హిందుత్వానికి పంగనామాలా? ఆయన జగన్ బినామినా?
posted on Oct 11, 2021 @ 4:54PM
వైసీపీ అధికార పత్రికలో ఫుల్ పేజీ ప్రకటన. సీఎం జగన్మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా ఇచ్చిన ఖరీదైన యాడ్. తిరుమలలో కొత్తగా నిర్మించిన గోమందిరంను సీఎం జగన్ ప్రారంభించబోతున్నట్టు చెప్పే ప్రకటన అది. గోమందిరం నిర్మించిన ఏ.జే.శేఖర్ అనే ప్రముఖుడే పేపర్లో ఈ యాడ్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఏ.జే.శేఖర్ ఎవరనేది ఆసక్తికర అంశం.
ఏ.జే.శేఖర్ అంటే వెంటనే తెలీకపోవచ్చు కానీ, శేఖర్‌రెడ్డి అంటే మాత్రం కాస్త తెలిసిన పేరే అనిపిస్తుంది. ఆయన గురించి డీటైల్స్ చెబితే.. ఓ.. ఆయనా అని నోరెళ్లబెడతారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో అప్పటి టీటీడీ బోర్డు మెంబర్, చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి ఇంట్లో కట్టలకు కట్టలు కొత్త 2వేల నోట్ల కట్టలు బయటపడటం సంచలనంగా మారింది. వందల కోట్ల విలువైన కరెన్సీ నోట్లను శేఖర్‌రెడ్డి ఇంట్లో సీజ్ చేశారు అధికారులు. ఆ శేఖర్‌రెడ్డినే ఈ ఏ.జే.శేఖర్. అప్పట్లో ఆయన్ను లోకేశ్‌బాబుకు బినామీ అంటూ ప్రచారం చేసింది వైసీపీ మూక. అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న శేఖర్‌రెడ్డి.. ఇప్పుడు ఏ.జే.శేఖర్‌గా జగన్ పంచన చేరి.. ఏపీలో సిలికా గనులు దక్కించుకున్నారని అంటారు. చెన్నై టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి.. టీటీడీ బోర్డులో ప్రత్యేక అతిథునిగా చేసింది. ఆయన తిరుమలలో గోమందిరం నిర్మించి.. సీఎం జగన్‌కు ఆహ్వానం పలుకుతూ.. సాక్షిలో ఖరీదైన ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడం విశేషం. మరి, ఒకప్పుడు శేఖర్‌రెడ్డికి- నారా లోకేశ్‌కి లింక్ పెట్టి అభూత కల్పనలు అల్లిన వైసీపీ.. ఇప్పుడు ఏ.జే.శేఖర్.. సీఎం జగన్‌కు బినామీనా అని ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తుందో మరి?
ఇక జగన్ తిరుమల ప్రకటనపై పేపర్లో ఫుల్ పేజీ కలర్ యాడ్ ఇవ్వడంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రజలను నమ్మించడానికి తిరుపతిలో గోమందిర ప్రారంభోత్సవానికి వెలుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. కమిట్మెంట్ లేని కలర్ పత్రిక ప్రకటనలు అవసరమా? అని ప్రశ్నించారు. నిత్యం అసభ్య పదజాలంతో విమర్శించే పత్రికలకు కూడా ప్రకటనలు ఇచ్చి మరీ దేవాలయల దగ్గర జరుగుతున్న అన్యమత ప్రచారాలను పక్కదోవ పట్టించేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు.
ప్రచార జిమ్మిక్కులతో కాకుండా, టీటీడీ నియమాల ప్రకారం.. సీఎం జగన్ సతీసమేతంగా.. హిందు ఆచార సాంప్రదాయం ప్రకారం.. తిరుమలేశున్ని ఎప్పుడు సేవిస్తారని లంక దినకర్ నిలదీశారు. ఓవైపు అన్యమత ప్రచారానికి రాష్ట్రంలో ఊతం ఇస్తూ.. మరోవైపు జగన్ నుదుట బొట్టు పెట్టుకున్న ఫోటోతో పత్రిక ప్రకటన ఇచ్చి.. హిందత్వానికి జగన్మోహన రెడ్డి పంగనామాలు పెడుతున్నారని లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.