రాయచూర్ ను తెలంగాణలో కలపండి..బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్.. కేటీఆర్ ట్వీట్
posted on Oct 12, 2021 @ 11:15AM
తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపండి అంటూ గతంలో మహారాష్ట్రలోని కిన్వట్, మాహోర్ తాలూకాలోని పలు గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. నాందేడ్ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. కర్ణాటక ఎమ్మెల్యే శివరాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
సోమవారం రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యేశివరాజ్.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్నారని అన్నారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. అలా చేయలేకపోతే.. తెలంగాణలో కలిపేయాలని ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేశారు.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ పై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'తెలంగాణ ఖ్యాతి సరిహద్దులు దాటింది.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. అక్కడున్న ప్రజలంతా ఆయన సూచనను చప్పట్లతో స్వాగతించారు' అంటూ ట్వీట్‌చేశారు. దీనిపై వందల సంఖ్యలో నెటిజన్లు 'తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది.. కేసీఆర్ లాంటి సీఎం మరొకరు ఉండరు.. కేసీఆర్ పాలనకు ఫిదా అయిన బీజేపీ ఎమ్మెల్యే.. కేసీఆరా మజాకా' అంటూ ట్వీట్‌ల ద్వారా స్పందించారు. డాక్టర్ శివ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను అటాచ్ చేసి క్రిషాంక్ అనే టీఆర్‌ఎస్ నాయకుడు చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.