాళ్ల‌తో ఆ మూడు రోజులూ బ‌స్సుల్లో తెగ ర‌ద్దీ ఉంటుంది. ప్యాసింజ‌ర్ల డిమాండ్ మేర‌కు బ‌స్సులు న‌డ‌ప‌లేని స్థితి ఉంటుంది. అంత డిమాండ్ ఉండే తెలంగాణ‌లోనూ టికెట్ల రేట్లు పెంచ‌కుండా టీఎస్ఆర్టీసీ ప్ర‌యాణీకులు మ‌న్న‌న పొందుతుంటే.. తెలంగాణ‌తో పోలిస్తే ఏపీలో ర‌ద్దీ త‌క్కువ‌గా ఉండే ద‌స‌రాకు ఏపీఆర్టీసీ మాత్రం 50శాతం అధిక ధ‌ర‌లు వ‌సూలు చేస్తుండ‌టం విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.  ఇక‌, హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌, వైజాగ్‌, తిరుప‌తి, క‌ర్నూల్‌లాంటి న‌గ‌రాల‌ను న‌డిచే టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండ‌టంతో.. ఏపీఎస్ఆర్టీసీ బ‌స్సుల‌కు ఉన్న సీట్లు సైతం బుక్ కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. బ‌స్సులే ఖాళీగా ఉంటే.. టికెట్లు ఎవ‌రూ కొన‌క‌పోతే.. ఇక ధ‌ర‌లు పెంచి ఏం లాభం? స‌జ్జ‌న్నార్ నిర్ణ‌యంతో తెలంగాణ ఆర్టీసీకి ఫుల్ డిమాండ్ పెరిగితే.. ఆ దెబ్బ‌కు ఏపీ ఆర్టీసీకి దిమ్మ‌తిరిగి పోతోంది. రండి బాబూ రండి.. అంటూ ప్ర‌యాణీకుల‌ను వేడుకునే దుస్థితి వ‌స్తోంది. ఇప్ప‌టికైనా పెంచిన అధ‌న‌పు ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గిస్తేనైనా కాస్త తేరుకునే అవ‌కాశం ఉందంటున్నారు. మ‌రి, ఆ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కారు కాస్త వెన‌క్కి త‌గ్గుతుందా? ద‌స‌రాకు ఆర్టీసీని గ‌ట్టెక్కిస్తుందా? 

సీఎం కేసీఆర్‌కు చలిజ్వరమట! హుజురాబాద్ ఉపఎన్నికే కారణమా?

తెలంగాణ రాజకీయాలను హీటెక్కిక్కిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ప్రత్యేకమైన వ్యూహాలతో జనంలోకి వెళుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలో మూడు నెలల ముందు నుంచే జోరుగా ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం నామినేషన్లు ఘట్టం ముగిశాకే స్పీడ్ పెంచింది. హుజురాబాద్ లోని మండలాలు, గ్రామల వారీగా పార్టీ నేతలకు ప్రఛార బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హుజురాబాద్ లో మొదటి నుంచి కాంగ్రెస్ సైలెంటుగా ఉంది. దీంతో ఈటల రాజేందర్ గెలిచేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి వేస్తున్న వ్యూహాలతో ఉప ఎన్నికను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుందనే చర్చ సాగుతోంది. వెంకట్ నామినేషన్ సందర్భంగా కేసీఆర్ తో పాటు ఈటల రాజేందర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ దూకుడు పెంచడంతో హుజురాబాద్ లో సమీకరణలు మారిపోతున్నాయని అంటున్నారు. సోమవారం కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా బయటికి రావడం లేదని, మహాత్మ గాంధీ జయంతి రోజున నివాళి అర్పించేందుకు కూడా రాలేదని విమర్శించారు. కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉందని సర్వేల్లో రావడంతో ఆయనకు భయం పట్టుకుందని , హుజురాబాద్ లో ఓడిపోతామనే బెంగతోనే కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, హుజురాబాద్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. యూపీలో రైతులపై జరిగిన దాడికి నిరసనగా ఇందిరా పార్క్ లో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు .యూపీలో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని...దీనిపై మోడీ, అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదు 80 శాతం మంది రైతుల సమస్య అని.. 80 కోట్ల మంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారని ఆరోపించారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారని..దీనిపై రైతులు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారని అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్‌ మాట మార్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారన్నారు రేవంత్ రెడ్డి. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశ ప్రజల మన్ కీ బాత్ విను మోడీ అని హితవుపలికారు. సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని ఆరోపించారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీకి లొంగిపోయారని విమర్శించారు. మోదీ, కేసీఆర్‌ను బొందపెడితేనే దేశంలో రాష్ట్రంలో శాంతి ఉంటుందన్నారు. మోదీ, అమిత్ షా రైతుల హత్యలను ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

ఐదుగురు జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం.. క‌శ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంట‌ర్‌..

జ‌మ్మూక‌శ్మీర్‌లో భార‌త్ జ‌వాన్ల‌కు తీవ్ర ఎదురుదెబ్బ త‌గిలింది. ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన హోరాహోరీ ఎన్‌కౌంట‌ర్లో ఐదుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. ఇటీవ‌ల బోర్డ‌ర్‌లో టెర్ర‌రిస్టుల యాక్టివిటీ పెరిగింది. తాలిబ‌న్ల హ‌స్త‌మూ ఉంద‌నే అనుమానం వ్య‌క్తం అవుతోంది. తాలిబ‌న్ల పాత్ర‌ను కొట్టిపారేయ‌లేమంటూ ఇటీవ‌ల ఆర్మీ చీఫ్ చేసిన ప్ర‌క‌ట‌న పరిస్థితి తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం.  తాజాగా, ముష్క‌రుల కోసం ఆర్మీ పెద్ద ఎత్తున‌ కూంబింగ్ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా పూంఛ్‌ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై ముష్కరులు ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు నేల‌కొరిగారు. పూంఛ్‌ జిల్లాలోని సురాన్‌కోట్‌ ప్రాంతంలో కొందరు వాస్తవాధీనరేఖను దాటి చర్మేర్‌ అటవీ ప్రాంతంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో సోమవారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లి గాలింపు చేపట్టారు. స‌డెన్‌గా సోల్జ‌ర్స్‌పై టెర్ర‌రిస్టులు కాల్పులకు తెగ‌బ‌డ్డారు. ఎదురుకాల్పుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  ఉగ్ర‌వాదులు నక్కిన అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు అడవిలో ఉన్నట్టు సమాచారం. ముష్క‌రుల‌ కోసం పెద్ద ఎత్తున వేట కొన‌సాగుతోంది.