శ్రీవారి అక్షింతలను అసహ్యంగా దులుపేస్తావా! ఎందుకీ దొంగభక్తి జగన్ రెడ్డి ? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వేదపండితులు తలపై వేసిన అంక్షితలను జగన్ అసహ్యంగా దులుపుకున్నారని, పవిత్రమైన ప్రసాదాన్ని వాసన చూశారని లోకేశ్ ఆరోపించారు. వెంకటేశ్వరస్వామిపై ఎందుకీ దొంగభక్తి జగన్ రెడ్డి గారూ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అంటూ ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన అర్ధాంగిపైనా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడికి సేవ చేసే అవకాశం దొరికితే, ఆ స్వామి వారికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు అంటూ వైవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు."జగన్ మీ దేవుడే కావొచ్చు... ఆయన ఫొటోను మీ ఇళ్లలో పెట్టి పూజలు చేసుకోండి... దేవుడిగా కొలుచుకోండి.... వీలైతే పాదపూజ చేసుకోండి. కొండపై గోవింద నామాల బదులు జగన్ నామస్మరణ మహాపరాధం" అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి, అమ్మవార్లకు పదేపదే అపచారాలు తలపెడుతూ, జగన్ రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ టీటీడీ చైర్మన్ అర్ధాంగి అపచారపు నామస్మరణ చేయడం స్వామివారికి తీరని కళంకం అని నారా లోకేష్ ఫైరయ్యారు.

ఈటల జమునా రాజీనామా ఉపసంహరణ.. హుజురాబాద్ బరిలో 30 మంది

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా, ప్రధాన పార్టీలకు సవాల్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు నిలిచారు. బుధవారంతో హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజున 12 మంది అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరించారు. దీంతో ఉప ఎన్నికల బరిలో 30 మంది మిగిలిపోయారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇందులో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉండగా.. మరో ఏడుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. 20 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు హుజురాబాద్ ఉప సమరంలో పోటీలో నిలిచారు.  బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి లింగారెడ్డి కూడా నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సుమన్, వినోద్ కుమార్, మల్లిఖార్జున్, నూర్జహాన్ బేగం తదితరులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 30 మంది బరిలో ఉండటంతో పోలింగ్‌ కోసం మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల సంఘం ఉపయోగించనుంది.  బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఈ నెల 30న జరగనుంది.

కేటీఆర్ మెడలో పసుపు కండువా! ఎందుకో తెలుసా... 

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మిసిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు మెడలో పసుపు కండువా వేసుకున్నారు. తెలుగు దేశం పార్టీ జెండా అయిన పసుపు కండువాను మంత్రి కేటీఆర్ ఎందుకు వేసుకున్నారని షాకవుతున్నారా.. అయితే దానికో కారణం ఉంది. తమిళనాడు ఎంపీలు ఆయనకు పసుపు కండువా వేశారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులో అధికార పక్షంగా ఉన్న డీఎంకే పార్టీకి చెందిన ఎంపీలు హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ రద్దు కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్ జాతీయస్థాయిలో మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి రాసిన లేఖతో డీఎంకే ఎంపీలు వీరస్వామి, ఎల్ఎం గోవింద్  తెలంగాణ భవన్ కు విచ్చేశారు. అక్కడున్న మంత్రి కేటీఆర్ ను కలిసి లేఖ అందజేశారు. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డీఎంకే ఎంపీలు కేటీఆర్ మెడలో పసుపు కండువా వేశారు.  డీఎంకే పార్టీ ఎంపీలు పసుపు కండువా వేయడానికి కూడా కారణం ఉంది. వాళ్ల పార్టీ కలర్ కూడా పసుపే. అందుకే కేటీఆర్ మెడలో వాళ్లు పసుపు కండువా కప్పారు. అయితే కేటీఆర్ పసుపు కండువా కప్పుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేటీఆర్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

కమలానికి ఓ దండం.. ఏపీ బీజేపీకి సీనియర్స్ రామ్ రామ్..

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు. నిజానికి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, ఏపీలో బీజేపీ ఈ మాత్రంగా అయినా మిగిలింది,  లేదంటే ఆ పార్టీని పట్టించుకునే నాథుడు కూడా ఉండక పోవునని ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. కేంద్రంలో అధికారం లేకుంటే రాష్ట్రంలో ఈమాత్రం గుర్తింపు అయినా దక్కేది కాదేమో. అందుకే ఇప్పుడు ఏపీలో బీజేపీ ఉన్నది అంటే ఉన్నది, అంతే అంతకు మించి చెప్పుకునేందుకు ఏమీ లేదు, అన్న మాట రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అంతే కాదు, సమీప భవిష్యత్’లో రాష్ట్రంలో కమలదళం కనీసంగా అయినా పుంజుకునే అవకాశం ఏ కొంచెం కూడా లేదని అంటున్నారు.   నిజమే ఒకప్పుడు రాష్ట్రంలో బీజేపే  సొంతంగా కనీసం ఒకటీ అరా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, ఇంకొంచెం ఎక్కువగా ఎమ్మెల్సీ సీట్లు అయినా గెలుచుకునేది. చదవు సంస్కారం ఉన్న మధ్యతరగతి వర్గాల్లో బీజేపీ అంటే కాసింత గుర్తింపు, కూసింత గౌరవం ఉండేవి. ఓట్లు వేసినా వేయక పోయినా ప్రజల్లోనూ బీజేపీ అంటే, ‘అదొక విభిన్న పార్టీ’ అనే గుర్తింపు, గౌరవం ఉండేవి. అప్పట్లో వెంకయ్య నాయుడు, జూపూడి యజ్ఞనారాయణ, పీవీ చలపతి రావు, ఎన్ఎస్ఎన్ రెడ్డి, డీఎస్పీ రెడ్డి వంటి నిబద్ధత, నిజాయతీ ఉన్న నాయకులు ఉన్నారు. అలాగే ఐడిలాజికల్ కమిట్మెంట్’తో నిస్వార్ధంగా పనిచేసే క్యాడర్ ఉన్న పార్టీగానూ లెఫ్ట్ పార్టీల రైట్ న చోటుండేది. ఇప్పుడు, పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. రాష్ట్రంలో బీజేపీకి సరైన నాయకత్వం లేదు. క్యాడర్’లో కూడా గతంలో ఉన్న అంకిత భావం ఇప్పుడు, కనిపించడం లేదు. సుదీర్ఘ కాలం పాటు, ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం వల్లనో ఏమో, ఆ పార్టీల లక్షణాలు కొన్ని బీజేపీ క్యాడర్’కు కూడా అంటుకున్నాయి. సొంత ఖర్చులతో పార్టీ పనులు చేసిన పరిస్థితి నుంచి, అదేదో సినిమాలో కోట శ్రీనివాస రావు పాత్ర, ‘నాకేంటి?’ అని, చెయ్యి చాచినట్లు, ఇప్పుడు  బీజేపీ క్యాడర్ చేయి చాస్తున్నారని అంటున్నారు.    కేంద్ర నాయకత్వానికి రాష్ట్రం మీద ఆశలు లేవు. కనీసం ప్రస్తుతానికి అయితే బీజేపీ జాతీయ నాయకత్వానికి , రాష్ట్రం పై దృష్తి కేద్రీకరించే ఆలోచన ఏ కొంచేమూ లేదు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పార్టీలోనే కాదు, పార్టీ బయట కూడా ఇదే చర్చ జరుగుతోంది.  అసలే పరిస్థితి అంత అద్వాన్నంగా ఉంటే, మూలుగే నక్కపై  తాటి పండు పడినట్లు.  ఇందులో మళ్ళీ మూడు ముఠాలు ఆరువర్గాలుగా పార్టీ కునారిల్లుతోంది. అందుకే, ఏదో ఆశించి, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు, చేసిన తప్పుకు చెంపలు వేసుకుని కమలానికి ఓ దండం, అనేందుకు సిద్దమవుతున్నారని, విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఇప్పటికీ, ఒకప్పుడు క్రియాశీలంగా వ్యవహరించిన సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నత కాలం, క్రియాశీలంగా వ్యవహరిస్తూ, నులుగురినీ కలుపుకు పోయారు. అయినా, రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఏమీ జరగక పోయినా, పార్టీలో కాసింత సందడి అయినా ఉండేది. కానీ,ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యలయంలో కూడ సందడి కాదు కదా కనీసం చప్పుడు కూడ లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, అలాగే తెలుగు దేశం పార్టీ  నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యులు, సుజనా చౌదరి, సిఎం రమేష్,టీజీ వెంకటేష్ వంటి పార్టీని అన్ని విధాల  ముందుకు తీసుకుపోయే, శక్తి సామర్ధ్యాలున్న నాయకులున్నా, ఐదో తనమే లోపించింది. ఈ నాయకులంతా కాషాయ కండువా కప్పుకుని, సంవత్సరాలు అవుతున్నా, పార్టీ కీలక నేతలు కొదంరు, ఇంకా, వారిని బయటి వ్యక్తులుగానే చూస్తున్నారు. బెంచ్ మీదనే ఉంచుతున్నారు,ఐటీ కంపెనీలో కొత్తగా చేరినారిని పని పాట లేకుండా బెంచి మీద కూర్చోపెట్టి నట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను, ఒక విధంగా అవమాలపాలు చేస్తున్నారు. చిన్నబుచ్చుకునేలా చూస్తున్నారని అంటున్నారు.  అందుకు తగ్గట్టుగానే ఇటీవల పార్టీ సమావేశంలో, పార్టీ ముఖ్య నేత ఒకరు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీ పార్కింగ్ జోన్‌గా మారనిచ్చేది లేదంటూ చేసిన వ్యాఖ్యలు, సీనియర్లకు మనస్తాపం కలిగించాయి. అందుకే, పార్టీ అధిష్టానంతోతాడో పేడో తేల్చుకునేందుకు, బీజేపీ ‘బయటి’ నేతలు సిద్దమయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా,ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో కుమ్ముక్కై, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారిన  ‘దుష్ట త్రయం’ మీద చర్యలు తీసుకోవాలని, వారిని ఆయా స్థానాల నుంచి తప్పించాలని, సీనియర్ నాయకులు కోరుతున్నారు. అదే జరగక పోతే ... బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు ఒకరొకరుగా  కాషాయ పార్టీకి రాం..రాం చెప్పడం, సొంత గూటికి చేరడం  ఖాయమని తెలుస్తోంది

రేవంత్ కు జై కొట్టిన చిన్నా రెడ్డి.. సీనియర్లంతా దారిలోకి వచ్చినట్టే! 

ఒక్క కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే కాదు, అన్ని పార్టీలలో అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తులు ఉంటారు. కాంగ్రెస్ వందేళ్ళ పార్టీ. అదీగాక, ఇప్పుడు జాతీయ స్థాయిలో  తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పార్టీ. కాబట్టి, కాంగ్రెస్’ లోఅసంతృప్తి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే, అది శాశ్వతం కాదు. కొన్ని సందర్భాలలో పాల పొంగులా చల్లబడుతుంది. ఇంకొన్ని సందర్భాలలో కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా, చివరకి .. ‘అల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’ అనంట్లుగా కాంగ్రెస్ పార్టీలో అలకలు, అసంతృప్తుల కథలన్నీ సుఖాంతమే అవుతుందని చరిత్ర చెపుతోంది.  కాంగ్రెస్ పార్టీ మీద అలిగి సొంత పార్టీలు పెట్టుకున్న కొందరు తిరిగి సొంతగూటికి చేరుకున్న సంఘటనలు కొకొల్లలు ... ప్రణబ్ ముఖర్జీ మొదలు మూపనార్, చిదంబరం వరకు, అనేక మంది జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు కూడా  ఎదో ఒక బలహీన క్షణంలో అసంతృప్తితో పార్టీని వదిలి,సొంత కుంపట్లు పెట్టుకున్నవారే.. కానీ, వెళ్ళినంత వేగంగా గోడకు కొట్టిన్ బంతిలా మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. పవార్, మమత, జగన్ రెడ్డి వంటి కొందరు అవసరార్ధం సొంత కుంపట్లు కొనసాగిస్తున్నా,మాతృ సంస్థతో ఉన్న పేగు బంధాన్నీ కొనసాగిస్తూనే ఉన్నారు.  ఇక ప్రస్తుతంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏకంగా 23 సీనియర్ నాయకులు, ఇంచుమించుగా అందరూ కేంద్ర మాజీ మంత్రులు, జీ 23 గ్రూపుగా ఏర్పడి పార్టీ నాయకత్వం పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. జీ 23 అంటే, జీ హుజూర్ కాదు,అంటూ, పార్టీ అధినాయకత్వాన్ని నిలదీశారు. అయితే, మరో మూడు రోజుల్లో, అక్టోబర్ 16న పార్టీ నాయకత్వం విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సీ డబ్క్యూసీ) సమావేశం అవుతున్న నేపధ్యంలో జీ 23 నేతలు ఒకరొకరు మెత్త పడుతున్నారు. ఈ రోజు (బుధవారం) లఖింపూర్ దుర్ఘటన ఫై ..రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా నాయకత్వంలో రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నాయకుల బృందంలో, జీ 23 కీలక నేత గులాంనబీ ఆజాద్ కూడా ఉన్నారు. అంటే, నాయకత్వ మార్పు విషయంలో అయన మెట్టుదిగి వచ్చినట్లే కనిపిస్తోంది. అలాగే,కర్ణాటకకు చెందిన మరో సీనియర్ నాయకుడు,వీరప్పమొయిలీ కూడా, కాంగ్రెస్ అధి నాయకత్వం  సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు అంగీకరించిన నేపధ్యంలో,అందరం కలిసి పార్టీని బతికించు కుదామని పిలుపు నిచ్చారు.  జాతీయ స్థాయిలో పరిస్టితి అలా ఉంటే, రాష్ట్ర స్థాయిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫై కస్సు బుస్సుమంటున్న సీనియర్ నాయకులు, ఒకరొకరుగా మెత్తపడుతున్నారు. తాజాగా, రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నా రెడ్డి అసంతృప్తి అటకెక్కించారు. అంతే కాదు రేవంత్ రెడ్డి సీఎం అవుతారంటూ చిన్నారెడ్డి జోస్యం కూడాచెప్పారు.1985 లో తాను వనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి విద్యార్ధిగా ప్రచారంలో పాల్గొన్నారని. అలాంటి రేవంత్ రెడ్డి పీసీసి చీఫ్ కావడం గొప్ప విషయమని అభినందించారు. నిజాం పాలన ముగిసిన తర్వాత ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయనది పాలమూరు జిల్లా అని గుర్తు చేసిన చిన్నారెడ్డి.. ఇప్పుడు మరోసారి అదే ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇలా జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రంలో హస్తం పార్టీలో అసంతృప్తి చల్లారుతోందని, ఇదొక శుభ పరిణామని,  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మంచు విష్ణు దేనికైనా రెఢీ!.. ప్ర‌కాశ్‌రాజ్ మోనార్క్ పాలిటిక్స్‌!

ఏదో జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. మ‌రేదో జ‌రిగిపోయింది. ఆ త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. 'మా' ఎన్నిక‌లు, ఫ‌లితాలు.. మునుపెన్న‌డూ లేని రీతిలో సినిమాటిక్‌గా సాగాయి.. సాగుతున్నాయి. తెర‌వెనుక‌ ఎవ‌రు ర‌చించిన స్క్రీన్‌ప్లేనో కానీ.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ట్విస్టులు అదిరిపోతున్నాయి. క్లైమాక్స్ సీన్స్‌ ఎప్పటిక‌ప్పుడు మారిపోతున్నాయి. సినిమాల కంటే సినిమాటిక్‌గా న‌డుస్తున్న 'మా' ఎపిసోడే మ‌రింత మ‌జా ఇస్తోంది.  ప్ర‌కాశ్‌రాజ్ 'మా' బ‌రిలో నిల‌వ‌గానే.. ఒక్క‌సారిగా అటెన్ష‌న్‌. ఆయ‌న‌కు మెగా స‌పోర్ట్ రాగానే మ‌రింత అటెన్ష‌న్‌. సినిమా బిడ్డ‌ల‌మంటూ ముందుకొచ్చిన ప్ర‌కాశ్‌రాజ్ గెల‌వ‌కున్నా.. ఆయ‌న ప్యానెల్ నుంచి 11మందికి ప‌ట్టం కట్టారు సినీ ఓట‌ర్లు. ఇప్పుడు వారంతా ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డ‌మంటే.. వారికి ఓటేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ పేరు పేరునా అవ‌మానించ‌న‌ట్టే..అంటున్నారు. వీళ్లేదో చేస్తార‌ని న‌మ్మ‌క‌ముంచి ఓటేసి గెలిపిస్తే.. ఇప్పుడు మొద‌ట్లోనే రాజీనామాల‌తో కాడి వ‌దిలేయ‌డ‌మేంట‌ని ఓటేసిన వారు ప్ర‌శ్నిస్తున్నారు. గెలుపు-ఓట‌మిల‌ను స‌మానంగా స్వీక‌రించే ధైర్యం లేనివారు.. ఇంత‌మాత్రానికే పోటీ చేయ‌డం ఎందుక‌ని నిల‌దీస్తున్నారు. 'మా' లో అంత ర‌చ్చ ర‌చ్చ జ‌రిగాక‌.. చివ‌రాఖ‌రికి ఇప్పుడు రాజీనామాల‌తో చేతులెత్తేస్తే..? ఉప‌యోగం ఏంటి? 'మా' లో ఏవైనా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగితే అడిగే నాథుడెవ‌రు? అంతా ఏక‌ప‌క్షం అయితే.. అది ప్ర‌జాస్వామ్య స్పూర్తికే విఘాతం కాదా? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు నెటిజ‌న్లు.   రాజీనామాల‌తో 'మా' నుంచి బయటకు రావటం కన్నా.. అసోసియేషన్‌లోనే ఉండి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏవైనా అసంబ‌ద్ధ నిర్ణయాలు తీసుకుంటే వాటిని ప్రశ్నించి గొంతుక‌లా ఉండి ఉంటే.. ‘మా’ కార్యకలాపాల్లో పారదర్శకత ఉండేదని అంటున్నారు. అసలు  ‘మా’ ఎన్నికల్లో పోటీ లేకుండా పదవులన్నీ ఏకగ్రీవమైతే ఇన్ని గొడవలు, వివాదాలు జరిగి ఉండేవి కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ దిశగా సినీ పెద్దలు చొర‌వ తీసుకోకపోవడం వల్లే పరిస్థితి చేదాటిపోయిందని, చివరకు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, గొడ‌వ‌లు, రాజీనామాల‌తో 'మా'లో ముస‌లం రాజుకుంద‌ని అంటున్నారు.  స‌రే, ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామా చేసేశారు. నెక్ట్స్ ఏంటి? మంచు విష్ణు ముందున్న ఆప్ష‌న్లేంటి? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పుడు విష్ణు ఏం చేస్తార‌నే దానిపై ఆస‌క్తి పెరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే మంచు విష్ణు ముందు సవాళ్లు వచ్చి పడ్డాయి. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ రాజీనామాల‌తో విష్ణు ముందు రెండు ఆప్షన్స్‌ ఉన్నాయంటున్నారు. ఒకటి... 11మంది రాజీనామాలను ఆమోదించటం, రెండు.. వారి స్థానంలో కొత్త వారిని నియమించటం. ఒకరో ఇద్దరో రాజీనామా చేస్తే కాంప్ర‌మైజ్ చేయొచ్చు. కానీ, ప్యానెల్ మొత్తం 11 మంది మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో మంచు విష్ణుకు వాటిని ఆమోదించి, వారి ప్లేస్‌లో వేరే వారిని తీసికోవ‌డం మిన‌హా మ‌రో ఆప్షన్ లేదంటున్నారు. అయితే, ప‌రిశ్ర‌మ పెద్ద‌లు చొర‌వ తీసుకొని ముందుకొచ్చి.. 'మా' గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రిస్తే బాగుంటుంది కానీ, ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితి లేదంటున్నారు. ఆ పెద్ద‌లే ఈ స‌మ‌స్యకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. దీంతో.. రాజీనామాల విష‌యంలో రాజీ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని.. సై అంటే సైరా అన్న‌ట్టే సాగుతుంద‌ని అంటున్నారు. 

దిశ ఎన్ కౌంటర్ కేసులో సజ్జనార్ బుక్కవుతారా? 

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనమైన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నాటి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ను కమిటి రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రెండు రోజుల్లో 120 ప్రశ్నలను సజ్జనార్‌పై విచారణ కమిషన్‌ సంధించింది. పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అడిగినప్రశ్నకే పరిమితమై నేరుగా సమాధానం చెప్పాలని విచారణ కమిషన్‌ స్పష్టం చేసింది. దీంతో సిర్పుర్కర్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సజ్జనార్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఆయన పరిస్థితి ఏంటి, ఐపీఎస్ అధికారి చిక్కుల్లో పడనున్నారా అన్న చర్చ సాగుతోంది.  విచారణ సందర్భంగా దిశ  కేసులో నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తనకు తెలియదని వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. నిందితులను సీన్‌-రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసు అధికారులెవరూ తనకు చెప్పలేదని చెప్పారు.. 2019 డిసెంబరు 6 ఉదయం 6.15 గంటలకు ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్లు శంషాబాద్‌ డీసీపీ తనకు సమాచారం ఇచ్చారని కమిషన్ కు వివరించారు సజ్జనార్. దిశ ఘటన తర్వాత ప్రజల్లో భయం నెలకొందని, డయల్‌-100, షీటీమ్స్‌పై అవగాహన కల్పించేందుకే 2019 నవంబరు 29న ప్రెస్‌మీట్‌ నిర్వహించానని సజ్జనార్‌ చెప్పడం ఆసక్తిగా మారింది.  అవగాహన కోసమైతే.. ఆ ప్రెస్‌మీట్‌లో ఏ1 నిందితుడి వాంగ్మూలాన్ని ఎందుకు వెల్లడించారని కమిషన్ ప్రశ్నించింది. కోర్టు పరిధిలోని అంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు చెప్పారని నిలదీసింది. శంషాబాద్‌ డీసీపీ ఇచ్చిన సమాచారం మేరకు వెల్లడించానని సజ్జనార్‌ సమాధానం ఇవ్వడంతో.. ‘‘మీరు స్వతంత్రంగా ఆలోచించరా? మీకంటూ ఒక అభిప్రాయం ఉండదా? అన్ని ప్రశ్నలకు శంషాబాద్‌ డీసీపీ అని సమాధానం చెబుతున్నారు? ఇంతకు మీరేం చేస్తారు?’’ అని కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబరాబాద్‌కు తాను శాంతిభద్రతల పర్యవేక్షణ ఇన్‌చార్జ్‌ అని, క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే సమాచారం మేరకు వ్యవహరిస్తారని చెప్పారు. ‘‘మీ కమిషనరేట్‌ పరిధిలో ఏం జరిగినా మీకు బాధ్యత ఉంటుంది కదా?’’ అని ప్రశ్నించగా.. ఆ వాదనతో తాను ఏకీభవించబోనన్నారు. దిశ అదృశ్య ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం జరిగింది వాస్తవమేనా? అని కమిషన్‌ ప్రశ్నించగా.. అవునని సమాధానమిచ్చారు. నిందితులను గెస్ట్‌హౌ్‌సలో ఉంచేందుకు తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ స్థలంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతదేహాల పంచనామా పూర్తికాకుండానే ప్రెస్‌మీట్‌ పెట్టడమేంటని ప్రశ్నించింది. నాలుగు భాషల్లో సజ్జనార్‌ మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. సంఘటన స్థలంలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటుకు కుర్చీలు, టేబుళ్లు ఎవరు సమకూర్చారని సజ్జనార్‌ను అడిగింది. ఈ ప్రశ్నలకు తనకు తెలుగు సరిగా రాదని, 20 ఏళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్నా.. ఇక్కడ ఎక్కువ మంది హిందీ మాట్లా డుతారని చెప్పారు. ‘‘ఐపీఎస్‌ అధికారిగా తెలుగు భాష పరీక్ష రాయలేదా?’’ అని ప్రశ్నించగా.. 2000లోనే తెలుగు పరీక్ష పాసయ్యానని సజ్జనార్‌ చెప్పారు. తాను తెలుగు బాగా రాయగలనని, అంత వేగంగా మాట్లాడలేనని చె ప్పారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు అంటూ పత్రికల్లో వచ్చిన కథ నాలపై ప్రశ్నించగా.. ఆ పదానికి అర్థం తెలియదని, తాను ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు కాదని చెప్పారు సజ్జనార్.  దిశ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, ఆ కేసును సజ్జనార్‌ తాను పర్యవేక్షించలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందని కమిషన్‌ వ్యాఖ్యానించింది. అది స్ట్రీట్‌ క్రైమ్‌ కాదని స్పష్టం చేసింది. కీలక కేసులో బాధ్యాతాయుతంగా వ్యవహరించాల్సిన సీపీ.. తనకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. వేరే విషయాలతో తాను బిజీగా ఉన్నానని, అందుకే కేసు దర్యాప్తును పర్యవేక్షించలేదని ఆయన సమాధానమిచ్చారు.  దిశ కేసులో కమిషన్ విచారణ తీరును బట్టి సజ్జన్నార్ సేఫ్ అని చెబుతున్నారు. మిగిలిన వారి మాదిరి ఎన్ కౌంటర్ మీద చెప్పిన సమాధానాలు కమిషన్ అసహనపడేలా ఉన్నప్పటికీ.. సాంకేతికంగా చూస్తే.. ఆయన్ను బుక్ చేసేలా మాత్రం లేవన్న మాట వినిపిస్తోంది. కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఆయనకు తెలీదని చెప్పటం కానీ.. తాను పర్యవేక్షణ చేస్తుంటానని.. ఫాలో అప్ మాత్రమే తన బాద్యత అన్న రీతిలో సమాధానం ఇవ్వటం ఆయన మీద వేలెత్తి చూపించే పరిస్థితి కొంత మేర మాత్రమే ఉంటుంది తప్పించి.. చర్యలు తీసుకునే వరకు వెళ్లదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదే సమయంలో ఈ ఉదంతం జరిగిన వేళలో శంషాబాద్ డీసీపీగా ఉన్న ప్రకాశ్ రెడ్డిని మరోసారి విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న ఆయన.. సజ్జన్నార్ చెప్పిన సమాధానాలకు ఆయన తిరిగి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ విచారణ ఎపిసోడ్ లో సజ్జన్నార్ కంటే కూడా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డికే ఎక్కువ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

బాండ్ల రుణం జమ.. డ్రగ్స్ తో ఏపీ పరువు గోవిందా.. బీజేపీ నేతకు చెప్పుదెబ్బ.. టాప్ న్యూస్ @ 1PM

సెక్యూరిటీ బాండ్ల వేలంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన రూ. 2వేల కోట్ల అప్పును ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమచేసుకుంది. ఇప్పటికే ఓడీ ఉండడంతో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అప్పును రిజర్వు బ్యాంక్ వెంటనే జమ చేసుకుంది. కేంద్రం అదనంగా ఇచ్చిన రూ. 10వేల 5వందల కోట్లలో రూ. 9వేల కోట్లను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాడేసింది. ---- మాదకద్రవ్యాల కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరువు నష్టం జరిగిందని, అది ఇంకా దిగజారే ప్రమాదం ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.దిగుమతి ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఉండక పోవచ్చు కానీ ఆఫ్ఘన్ నుంచి దిగిన హెరాయిన్ బుకింగ్ ఏక్కడ నుంచి జరిగిందన్నారు. ఆషి ట్రేడింగ్ ద్వారా హెరాయిన్ బుక్ చేశారని చెప్పిందే డీఆర్ఐ కదా అని అన్నారు. ఏన్‌ఐఏ బృందం విజయవాడ వచ్చిందా? లేదా? అని దినకర్ ప్రశ్నించారు. -------- ఏపీలో ఇసుక బంగారం కంటే ఖరీదైనదిగా మారిందని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని ఇసుకను వందల కోట్లు, వేల కోట్లకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారని... సామాన్యుడు ఇసుకను కొనలేక, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. మద్యం ధరలను పెంచి, సామాన్యుడిని దోచుకుంటున్నారని, పేదల డబ్బుని ఖజానాకు తరలిస్తున్నారని విమర్శించారు. ---- విజయవాడలో వలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శానిటైజర్ తాగి వాలంటీర్ భవానీ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్తింటివారి వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణలంక బాలాజీనగర్‌లో ఘటన చోటు చేసుకుంది. --------- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌‌తో డీఎంకే నేతలు భేటీ అయ్యారు. నీట్ రద్దు చేయాలనే డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను కేటీఆర్‌కు  డీఎంకే ఎంపీలు  అందజేశారు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖ రాశారు.  ------ తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంతరావు హైద‌రాబాద్‌లోని త‌న నివాసం వ‌ద్ద మౌన దీక్ష‌కు దిగారు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరీలో జ‌రిగిన హింస‌లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా వీహెచ్ దీక్ష‌కు దిగారు.కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రాను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రైతుల మృతికి కార‌ణ‌మైనవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ---- నిజామాబాద్‌లో బీజేపీ నేత వివాహేతర సంబంధం  వెలుగు చూసింది. గత రాత్రి తమ కూతురిని ఎత్తుకెళ్లిన బీజేపీ కార్పొరేటర్ భర్త ఆకుల శీనును అమ్మాయి తల్లిదండ్రులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తమ కూతురిని మోసం చేశాడంటూ వినాయక నగర్‌లోని ఆకుల శీను ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఆకుల శీను ఇంటిపై దాడికి దిగారు. --- ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళుతున్న సమయంలో మంత్రి వెల్లంపల్లిని సీఐ గుర్తుపట్టలేదు. దీంతో ఏయ్ పక్కకు తొలుగు అంటూ  సీఐపై మంత్రి మండిపడ్డారు. అమ్మవారి దర్శనం చేసుకొని డీజీపీ గౌతమ్ సవాంగ్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా మంత్రి తీరును పోలీసులు తప్పుబడుతున్నారు.  ------- దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న ఇంద్రకీలాద్రిపై అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి సమర్పించేందుకు శ్రీకాళహస్తి నుండి ఆలయ సిబ్బంది సారే తీసుకువచ్చింది. అయితే సారేను అర్చకులు భక్తులు నడిచే నేలపై ఉంచారు. భక్తులు నడిచే మార్గంలో సారె, పూజా సామాగ్రి ఉంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  -------- కరోనా టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ లకు బూస్టర్ డోసుగా ‘కార్బివాక్స్’ను అనే వాక్సిన్ ను హైదరాబాద్ ఫార్మా సంస్థ ‘బయోలాజికల్ ఈ’ అభివృద్ధి చేసింది. దీనికి అనుమతులు ఇవ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సంస్థ దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను రెండు డోసులుగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడో డోసుగా (బూస్టర్) కార్బివాక్స్ కు అనుమతులు ఇవ్వాల్సిందిగా సంస్థ కోరినట్టు అధికారులు చెబుతున్నారు. ---  

కార్పొరేట‌ర్ భ‌ర్త‌కు చెప్పు దెబ్బ‌లు.. ఆమె కూతురితో వివాహేత‌ర సంబంధం!

ఆయ‌నో రాజ‌కీయ నేత‌. వృత్తి రాజ‌కీయ‌మే అయినా.. ప్ర‌వృత్తి మాత్రం వేరే ఉంది. ఆయ‌న ఆమె సేవ‌లో త‌రిస్తున్నాడు. భార్య‌ను కార్పొరేట‌ర్‌గా గెలిపించుకొని.. తాను మాత్రం వ‌ల‌పు ఒడిలో సేద‌తీరుతున్నాడు. భార్య కార్పొరేష‌న్ స‌మావేశాల‌కు వెళ్తుంటే.. అత‌ను మాత్రం వివాహేత‌ర సంబంధాల వెంట తిరుగుతున్నాడు. అలా.. అలా.. బాగా ఎంజాయ్ చేస్తుంటే.. వ‌న్ ఫైన్ నైట్‌ వాళ్ల బండారం బ‌య‌ట‌ప‌డింది. క‌ట్‌చేస్తే.. చెప్పు దెబ్బ‌ల‌తో సీన్ సితారా అయింది. ప‌రువంతా పోయింది. త‌లెత్తుకోలేని దుస్థితి దాపురించింది. నిజామాబాద్‌లో ఓ కార్పొరేటర్ భర్తని.. అత‌ని ఇంటికి వెళ్లి మ‌రీ చెప్పుతో కొట్టింది ఓ మహిళ. తన‌ కూతురితో వివాహేతర సంబంధం పెట్టుకుని వాడుకుంటున్నాడంటూ ఆరోపిస్తూ.. చెడామ‌డా బాదేసింది. వినాయకనగర్‌లోని కార్పొరేటర్ భర్త ఇంటి ముందు బాధితురాలి కుటుంబం ఆందోళనకు దిగింది. గతంలోనూ అత‌న్ని గ‌ట్టిగా మందలించినా.. ఆ కార్పొరేటర్ భర్త తీరు మార‌లేదంటూ ధ‌ర్నాకు దిగారు.  మంగ‌ళ‌వారం రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లాడంటూ.. కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటిపై దాడి చేశారు. ఆకుల శీనును చెప్పుతో కొట్టారు. త‌మ‌కు న్యాయం చేయాలంటూ శీను ఇంటి ముందు ఆందోళ‌న‌కు దిగారు. అయితే, త‌మ కూతురుని త‌మ‌కు అప్ప‌గించాలంటూ త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న నిజ‌మాబాద్‌లో హ‌ల్‌చ‌ల్‌గా మారింది. కార్పొరేట‌ర్ భ‌ర్త ఆకుల శీను య‌వ్వారం వివాదాస్స‌ద‌మైంది. 

దురదృష్టంలో అదృష్టం..  మా గొడవ పవన్ కు మంచే చేసిందా? 

ఉరుము ఉరిమి మంగళం  మీద పడినట్లు ‘మా’ ఎన్నికల గోల జనసేన చీఫ్ పవన్ కల్యా ణ్ కు మంచే చేసిందా? మెగా ఫ్యామిలీ మంచు ఫ్యామిలీల మధ్య తలెత్తిన వివాదం, ఆ రెండు వర్గాల  మధ్య పిచ్చాపిచ్చగా సాగుతున్న  రచ్చ ఇప్పుడు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ, సినిమా, మీడియా వర్గాల విశ్లేషకులు.   నిజానికి, ‘మా’ ఎన్నికల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష్యంగా అంతగా  జోక్యం చేసుకోలేదు.’మా’ మురికిలో ఆయన కాలు కాదు కదా వేలు కూడా పెట్టలేదు. అయినా, ఆయనకూ బురద అంటింది. ఆ అన్నయ్యకు తమ్ముడిగా పవన్ కళ్యాణ్’ కూడా మెగా సెగ తగిలినట్లే ఉందని అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి ప్రతినిధిగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు  కొత్తగా మా ఎన్నికల రచ్చ పర్యవసానంగా తెర మీదకు వస్తున్న ‘ఆత్మ’ (ఆంధ్రా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సినిమా  రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా కుల సమీకరణలు, రాజకీయ, సినిమా అనుబంధ సంబంధాల పరంగా పెద్ద మార్పులే వస్తాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్  రాజకీయాలపై మా’ ఎన్నికల ప్రభావం నెగటివ్’గా మాత్రమె కాదు పాజిటివ్’గా కూడా ఉంటుందని, ముఖ్యంగా.. ఈ వివాదం కారణంగా కాపులు ఇతర బీసీ కులాలు, పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ర్యాలీ అయ్యే అవకాశం ఉందని  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలింది అన్నట్లుగా, ఈనెల 23వ తేదీన హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో జాతీయ స్థాయి బీసీ నాయకుల సదస్సు జరుగుతోంది. ఈ సదసుకు నిర్వాహకులు వన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళవారం తనను కలిసిన బీసీ నాయకులతో పవన్ కళ్యాణ్ తమ మనసులోని భావాలను పంచుకున్నారు. బీసీల అజెండానే తన అజండా అనే అభిప్రాయం కలిపించే విధంగా పవన్ కళ్యాణ్ మాటలున్నాయి. కేవలం ఉద్యమాలు చేయడం కాదు, రాజ్యాదికారం కోసం, కొట్లాడాలని అన్నారు. బీసీలను ఏకం చేయాలనే రాజకీయ కోరిన ఆయన  మనసులో ఉందని చెప్పకనే చెప్పారు. అలాగే బీసీల పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.   ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2024 ఎన్నికల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు.  అంటే కుల రాజకీయాలు అంటేనే  ఛీ అనే పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల నాటికీ ఒక బలమైన బీసీల రాజకీయ వేదికగా జనసేనను నిలిపే ప్రయత్నాలో ఉన్నారని తెలుస్తోంది. బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు జన సేన సంపూర్ణ మద్దతు ఉంటుందని,   అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.సో .. మా’ వివాదంతో  పవన్ కళ్యాణ్ ఇమేజ్’ కొంత మసకబారినట్లు అనిపించినా, ఫార్ట్యూన్ ఇన్ డిజ్గైజ్, దురదృష్ట్రంలో అదృష్టంలాగా సక్రమంగా వినియోగించుకుంటే మా’ గోడవ పవన్ కళ్యాణ్’కు కీడుకంటే మేలే ఎక్కువ చేసిందని అంటునారు. 

క‌మ‌లంలో క‌ల్లోలం.. ఆ ముగ్గురిపై ధిక్కార‌ స్వ‌రం..

ఏపీ బీజేపీ. ఎదుగూబొదుగూ లేని పార్టీ. ఉనికి కోసం ఆరాటం. క్లారిటీ లేని పోరాటం. ఎవ‌రికి వారే రాజ‌కీయం. అందుకే, క‌మ‌లం పూరేకులు వాడిపోతున్నా.. నీళ్లు పోసే నాయ‌కుడే లేడు. గ‌తంలో టీడీపీతో పొత్తు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఆ పార్టీకి కాస్తోకూస్తో గుర్తింపు, గౌర‌వం ఉండేది. ప‌సుపు పార్టీతో తెగ‌దెంపులు చేసుకున్నాక కాషాయ రంగు వెల‌వెల‌పోతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో చేతులు క‌లిపినా.. బీజేపీలో ఏమాత్రం జోష్ రావ‌డం లేదు. ఏపీలో ఆల‌యాల‌పై విచ్చ‌ల‌విడిగా దాడులు జ‌రుగుతున్నా.. ఉత్తుత్తి పోరాటలే త‌ప్ప హిందుత్వాన్ని, పార్టీని ప‌టిష్ట‌ప‌రిచే ప్రణాళికా బ‌ద్ద‌మైన కార్య‌చ‌ర‌ణ లేదు. జ‌గ‌న్‌తో, వైసీపీతో కుమ్మ‌క్కు కావ‌డం.. అధికార పార్టీకి లోపాయికారిగా స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే బీజేపీకి ఏపీలో స‌రైన గుర్తింపు రావ‌డం లేద‌ని చెబుతున్నారు. ఏపీలో బీజేపీ ప‌త‌నావ‌స్థ‌కు కార‌ణం ఆ ముగ్గురే అంటున్నారు.  సునీల్ దియోథ‌ర్‌, సోము వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి.. ఈ ముగ్గురు నాయ‌కులు బీజేపీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని పార్టీ శ్రేణులే భ‌గ్గుమంటున్నాయి. సోము వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలు ప‌క్కా జ‌గ‌న్ మ‌నుషులేన‌ని ఏపీలో ఎవ‌రిని అడిగినా చెబుతారు. వీర్రాజు, విష్ణులు.. ప్ర‌భుత్వం మీద‌కంటే.. ప్ర‌తిప‌క్ష టీడీపీ మీదే ఎక్కువ‌గా దాడి చేస్తుంటారు. ఇక విష్ణువ‌ర్థ‌న్‌'రెడ్డి' అయితే మీడియా మైకుల ముందు టీడీపీని విమ‌ర్శించ‌డ‌మే ఆయ‌న ప‌ని. అమ‌రావ‌తిపై సైతం నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే.. ఓ టీవీ డిమేట్‌లో జేఏసీ నాయ‌కుడి చేతిలో చెప్పు దెబ్బ కూడా తినాల్సి వ‌చ్చింది. వీర్రాజు, విష్ణుల ప్ర‌జావ్య‌తిరేఖ చ‌ర్య‌ల వ‌ల్లే ఏపీలో బీజేపీకి ప్రజాధార‌ణ లేకుండా పోతోంద‌ని అంటున్నారు. ఇక ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోథ‌ర్ సైతం వారికి వంత‌పాడుతూ.. పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. జీవీఎల్ సైతం వీరి కోట‌రీకి చెందిన మ‌నిషే.  సునీల్‌, వీర్రాజు, విష్ణు.. వీళ్లు ప‌ని చేయ‌రు.. చేసే వాళ్ల‌ను చేయ‌నీయ‌రు. మిగ‌తా పార్టీ శ్రేణులంద‌రినీ అణ‌గ‌దొక్కేసి ఈ ముగ్గురు త‌మ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లువురు బ‌ల‌మైన నాయ‌కులు బీజేపీలో చేరినా.. టీడీపీ నుంచి వ‌చ్చార‌నే ఏకైక కార‌ణంతో వారిని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. త‌మ‌కు ఎక్క‌డ పోటీగా వ‌స్తారోన‌ని.. త‌మ ఆధిప‌త్యానికి ఎక్క‌డ గండి ప‌డుతుందేమోన‌నే.. అభ‌ద్ర‌తా భావంతోనే సునీల్‌-వీర్రాజు-విష్ణు టీమ్‌ ఇలా చేస్తున్నార‌నే ఆరోప‌ణ ఉంది.  టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌లు అత్యంత బ‌ల‌మైన నాయ‌కులు. కానీ, ఈ ముగ్గురూ బీజేపీలో అంత యాక్టివ్‌గా లేక‌పోవ‌డానికి కార‌ణం వారిని అణిచేసే ప్ర‌య‌త్న‌మేనంటున్నారు. ఇటీవ‌ల ఏపీ బీజేపీ ఇంఛార్జ్‌ సునీల్ దియోథ‌ర్ చేసిన కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు పార్టీలో కాక‌రేపుతున్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి బీజేపీ పార్కింగ్ జోన్‌గా మారనిచ్చేది లేదంటూ ఇటీవల పార్టీ సమావేశంలో సునీల్ చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. విజయవాడలో సుజనా చౌదరికి చెందిన పంక్షన్‌హాల్‌ను ‘పార్కింగ్ జోన్’గా వాడుకుంటూ, తిరిగి ఆయనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారిని పార్కింగ్‌జోన్‌గా వ్యాఖ్యానించడం ఏంట‌ని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.  సునీల్‌-వీర్రాజు-విష్ణుల పెత్త‌నానికి వ్య‌తిరేకంగా ప‌లువురు సీనియ‌ర్లు, కొత్త‌-పాత నాయ‌కులు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ అధ్య‌క్షులు న‌డ్డా దృష్టికి విష‌యం తీసుకెళ్లార‌ని.. అమిత్‌షానూ క‌లిసి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్‌మెంట్ అడిగార‌ని తెలుస్తోంది. ఈ ముగ్గురూ ఇలా పార్టీకి న‌ష్టం చేకూర్చేలా సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నా.. ఏపీ వ్య‌వ‌హారాలు చూసే  జాతీయ స్థాయి నాయ‌కులైన జీవీఎల్ కానీ, ముర‌ళీధ‌ర్ కానీ.. అస‌లేమాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నాయి పార్టీ వ‌ర్గాలు. ఇటీవ‌ల బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం ప్ర‌క‌టించినా.. అందులో ఏపీ నుంచి క‌న్నా మిన‌హా మ‌రెవ‌రికీ స్థానం ద‌క్క‌క‌పోవ‌డానికి వీరు చేసిన లాబీయింగే కార‌ణ‌మంటున్నారు. ఆ ముగ్గురి ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ఇప్ప‌టికే జ‌న‌సేన‌-ప‌వ‌న్‌క‌ల్యాణ్ బీజేపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి దాపురించింది. బ‌ద్వేల్‌లో త‌లోదారి చూసుకున్నారు. ఏపీలో పార్టీకి ఎదుగుద‌ల లేకుండా పోయింది. ఈ దుస్థితికి కార‌ణ‌మైన సునీల్ దియోథ‌ర్‌ను వెంట‌నే ఏపీ నుంచి త‌ప్పించాల‌ని హైక‌మాండ్‌కి ఫిర్యాదు వెళ్లింది. వీలైతే వీర్రాజు-విష్ణుల ప్రాథాన్య‌త కూడా త‌గ్గించాల‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి. 

బాండ్ల ద్వారా తెచ్చిన అప్పు ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమ.. అయ్య‌య్యో జగనన్న

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సెక్యూరిటీ బాండ్ల వేలంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన రూ. 2వేల కోట్ల అప్పును ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమచేసుకుంది. ఇప్పటికే ఓడీ ఉండడంతో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అప్పును రిజర్వు బ్యాంక్ వెంటనే జమ చేసుకుంది.  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న  జగన్ ప్రభుత్వం.. వరుసగా అప్పులు చేసుకుంటూ పోతోంది, ఎన్ని అప్పులు తెచ్చినా... ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సకాలంలో అందడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పులు తీసుకువస్తే ప్రస్తుత గండం గడుస్తుందని ప్రభుత్వం భావించింది. అధిక వడ్డీకి రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర మంగళవారం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది.  బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు  ఆశించారు.  కాని  తెచ్చిన అప్పుల్ని కాస్త ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్‌కు జమ చేసుకుంది. ఆర్బీఐ. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.  ఒక్క నెలలోనే 90 శాతం అదనపు పరిమితిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. అయితే మంగళవారం కేంద్రం నుంచి రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 17వందల కోట్లు వచ్చాయి. వచ్చిన మొత్తాన్ని జీతాలు, పెన్షన్లు ఇచ్చే అవకాశముంది. 

కొండా దంపతులను చంద్రబాబు ఆహ్వానించారా? టీడీపీలో చేరిక ఎలా ఆగింది?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులే. రాయలసీమ మాదిరి ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనే టాక్ వీళ్లపై ఉంది. వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండా దంపతుల మధ్య వార్ దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతోంది. కొండా దంపతులు కాంగ్రెస్ లో హవా చూపించగా.. ఎర్రబెల్లి టీడీపీలో కీలక నేతగా వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు. దివంగత సీఎం వైఎస్సార్ కు కొండా దంపతులు ప్రధాన అనుచరులుగా వ్యవహరించగా... చంద్రబాబు కోటరీలో ఎర్రబెల్లి ముఖ్యుడిగా కొనసాగారు.  కొండా- ఎర్రబెల్లి మధ్య సాగిన ఆధిపత్య పోరుతో వరంగల్ జిల్లా రాజకీయాలు సంచలనంగా ఉండేవి. హత్యా రాజాకీయాలతో ఉద్రిక్తతంగా ఉండేవి. 1995 నుంచి 2003 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఎర్రబెల్లి పూర్తి పట్టు సాధించారు. ఆ సమయంలో కొండా దంపతులను అప్పటి ప్రభుత్వం టార్గెట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కొండా మురళీని ఎన్ కౌంటర్ చేయాలని చూశారని.. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్సార్ కొండాకు మద్దతుగా నిలవడంతో ఆయన సేఫ్ అయ్యారనే టాక్ ఉంది. అందుకే వైఎస్సార్ కు కొండా దంపతులు ప్రధాన అనుచరులుగా ఉండిపోయారని, వైఎస్సార్ చనిపోయాకా జగన్ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నారని అంటారు.  అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా దంపతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారని టాక్ ఉండగా... కొండా సురేఖ మాత్రం ఈ విషయానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న కొండా సురేఖ  ఎర్రబెల్లిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తన భర్త మురళిని అంతం చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుట్రలు చేస్తున్నారని’ ఆరోపించారు. అందుకే ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరారని ఆమె ఆరోపించారు. తాము టీఆర్ఎస్ లో చేరిన తర్వాతే ఎర్రబెల్లి కూడా పార్టీలో చేరి రాజకీయాలు చేశాడని మండిపడ్డారు. ఒక తండ్రికే పుట్టానని.. టీడీపీని విడిచిపెట్టనని ఎర్రబెల్లి నాడు శపథాలు చేసి ఆ తర్వాత టీఆర్ఎస్ లో ఎందుకు చేరాడని కొండా సురేఖ ప్రశ్నించారు.ఎంత మంది తండ్రులకు పుట్టుంటే టీఆర్ఎస్ లో చేరారో చెప్పాలని సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము కూడా టీడీపీలో చేరాలని అనుకున్నామని.. చంద్రబాబు ఆహ్వానించారని.. కానీ ఆ పార్టీలో ఎర్రబెల్లి ఉండడంతోనే చేరలేదని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు కొండా సురేఖ.   

మంత్రి గంగులకు కొవిడ్.. హుజురాబాద్ లో టెన్షన్ 

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాలో కేసులు వస్తూనే ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనుండటంతో అక్కడ వైరస్ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్నట్లే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. రెండు ,మూడు రోజులుగా గంగుల జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారు. మంగళవారం నిర్వహించిన పరీక్షలో ఆయన కొవిడ్ నిర్దారణ అయింది. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ ట్వీట్ చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. కొన్ని రోజులుగా తనతో టచ్ లో ఉన్న వాళ్లంతా కొవిడ్ టెస్టు చేయించుకోవాలని గంగుల సూచించారు. గంగుల కమలాకర్ గత రెండు నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. మంత్రి హరీష్ రావుతో పాటు గంగులకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించడంతో.. ఆయన వరుసగా సభలు. ర్యాలీలు తీశారు. గంగుల డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాియి. ఇప్పుడు గంగులకు కొవిడ్ సోకడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఆందోశన నెలకొంది. ఎన్నికల ప్రచారంలోభాగంగా గంగులతో కలిసి తిరిగిన నేతలు, కార్యకర్తలంతా కలవరపడుతున్నారు.  మరోవైపు తెలంగాణలో గడచిన 24 గంటలలో 44,310 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 59 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 15, నల్గొండ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.201 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,266 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,60,143 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,190 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,933కి పెరిగింది.

మర్మా*గాలు కోసి, కాళ్లు చేతులు నరికేసి.. కాల్చిపారేయాల‌న్న నల్లపురెడ్డి..

ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని యావ‌త్ రాష్ట్రం ఆందోళ‌న చెందుతోంది. వ‌రుస ఘ‌ట‌న‌లు పోలీసుల వైఫ‌ల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. పాల‌కుల చేత‌గానిత‌నాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి. గ‌డిచిన రెండున్న‌రేళ్ల‌లో మ‌హిళ‌లు, చిన్నారుల‌పై వంద‌లాది అత్యాచార‌, హ‌త్య‌లు జ‌రిగాయంటూ ప్ర‌తిప‌క్షం లెక్క‌ల‌తో స‌హా ప్ర‌భుత్వాన్ని నిప్పుల‌తో క‌డిగేస్తోంది. బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి నారా లోకేశ్ వెళితే.. కేసులు, అరెస్టుల‌తో క‌క్ష్య సాధింపు చ‌ర్య‌లైతే చేప‌డుతున్నారు కానీ, మ‌రో ఘ‌ట‌న జ‌ర‌గ‌కుండా మాత్రం ఆప‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దిశ చ‌ట్టం, దిశ యాప్‌తో ఫ‌లితం శూన్యం అని అంతా పెద‌వి విరుస్తున్నారు. క‌నీసం దిశ చ‌ట్టానికి కేంద్రం నుంచి ఆమోద‌ముద్ర వేయించుకోలేని వైసీపీ స‌ర్కారును అంతా దుయ్య‌ప‌డుతున్నారు. ఓవైపు ఏపీలో, జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌పై అరాచ‌కాలు పెరిగిపోతుంటే.. మ‌రోవైపు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అప్పుడే మృగాళ్లలో భయం ఏర్పడుతుందని చెప్పారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయని.. రోడ్లపై తిరగాలంటేనే మహిళలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై దౌర్జన్యం చేసే మానవ మృగాలను పక్క దేశాల్లో నడిరోడ్డపై ఉరితీస్తారని, భారత్‌లో అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని ప్రశ్నించారు న‌ల్ల‌పురెడ్డి.  మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని ఆయ‌న అన్నారు. చట్టాలలో మార్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి  లేఖ రాయనున్నట్టు తెలిపారు. మానభంగం చేసిన వారిని పట్టుకుని శిక్షిస్తే సరిపోదని.. నడిరోడ్డుపై మర్మా*గాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే.. వారిలో భయం వస్తుందన్నారు.  వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి చేసిన కామెంట్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దిశ పేరుతో కాల‌యాప‌న చేస్తున్న జ‌గ‌న‌న్న‌కు ఈ విష‌యం చెప్పాలంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం దిశ చ‌ట్టంతో ఒక్క దోషికైనా స‌త్వ‌ర శిక్ష ప‌డేలా చేసిందా అని ప్ర‌శ్నిస్తున్నారు. దిశ చ‌ట్టాన్నే అమ‌లు చేయ‌లేని మీరు.. ఇలా మైకుల ముందు.. కాల్చిపారేయాలి.. మర్మా*గాలు కోసేయాలి.. కాళ్లు చేతులు నరికేయాల‌ని.. స్పీచులు ఇవ్వ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మంటూ మండిప‌డుతున్నారు మ‌హిళ‌లు.   

వైఎస్‌ దగ్గర కేసీఆర్‌ గులాంగిరీ! రేవంత్ రెడ్డి కామెంట్లతో రచ్చ..

కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళిత గిరిజన దండోరా సభలతో హోరెత్తించిన రేవంత్.. నిరుద్యోగ సమస్యలపై జంగ్ సైరన్ మోగిస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. పాలమూరు గడ్డపై నిరుద్యోగ విద్యార్థి జంగ్‌ సైరన్‌ మోగించామన్న రేవంత్.. కాంగ్రెస్‌ సభను చూసి టీఆర్‌ఎస్‌ భయపడుతోందని ఎద్దేవా చేశారు. పాలమూరు వలస బిడ్డల గురించి ఏనాడు పార్లమెంట్‌లో కేసీఆర్‌ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు బిడ్డలు వలస కూలీలుగానే బతకాల్సిందేనా అని ప్రశ్నించారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయినా వైఎస్‌ దగ్గర కేసీఆర్‌ గులాంగిరీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్‌ విస్తరించుకున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. సురవరం ప్రతాపరెడ్డి.. బూర్గుల రామకృష్ణారావు.. జైపాల్ రెడ్డి లాంటి అతిరథ మహారథులు పుట్టిన గడ్డ మన పాలమూరు అని రేవంత్ పేర్కొన్నారు. ఇప్పటి పాలమూర్ టీఆరెఎస్ ఎమ్మెల్యేలు.. మన పాలమూరు పరువు తీస్తున్నారని మండిపడ్డారు.    నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఊసే లేదన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని చెప్పారు. కొందరు పోలీసులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. 

మంచుకు 'మెగా' పంచ్‌.. 'మా' ఆగ‌మాగం.. 'విష్ణు' చ‌క్రం తిరిగేనా?

ఈ సినిమా వాళ్లున్నారే.. రాజ‌కీయ నాయ‌కుల‌ను మించిపోతున్నారు. అంత‌కుమించి రాజ‌కీయం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కైనా అంత‌టి హంగామా ఉంటుందో లేదో కానీ, 'మా' ఎల‌క్ష‌న్ మాత్రం క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌తో హోరెత్తింది. పోలింగ్ నాడు రోజంతా సినీరాజ‌కీయ‌మే. అధ్య‌క్ష‌ బ‌రిలో నిలిచిన ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణులేమో న‌వ్వుతూ సెల్ఫీలు దిగారు. మిగ‌తా ప్యానెల్ స‌భ్యులేమో తిట్టుకున్నారు.. కొట్టుకున్నారు.. కొరుక్కున్నారు.. ర‌చ్చ రంభోలా చేస్తారు. 'మా' ఎన్నిక‌ను సినిమాటిక్ స్టైల్‌లో ర‌క్తి క‌ట్టించారు. అయితే.. క్లైమాక్స్ మాత్రం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉండ‌టంతో అంతా షాక్‌.  'మా' ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు బ్లాక్‌బ‌స్ట‌ర్ విక్ట‌రీ సాధించారు. ప్ర‌కాశ్‌రాజ్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. అయితే.. ప్ర‌కాశ్‌రాజ్‌పై ఉన్నంత వ్య‌తిరేక‌త మిగ‌తా ప్యానెల్ స‌భ్యుల‌పై క‌నిపించ‌లేదు. అందుకే, ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది విజ‌యం సాధించారు. ప్ర‌కాశ్‌రాజ్‌ను పంతం ప‌ట్టి మ‌రీ ఓడించార‌ని తేలిపోయింది. నాగ‌బాబు ప‌దే ప‌దే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా.. ప్ర‌కాశ్‌రాజ్ ఓడిపోవ‌డాన్ని మెగా ఫ్యామిలీ డైజెస్ట్ చేసుకోలేక‌పోతోంద‌ని తెలుస్తోంది. టాలీవుడ్‌లో మెగా కుటుంబం ఆధిప‌త్యాన్ని 'మా' ఫ‌లితాలు స‌వాల్ చేసేలా ఉన్నాయంటున్నారు. అందుకే కాబోలు, త‌గ్గేదే లే.. అంటూ మెగా డైరెక్ష‌న్‌లో ప్ర‌కాశ్‌రాజ్ అండ్ టీమ్‌ రియ‌ల్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే 'మా' స‌భ్య‌త్వానికి ప్ర‌కాశ్‌రాజ్‌, నాగ‌బాబులాంటి వాళ్లు రాజీనామా చేశారు. లేటెస్ట్‌గా ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున గెలిచిన 11మంది త‌మ 'మా' ప‌ద‌వుల‌కు రిజైన్ చేసి మ‌రింత ట్విస్ట్ ఇచ్చారు. అధ్య‌క్షుడే ఓడిపోతే.. ఇక సైనికులు గెలిచినా విలువ‌, గుర్తింపు ఏముంటుంది? అందుకే.. అప్ప‌టిక‌ప్పుడు వ్యూహం మార్చేసి.. అంతా మూకుమ్మ‌డి రాజీనామాలు చేసేసి.. మంచు విష్ణుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు.  ఇదంతా ఓ సినీ పెద్ద ఆదేశాల మేర‌కే.. అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తాము ఓడినందున‌.. గెలిచిన వారికి ప్ర‌శాంత‌త లేకుండా చేసేందుకు.. 'మా' ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేసేలా.. పావులు క‌దిపార‌ని విశ్లేషిస్తున్నారు. 'ఆత్మ' అనే పేరుతో 'మా'కు పోటీగా కొత్త ఆర్గ‌నైజేష‌న్ కూడా స్టార్ట్ చేస్తారంటూ లీకులిచ్చారు. మొద‌ట్లోనే విమ‌ర్శ‌లు రావ‌డంతో.. అంత‌లోనే ఆత్మ, ప‌ర‌మాత్మ‌, ప్రేతాత్మ‌.. ఏవీ లేవంటూ ప్ర‌కాశ్‌రాజ్‌తోనే చెప్పించారు. 'మా'లో గొడ‌వ‌లు రావొద్ద‌నే స‌దుద్దేశంతోనే తాము ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించి.. 'మా'లో ముస‌లం రాజేశారని అంటున్నారు.  ప‌నిలో ప‌నిగా ప్రెస్‌మీట్లో అంతా క‌లిసి మోహ‌న్‌బాబును విల‌న్‌గా చూపించే ప్ర‌య‌త్నం బాగానే చేశారు. ప్ర‌కాశ్‌రాజ్ ఆరోపించిన‌ట్టుగా.. క్రాస్ ఓటింగ్‌, పోస్ట‌ల్ బ్యాలెట్‌లో అక్ర‌మాలు, పోలింగ్ రోజు గొడ‌వ‌లు.. ఇవేవీ టెక్నిక‌ల్‌గా నిల‌బ‌డ‌వు. మంచు విష్ణు గెలిచారు. ఇదే నిజం. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక‌.. ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాల‌తో.. 'మా'.. సినిమాటిక్ ట‌ర్న్ తీసుకుంది. మ‌రి, 'మా' క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుందో.. 'మా' తెర‌పైనే చూడాలి.... 

జగన్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ.. ఉద్యోగుల వార్నింగుతో గడబిడ..

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ కు అన్ని షాకులే తగులుతున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడంతో ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా మరమత్తులు చేయడం లేదు. ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు. పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్ని ఉండగానే కొత్తగా కరెంట్ సంక్షోభం వైసీపీ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. కరెంట్ కొరతతో రెండు, మూడు రోజుల్లో ఏపీలో కోతలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.  తాజాగా జగన్ సర్కార్ కు మరో గండం ముంచుకొస్తోంది. ఉద్యోగ సంఘాలు డెడ్ లైన్ విధించాయి. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు దిగుతామని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు, సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ సహా వివిధ అంశాలపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సమస్యలపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని సజ్జల హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేయాలని సంఘాలు కోరారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.  దసరా కానుకగా పీఆర్‌సీ ఇస్తారని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాలు తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనకు దిగడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణతో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. అయితే సజ్జలతో సమావేశంలో సానుకూల ఫలితం రాకపోవడం వల్లే వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వేతనాలు ఎప్పుడో వస్తాయో తెలియని పరిస్థితి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్సీ సహా ఇతర సమస్యల పరిష్కారానికి ఎన్నో రోజులుగా పోరాడుతున్న ఫలితం రావడం లేదు. దీంతోనే ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 

మంచుకు మెగా పంచ్‌.. స‌జ్జ‌ల‌కు ఉద్యోగుల వార్నింగ్.. టాప్ న్యూస్ @ 7pm

1. ‘‘మా’’ లో ముస‌లం ముదిరింది. ప్ర‌కాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు త‌మ పదవులకు రాజీనామా చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి కార‌ణాలు వివ‌రించారు ప్ర‌కాశ్‌రాజ్‌. ‘‘మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయి. బెనర్జీపై చేయి చేసుకున్నారు. పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందుకే రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై అందరం కూర్చుని చర్చించాం. ‘మా’ ఎన్నికలలో గెలిచిన విష్ణు‌కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు మా ప్యానల్‌లో గెలిచిన వారందరం రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. విష్ణు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం’’ అని ప్ర‌కాశ్‌రాజ్ అన్నారు. 2. మోహన్‌బాబు తనని అందరి ముందు దారుణంగా బూతులు తిట్టటం బాధ కలిగించిందని న‌టుడు బెనర్జీ కంట‌త‌డి పెట్టారు. మంచు కుటుంబంతో తనకు ఎన్నో దశాబ్దాల అనుబంధం ఉందని.. అటువంటి తనని మోహన్‌బాబు తీవ్రమైన పదజాలంతో దూషించటం తీవ్రంగా బాధించిందని బెనర్జీ మీడియా ముందు కంటతడి పెట్టారు. మా ఎన్నిక‌ల రోజు మంచు విష్ణు, మంచు మ‌నోజ్ లేకుంటే.. మోహ‌న్‌బాబు చేష్ట‌ల‌కు తమ మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగేద‌న్నారు ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ స‌భ్యులు. 3. పిల్ల‌లకు 'కొవాగ్జిన్‌' టీకా ఇచ్చేందుకు కేంద్రం అనుమ‌తించింది. 2 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ వేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. గత నెలలో పిల్లలపై రెండు, మూడు దశల్లో ప్రయోగాలు చేసి.. ఆ వివరాలను భార‌త్ బ‌యోటిక్ సంస్థ డీసీజీఐకి తెలియజేస్తూ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. స‌మాచారం పరిశీలించిన డీసీజీఐ.. పిల్ల‌ల‌కు కొవాగ్జిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. 4. విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని అమ్మ‌వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంత‌కుముందు.. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం జ‌గ‌న్ సమీక్ష నిర్వహించారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోసేవా, నవనీత సేవలపై సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు అధికారులు. 5. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం భేటీ వివ‌రాల‌ను ఏపీజేఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు తెలిపారు. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటోన్న సమస్యలను సజ్జల దృష్టికి తెచ్చాం. దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందని ఆశిస్తున్నాం. 12వ తేదీ వచ్చినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులు రావడం లేదు. ప్రతి నెలా ఒక‌ట‌వ‌ తారీఖున వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాం.. అని బండి శ్రీనివాసులు అన్నారు. 6. కృష్ణా, గోదావ‌రి బోర్డుల ప‌రిధిని నిర్ణ‌యిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేష‌న్ ఈ నెల 14 నుంచి అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్టు కేఆర్ఎంబీ ప్ర‌క‌టించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్ల‌ను బోర్డు ప‌రిధిలోకి తీసుకోనున్న‌ట్టు తెలిపింది. దీంతో శ్రీశైలం, నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లు బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌నున్నాయి. ఇందుకు తెలుగురాష్ట్రాలు స‌హ‌క‌రించాల‌ని కేఆర్ఎంబీ విజ్ఞప్తి చేసింది.  7. ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. 7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. 8. ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే.. ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ తెలిపారు. జగనన్న ట్రూ చార్జ్‌తో ప్రజలకు కష్టాలు వస్తే.. ఇప్పుడు జగనన్న కరెంట్‌ కోత పేరుతో కొత్త పథకం అమలు మొదలైందంటూ దుయ్య‌బ‌ట్టారు ఎంపీ ర‌ఘురామ‌.  9. హెటిరోలో తవ్విన కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. 16 లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేసి.. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క లాక‌ర్‌లో రూ.1.5 కోట్ల నుంచి 2 కోట్ల నగదు ఉంది. లాక‌ర్ల‌లోని రూ.30 కోట్ల క్యాష్‌ను ఐటీ అధికారులు సీజ్‌ చేశారు. ఇప్పటికే రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.550 కోట్ల అనుమానిత లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. 20లోపు తమ ఎదుట హాజరవ్వాలని హెటిరో యాజ‌మాన్యానికి ఐటీ నోటీసులు జారీ చేసింది. 10. మానవ హక్కులను నచ్చినట్లుగా వివరిస్తున్నవారిపై ప్రధాని మోదీ మండిప‌డ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను రాజకీయ లాభ, నష్టాల దృష్టితో చూసే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. వీరి వైఖరి మానవ హక్కులకు మాత్రమే కాకుండా దేశానికి కూడా హానికరమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా మోదీ మాట్లాడారు.