యూపీ ఎన్నికలపై లఖింపుర్ ప్రభావం! బీజేపీకి గండం?
posted on Oct 6, 2021 @ 8:28PM
మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్ లో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి. హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా పర్యటన సందర్భంగా లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటలు, ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. ఈ దురదృష్టకర సంఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయినట్లు సమాచారం. ఈ తొమ్మిది మందిలో రైతులున్నారు. ఇతరులు ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబందించిన ఇతర వివరాలు ఎలా ఉన్నప్పటికీ, తొమ్మిది మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ దుర్ఘటనకు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు,ఆశిష్ మిశ్రా మూల కారణమని రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంగా విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మిశ్రా మీద కత్తులు దూస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు లఖింపుర్ ఖేరికి బయలు దేరిన ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేయడం, రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది.
లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటలకు సంబందించి,ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా, మంగళ వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగానే మిశ్రా హోమ్ మంత్రితో సమావేశమయ్యారు. లఖింపుర్ సంఘటన పూపుర్వాపారాలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సంఘటన జరిగి మూడు రోజులు అయినా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు ఏమీ తీసుకోక పోవడం, అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
లఖింపుర్ హింసాకాండ నేపథ్యంలో మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మిశ్రా.. అమిత్ షాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ ఘటనలో ఆశిష్ మిశ్రా పోలీసులకు లొంగిపోయే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వస్తున్న వార్తలను అజయ్ మిశ్రా ఖండించారు. ఘటనకు కారణమైన వాహనం తమదేనని, అయితే అందులో తన కుమారుడు లేడని తెలిపారు. అంతేగాక, ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే వాహనం అదుపుతప్పి రైతుల మీదకు దూసుకెళ్లిందని వెల్లడించారు. ఆ తర్వాత రైతులు జరిపిన దాడిలో వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
అదలా ఉంటే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ దుర్ఘటన ప్రభావం ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ, ఎన్నికల పై సంఘటన ప్రభావం ఎలా ఉంటుంది అనేది, స్పష్టం కాదని మరో మాట కూడా వినవస్తోంది.