హుజురాబాద్ బరిలో ముగ్గురు రాజేందర్లు.. ఈటలకు భారీ ఊరట..
posted on Oct 11, 2021 @ 4:40PM
తెలంగాణలో రాజకీయాల్లో కీలకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కీలక పరిణామం జరిగింది. అధికార టీఆర్ఎస్ ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు భారీ ఊరట లభించింది. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లు గురువారంతో ముగిశాయి. మొత్తం 61 మంది 69 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల పరిశీలనలో 19 మందికి చెందిన 23 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
నామినేషన్ల తిరస్కరణలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఊరట కలిగింది. హుజురాబాద్ లో రాజేందర్ పేరుతో ఉన్న మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. వాళ్ల ఇంటిపేరు కూడా ఈ తోనే వచ్చింది. దీంతో రాజేందర్ పేర్లతో ఓటర్లు తికమక పడే అవకాశం ఉందని, ఇది ఈటల రాజేందర్ కు నష్టం కల్గిస్తుందనే ఆందోళన బీజేపీలో వ్యక్తమైంది. అయితే నామినేషన్ల స్క్రూటీనీలో రాజేందర్ పేరుతో ఉన్న మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పలపల్లి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇమ్మడి రాజేందర్ నామినేషన్లు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. వీళ్లు ముగ్గురు కూడా ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.
రాజేందర్ పేరుతో నామినేషన్లు దాఖలు కావడం వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఇ రాజేందర్ పేరుతో ఉన్న ఇతరులను తీసుకువచ్చి హుజూరాబాద్ లో నామినేషన్లు వేయించారని, ఓటర్లను గందరగోళానికి గురిచేసే కుట్ర చేసిందని మండిపడింజది. తాజాగా పరిశీలనలో వాళ్ల నామినేషన్లు తిరస్కరంచబడంతో కమలనాధులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున వెంకట్ బల్మూరి పోటీలో ఉన్నారు.