ఏపీలో నియంత పాలన.. 30 కోట్లు హాంఫట్.. కరెంట్ కిరికిరి.. టాప్ న్యూస్ @ 1pm
posted on Oct 12, 2021 @ 12:44PM
1. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం పట్ల టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తే దారులపై కక్ష సాధింపులా అని నిలదీశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని అన్నారు.
2. దేశంలో, రాష్ట్రంలో నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. దేశంలో ప్రజలను బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారన్నారు. దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ తీసుకువచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని తెలిపారు. మోదీ సోషలిస్ట్ విధానాలను పక్కనపెట్టి కాపిటలిస్ట్ విధానాలు తీసుకువచ్చి దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు.
3. వైసీపీ నేతలు రూ. 30 కోట్లు హాంఫట్ చేశారు. పంటల బీమా సొమ్ములో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. పత్తి చేలుగా మామిడి, పామాయిల్ తోటలను చూపించి కోట్లలో బీమా సొమ్ము స్వాహా చేశారు. పత్తి సాగు చేయకుండానే వైసీపీ నేతలు తుఫానులో దెబ్బ తిన్నట్లు రికార్డులు పుట్టించారు. ఒక్క మైలవరం నియోజక వర్గంలోనే రూ. 4 కోట్లు స్వాహా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదే దందా. రూ. 30 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.
4. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అమ్మవారిని దర్శించుకోడానికి కొండ పైకి వెళ్తున్న ఆయన వాహనాన్ని ఘాట్ రోడ్డు వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో కేశినేని నాని తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే కొండపైకి వెళ్లి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
5. రాయ్‌చూర్ ను తెలంగాణలో కలిపేయాలి’’ అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శివ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.‘‘తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి సరిహద్దుల ఆవల నుంచి కూడా ఈవిధంగా ధ్రువీకరణ లభిస్తోంది. సాక్షాత్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయ్‌చూర్‌ను తెలంగాణలో కలపాలని చెబుతున్నారు. ఆయన డిమాండ్‌ను స్వాగతిస్తూ అందరూ చప్పట్లు కొడుతున్నారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
6. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ....బీరుల తెలంగాణగా మార్చారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
7. దిశ కేసులో మాజీ సీపీ సజ్జనార్ వరుసగా రెండవరోజు హైపవర్ కమిషన్ ముందు హాజరయ్యారు. సజ్జనార్ ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. నేడు మరోసారి సజ్జనార్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. దిశ ఘటన పరిణామాల తరువాత ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై కమిషన్ విచారణ చేయనుంది.
8. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 1,72,113 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా ఉంది.
9. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వి.దుర్గా ప్రసాద్‌పై వేటు పడింది. ఏసీఏ నిబంధనలను ఉల్లంఘించారనే కారణాలపై అంబుడ్స్‌మెన్ విచారణ నిర్వహించింది. అంబుడ్స్‌మెన్ విచారణలో కార్యదర్శి దుర్గా ప్రసాద్‌పై వచ్చిన అభియోగాలపై విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో కార్యదర్శిని తప్పించడంతో పాటు 5 వేలు జరిమానా విధించారు.
10. విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. బొగ్గు కొరతతో పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు నెలకొనడంపై దృష్టి సారించింది. దేశంలో విద్యుత్ సంక్షోభం వస్తుందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం పీఎంవో సమీక్ష నిర్వహించనుంది. అసలు దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎన్ని, వాటికున్న బొగ్గు నిల్వలు ఏ మేరకు ఉన్నాయి.. ఇప్పటి వరకు బొగ్గు నిల్వలు అడుగంటిపోవడానికి గల కారణాలేంటి? వాటికి సంబంధించి కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖ ఏయే చర్యలు చేపట్టాయన్న విషయంపై పీఎంవో సమీక్ష నిర్వహించనుంది.