తాలిబన్లతో వైసీపీ నేతలకు లింక్స్? డ్రగ్స్ మాఫియా అడ్డాగా ఏపీ?
posted on Oct 7, 2021 @ 9:51AM
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన ఆప్ఘనిస్తాన్ హెరాయిన్ కు విజయవాడ లింకులు బయటపడటం తీవ్ర కలకలం రేపగా.. ఆ కేసు విచారణలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు సాగుతుండగానే ఏపీలో డ్రగ్స్ దందా ఆనవాళ్లకు సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత నెలలో కాకినాడలో బోటు తగలబడి పోవడం కలకలం రేపుతోంది. ఆ బోటును పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
గత నెల 16న కాకినాడలో ఓ బోటు అగ్నికి ఆహుతైంది. జగన్నాథపురం బోటు యార్డ్ నుంచి సముద్రంలో వేటకు బయలుదేరిన స్పీడ్ బోటు తగలబడింది. అయితే ఆ ప్రమాదంపై అనుమానాలు తలెత్తాయి. బోటులో మాదక ద్రవ్యాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బోటును పరిశీలించడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభి మరికొందరు నేతలతో కలిసి బుధవారం కాకినాడ వచ్చారు. అయితే అధికార వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కార్యాలయంపైనే దాడికి ప్రయత్నించారు. పూటుగా మద్యం సేవించిన కొందరు.. మత్స్యకారుల ముసుగులో..మూడుగంటలపాటు హల్‌చల్ సృష్టించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ బూతులతో నిరసనకు దిగారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నాయకులపై దాడిచేశారు.
టీడీపీ నేతలపై దాడికి యత్నించిన వారంతా కాకినాడ నగర వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మనుషులేనని తెలుస్తోంది. వారిలో ఆయన సోదరుడు, బంధువులు, వైసీపీ కార్పొరేటర్లు, కొందరు రౌడీషీటర్లు కూడా ఉన్నారని అంటున్నారు. పోలీసులు వచ్చినా వీరిని కనీసం చెదరగొట్టకపోవడంతో మరింత గొడవ చేశారు. కార్యాలయం లోపల ఉన్న పట్టాభి.. తాను మత్స్యకారులను అవమానించలేదని వివరణ ఇచ్చారు. అయినా ద్వారంపూడి అనుచరులు శాంతించలేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. పట్టాభి, రాజప్ప, కొండబాబు, నవీన్‌తో ఫోన్లో మాట్లాడారు. ద్వారంపూడి తీరును సహించవద్దని, వెనక్కి తగ్గకుండా పోరాడాలని సూచించారు.
టీడీపీ నేతలపై దాడికి ప్రయత్నించడంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తాలిబన్లతో వైసీపీ నేతలు సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని అన్నింటినీ బయట పెడతాం.. డ్రగ్స్ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదని చెప్పారు. డ్రగ్స్ మాఫియా నాయకుడైన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన మూకలతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై డ్రగ్స్ మాఫియా దాడికి దిగితే పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో తన పాత్ర బయటపడుతుందన్న భయంతోనే ద్వారంపూడి దాడులకు తెగబడ్డారన్నారు చంద్రబాబు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. దాడికి దిగిన మాఫియా మూకలను తక్షణం అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు ఏ హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, డీజీపీ, పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.