వదల జగన్.. నిన్నొదల.. బెయిల్ రద్దుకు హైకోర్టులో రఘురామ పిటిషన్..
posted on Oct 6, 2021 @ 5:00PM
ఏ పేరు వింటే జగన్ ఉలిక్కిపడతారో.. ఏ కేసు వింటే జగన్ హడలిపోతారో.. అది పదే పదే జరుగుతోంది. ఎంత వద్దనుకున్నా.. రఘురామ పేరు జగన్ చెవిలో కందిరీగలా రోత పెడుతోంది. ఎంత తప్పించుకుంటున్నా.. మళ్లీ బెయిల్ రద్దు పిటిషన్‌తో తన వెంటే పడుతున్నారు తమ పార్టీ ఎంపీ రఘురామ. తాజాగా, ఎంపీ రఘురామకృష్ణరాజు.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మరోసారి సంచలనంగా మారింది. ఈసారి ఏమవుతుందోననే టెన్షన్ సీఎం జగన్‌లో అప్పుడే స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు.
జగన్‌పై ఉన్న 11 ఛార్జీషీట్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని, బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో రఘురామ కోరారు. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టి వేయగా.. ఈసారి హైకోర్టును ఆశ్రయించారు రఘురామ.
న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని రఘురామ అంటున్నారు. సీఎం హోదాలో ఉన్న జగన్.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకు తరలించాలని రఘురామ కోరుతున్నారు. మరోవైపు, ఈడీ కోర్టుకు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలని రఘురామ అన్నారు.