బద్వేలు బీజేపీ అభ్యర్థిగా సురేష్.. టీడీపీ, జనసేన మద్దతు ఎవరికో?
posted on Oct 7, 2021 @ 11:29AM
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే సతీమణి సుధ.. ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తాజాగా బీజేపీ బద్వేలు అభ్యర్థిని ప్రకటించింది.
బద్వేలు ఉప ఎన్నికలో సురేశ్ పనతల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సోము వీర్రాజు ట్వీట్ చేశారు. అభ్యర్థి పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు వివరించారు.'వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు దూరంగా, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో నిలుస్తోంది బీజేపీ. 14 సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా, గత 5 సంవత్సరాలుగా యువనాయకుడిగా ప్రజా సమస్యల సాధనకు అనేక పోరాటాలు సాగించిన సురేష్ ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం.. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి, మీ సమస్యల సాధనకై గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేయగల ఒక యువనాయకుడిని గెలిపించుకోవాలని కోరుతున్నాను' అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నా ఉప ఎన్నికలో మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. బద్వేలులో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా.. తాము పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించి అందరికి షాకిచ్చారు పవన్ కల్యాణ్. దీంతో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక టీడీపీ కూడా బద్వేలు బరి నుంచి తప్పుకుంది. మొదట పోటీ చేస్తామని ప్రకటించింది టీడీపీ. తన అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ పేరును ప్రకటించింది. రాజశేఖర్ తన ప్రచారం కూడా ప్రారంభించారు. తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది టీడీపీ. దివంగత దళిత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నందున.. గత సంప్రాదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది.
బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేస్తోంది కాంగ్రెస్. మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు పోటీలో ఉండటంతో... టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు అధికార వైసీపీ మాత్రం గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధించేలా పావులు కదుపుతోంది. బద్వేలు ఉప ఎన్నిక ఇంచార్జ్ గా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిని నియమించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరో ముగ్గురు మంత్రులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు.