కాంగ్రెస్‌లోకి డీఎస్‌!.. అర్వింద్ కూడా? రేవంత్ వ్యూహం అదుర్స్‌..

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను క‌లిశారు. మామూలుగా అయితే ఇదేమంత ఆస‌క్తిక‌ర విష‌యం కాక‌పోవ‌చ్చు. కానీ, ఆ మాజీ పీసీసీ చీప్ ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. అందులోనూ కేసీఆర్‌తో తేడాలొచ్చి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక డీఎస్ త‌న‌యుడు అర్వింద్‌.. బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ. మ‌రో త‌న‌యుడు సంజ‌య్ ఇటీవ‌లే రేవంత్‌ను క‌లిసి కాంగ్రెస్‌కు జై కొట్టారు. అలాంటి డి.శ్రీనివాస్‌ను ఇంటికెళ్లి మ‌రీ క‌లిసొచ్చారు రేవంత్‌రెడ్డి.  ఇటీవ‌ల‌ డీఎస్‌ కిందపడిపోగా చెయ్యి విరిగింది. ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు వెళ్లారు రేవంత్‌రెడ్డి. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని, డి.శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వెళ్లిన‌ట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. పైపైన చూస్తే.. ఇదే మామూలు ప‌రామ‌ర్శ‌లానే అనిపించినా.. ఈ ప‌రిణామం రేవంత్‌రెడ్డి రాజ‌కీయ చాతుర్యానికి నిద‌ర్శ‌నం అంటున్నారు.  వైఎస్‌-డీఎస్ కాంబినేష‌న్ ఉమ్మ‌డి రాష్ట్రంలో బంప‌ర్ హిట్‌. రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు వారిద్ద‌రు. అలాంటి ఉద్దండుడైన డి.శ్రీనివాస్‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప్రాభ‌వం కోల్పోవ‌డంతో టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సైతం ఆయ‌న‌కు మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు. రాజ్య‌స‌భ‌కు పంపించారు. కానీ, ఆ త‌ర్వాత డీఎస్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. కేసీఆర్ తీరు న‌చ్చ‌క అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌న‌యుడు అర్వింద్ మాత్రం బీజేపీలో యాక్టివ్‌గా కొన‌సాగుతున్నారు. నిజామాబాద్‌ ఎంపీగా అర్వింద్ గెల‌వ‌డంతో డీఎస్ స‌హ‌కారం ఉందంటారు. ఇక మ‌రో త‌న‌యుడు సంజ‌య్ మాత్రం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వం మెచ్చి ఇటీవ‌లే కాంగ్రెస్ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. సంజ‌య్ కాంగ్రెస్ వైపు చూట్టానికి డి.శ్రీనివాసే కార‌ణ‌మ‌ని చెబుతారు. దీంతో.. రేవంత్‌రెడ్డి మ‌రో అడుగు ముందుకేశారు. ప‌రామ‌ర్శ‌క‌ని డీఎస్ ఇంటికెళ్లి ఆయ‌న్ను తిరిగి కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌ని ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ మాదిరి కాకుండా.. కాంగ్రెస్‌లో డీఎస్‌కు స‌ముచిత స్థానం, ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ప‌నిలో ప‌నిగా బీజేపీ ఎంపీ అర్వింద్‌కు సైతం న‌చ్చ‌జెప్పి పార్టీలో చేర్పించాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.  నిజామాబాద్‌కు ప‌సుపు బోర్డు తీసుకొస్తానంటూ వాగ్ధానం చేసి.. కేసీఆర్ కూతురు క‌విత‌ను ఓడించి.. ఎంపీగా గెలిచారు ధ‌ర్మ‌పురి అర్వింద్‌. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయ‌న బీజేపీ ఎంపీ అయినా.. నిజామాబాద్‌కు మాత్రం ప‌సుపు బోర్డు తీసుకురాలేక‌పోయారు. ఆ విష‌యంలో నిజామాబాద్ రైతులు అర్వింద్‌పై-బీజేపీపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈసారి బీజేపీకి గుణ‌పాఠం చెప్పడం ఖాయం అంటున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టిన రేవంత్‌రెడ్డి.. అర్వింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తే గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని.. అందుకే కాంగ్రెస్‌లో చేరితే బెట‌ర‌ని.. రైతుల కోపం బీజేపీ మీద‌నే కానీ, అర్వింద్ మీద కాద‌ని.. డీఎస్‌కు వివ‌రించి చెప్పారట‌. ఆ మేర‌కు అర్వింద్‌ను ఒప్పించి కాంగ్రెస్‌లో చేరేలా చూడాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. ఇలా.. ఇటు డీఎస్‌ను, అటు అర్వింద్‌ను ఒకేసారి పార్టీలో చేరేలా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. సంజ‌య్ ద్వారా ఆ మేర‌కు ధ‌ర్మ‌పురి ఫ్యామిలీతో రాజ‌కీయం న‌డిపిస్తున్న రేవంత్‌రెడ్డి ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి..

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి! 

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్.కెగా పని చేశారు. విప్లవోద్యమంలో ఆర్కేది తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు.  2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్కే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును పోలీస్ శాఖ గతంలో ప్రకటించింది.  సౌత్‌లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా పోరాటం చేశారు రామకృష్ణ. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలు దఫాలుగా పోలీసుల నుంచి తప్పించుకున్నారు. అయితే ఆర్కే మృతిపై సమాచారం లేదని విరసం నేత కల్యాణరావు తెలిపారు. 

కేటీఆర్ వర్సెస్ కవిత? టీఆర్ఎస్ లో ఏమి జరుగుతోంది.. పెనుమార్పులు తప్పవా? 

తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఆసక్తికర చర్చకు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఎన్నిక షెద్యూలు వచ్చే వరకు, ముఖ్యమంత్రి మొదలు, (కేటీఆర్ మినహా) పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఫోకస్ మొత్తం హుజూరాబాద్ మీదనే పెట్టారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఆయన అక్కడ ఉండగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది.  ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, కారణాలు ఏవైనా హుజూరాబాద్  ఉప ఎన్నిక మీద ముందున్న శ్రద్ద ఆసక్తి ఫోకస్ ఇప్పుడు లేవేమో అనిపించేలా ఆయన కార్యక్రమాలలో మార్పు కనిపిస్తోంది. చినజీయర్ స్వామి,  యాదాద్రి ఆలయ అభివృద్ధి, ప్రారంభోత్సవం వంటి ఇతర అంశాల మీద ముఖ్యమంత్రి దృష్టిని మరల్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పొలిటికల్ ఫోకస్ ను ఎందుకు హుజూరాబాద్ నుంచి  పక్కకు తప్పించారో ఏమో కానీ,అదే సమయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షడు, మంత్రి కేటీఆర్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ద్వి దశాబ్ది  ఉత్సవాల ప్రకటనతో హుజూరాబాద్ ఉప ఎన్నిక, నాట్ సో ఇంపార్టెంట్,  అంత ముఖ్యమైన విషయం కాదు అన్న సంకేతాలను పంపారు. దీంతో, హుజూరాబాద్’నుంచి ముఖ్యమంత్రి వెనకడుగు వేయడం కూడా ఆ వ్యూహంలో భాగమే అనే, అనుమానాలు బలపడుతున్నాయి.  తెరాస సంస్థాగ‌త ఎన్నిక‌ల్లో భాగంగా ఇప్ప‌టికే గ్రామ‌, మండ‌ల, జిల్లా స్థాయిల్లో కార్య‌వ‌ర్గాల నియామకాలు పూర్తయ్యాయి. ఈ ప్ర‌క్రియ‌లో ప్రధాన ఘట్టం పార్టీ అధ్యక్షుని ఎన్నిక అక్టోబ‌ర్ 25న జరుగుతుందని, తెరాస అధ్యక్షునిగా పోటీ చేయాలనుకునే వారు అక్టోబ‌ర్ 17 నుంచి నామినేష‌న్ల‌ను వేయవచ్చని కేటీఆర్ ప్రకటించారు. అయితే, పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆరే అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రతి సారీ ఏకగ్రీవంగానే ఆయన ఎన్నికవుతున్నారు. అయితే ఈ సారి, ఆ ఆనవాయితీ మారుతుందా? తెరాసకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అంటే, పార్టీలో అవుననే మాటే ఎక్కువగా వినవస్తోంది.  ఈ సారి కేసీర్ తప్పుకుని, కేటీఆర్ కు అవకాశం ఇస్తారని, అందుకోసమే, ఎవరూ అడ్డుకునే అవకాశం లేకుండా షెడ్యూలు ఫిక్స్ చేశారని పార్టీ వర్గాల సమాచారం.కీటీఅర్ కు పార్టీ, ప్రభుత్వ ఉత్తరాదికారి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భావిస్తున్నారని అందుకే, ఈటల పై వేటు మొదలు వ్యూహాత్మకంగా  ఒక్కొక అడుగు వేసుకుంటూ వస్తున్నారని అంటున్నారు. ఇప్పుడే కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ,అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో. ఆయన త‌న‌కు కావాల్సిన వారికి టికెట్లు ఇచ్చి, భ‌విష్య‌త్తుల్లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అడ్డు లేకుండా, ఏ స‌మ‌స్యా రాకుండా చేసుకోవ‌డానికి వీలు ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని అంటున్నారు.  నిజానికి కేటీఅర్ కు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో పదోన్నతి కలిపించే విషయంగా, కుటుంబంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలు,విభేదాల కారణంగానే, కవిత పుట్టింటికి (ప్రగతి భవన్)కు దూరంగా ఉంటున్నారని, ఈ విషయంలో కేటీఆర్, కవిత మధ్య దూరం బాగా పెరిగిందనే వార్తలు చాలా కాలంగా వినవస్తున్నాయి. రాఖీ పండగకు కవిత అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేదు. సరే,అప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు కాబట్టి రాలేక  పోయారు అనుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మకు ప్రాచుర్యం కలిపించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  పుట్టిల్లు, ప్రగతి భవన్’ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనక పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. అదెలా ఉన్నా,  హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే తెరాసలో పెను మార్పులు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.. సందేహలు బలపడుతున్నాయి.

హెటిరో సొమ్ము జ‌గ‌న్‌దేనా?.. రేవంత్ వెట‌ర‌న్ పాలిటిక్స్‌.. 'మా'లో మ‌రింత మంట‌.. టాప్ న్యూస్ @ 7pm

1. అవ‌స‌ర‌మైతే పాకిస్తాన్‌పై మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తామంటూ దాయాది దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. దాడి చేసినవారితో కూర్చుని చర్చించే రోజులు ఒకప్పుడు ఉండేవని, ఇవి ఉగ్రవాద దాడులకు దీటైన జవాబు చెప్పే రోజులని హెచ్చ‌రించారు. జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదులు హిందువులు, సిక్కులను గుర్తించి మరీ చంపుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  2. మహర్నవమి సందర్భంగా తెలంగాణ‌ గవర్నర్‌ డా. తమిళిసై సౌందర రాజన్‌ రాజ్‌భవన్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. రాజ్‌భవన్‌లో సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన ఆయుధాలకు, వాహనాలకు గవర్నర్‌ పూజ చేశారు. రాజ్‌భవన్ ప్రాంగ‌ణంలోని అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి గవర్నర్‌తో పాటు ఆమె భర్త సౌందరరాజన్‌, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 3. మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్‌ లేఖ రాశారు. ఎన్నికల రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్‌ మా సభ్యులను బెదిరించారని, దాడులకు పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. 4. మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 16 వ తేదీన జరిగే మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. అంత‌కుముందు మంచు విష్ణు, మోహ‌న్‌బాబులు నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటికి వెళ్లి మ‌ద్ద‌తు కోరారు. త్వ‌ర‌లోనే చిరంజీవిని సైతం క‌లుస్తాన‌ని చెప్పారు మంచు విష్ణు.  5. తూర్పుగోదావరి జిల్లాలోని రాయుడుపాలెంలో సచివాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కన్నబాబును వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గుడి విషయంలో బీసీ వర్గానికి కాకుండా.. కాపు వర్గానికి పెద్ద పీఠ వేయడాన్ని బీసీ నాయకులు వ్యతిరేకించారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి వేరే సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆగ్రహంతో అక్కడి నుంచి మంత్రి కన్నబాబు వెళ్లిపోయారు.  6. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. డీఎస్‌ కిందపడిపోగా చెయ్యి విరిగిందని, ఈ విషయం తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు రేవంత్‌రెడ్డి. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని, డి.శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. 7. హెటిరోలో దొరికిన సొమ్మంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రూ.147 కోట్లు మాత్ర‌మే కాదని ఇంకా వేల కోట్లలో దాచారన్నారు. ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనన్నారు. ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. 8. రేపోమాపో సజ్జల మంత్రి అవుతారని ర‌ఘురామ జోస్యం చెప్పారు. ఒక్క శాఖకు మంత్రి అవుతారో లేక సకల శాఖలకు మంత్రి అవుతారో అర్థం కావ‌ట్లేదంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జలే మాట్లాడుతున్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సజ్జల సకలశాఖ మంత్రిగా.. సకల విషయాలు చూస్తారా? అంటూ ర‌ఘురామ ప్ర‌శ్నించారు.  9. గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై ఏపీ ఇరిగేషన్ వర్గాల్లో తర్జనభర్జన మొదలైంది. గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ససేమిరా అంటోంది. తమ వైపు నుంచి ఏం చేయాలనే దానిపై ఏపీ మల్లగుల్లాలు పడుతోంది. విద్యుత్ కేంద్రాలు, ఆఫ్‌టేక్ ప్రాజెక్టులను తెలంగాణ అప్పగిస్తేనే.. ప్రాజెక్టులు అప్పగించే ప్రక్రియని మొదలుపెట్టాలని ఏపీ ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. సీఎం జ‌గ‌న్‌తో చర్చించిన తర్వాత ప్రాజెక్టుల అప్పగింతపై జగన్ సర్కార్ ముందడుగు వేయనుంది.  10. తిరుమల క్షేత్రాన్ని, శ్రీవారి మహత్యాన్ని జగన్ ప్రభుత్వం మంటగలుపుతోందని టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. తిరుమల స్వామివారి సన్నిధిలో గోవింద నామస్మరణకు బదులుగా జగన్మామస్మరణ చేయడమేంటని ప్రశ్నించారు. హిందూమతాన్ని, హిందువులను గౌరవించలేని వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఇంత ఘోరం జరుగుతుంటే స్వామీజీలు, పీఠాధిపతులు ప్రభుత్వాన్ని, పాలకులను ఎందుకు ప్రశ్నించడంలేదని పుట్టా సుధాకర్ యాదవ్ నిలదీశారు.

షాడో సీఎం స‌జ్జ‌ల‌.. స‌క‌ల శాఖ మంత్రిగా నియామ‌కం!

రాజ్యంగం ప్ర‌కారం మంత్రులంతా స‌మానం. అందులో ముఖ్య‌మంత్రి కాస్త ఎక్కువ స‌మానం. అంతే. మిగ‌తా అంతా ఈక్వ‌ల్‌. ఒక్కో మంత్రి ఒక్కో శాఖను ప‌ర్య‌వేక్షిస్తుంటారు. మంత్రులంతా కేబినెట్‌కు జవాబుదారీగా ఉంటారు. కానీ, ఏపీలో అలా ఉండ‌దు. ప‌వ‌ర్ అంతా సీఎం జ‌గ‌న్‌రెడ్డి ద‌గ్గ‌రే కేంద్రీకృత‌మై ఉంటుంది. మంత్రులు ఉన్నా.. వాళ్లు డ‌మ్మీల‌నే భావ‌న ఉంది. ముఖ్య‌మంత్రి సూప‌ర్ బాస్ అయితే.. మ‌రి బాస్ ఎవ‌రు? అనే డౌట్ రావొచ్చు. ఇంకెవ‌రూ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డినే అంటున్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పేరుతో.. అన్ని శాఖ‌ల‌కు ఆయ‌నే మంత్రిగా చెలామ‌ని అవుతుంటార‌ని చెబుతున్నారు. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఉండే ముఖ్య‌మంత్రి ఎలాగూ ఎవ‌రికీ అందుబాటులో ఉండ‌రు. అందుకే, ఏ శాఖ‌లో ఏ ప‌ని కావాల‌న్నా.. స‌జ్జ‌ల‌తోనే అవుతుంద‌ని అంటారు. అన్ని శాఖ‌ల‌కు వేరు వేరుగా మంత్రులు ఉన్నా.. అన్ని శాఖ‌ల ఉమ్మ‌డి మంత్రి మాత్రం స‌జ్జ‌ల‌నే అన్న‌ట్టు వ్య‌వ‌హారం సాగుతుంద‌ని అంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు.  రేపోమాపో సజ్జల మంత్రి అవుతారని అంటున్నారని చెప్పారు. ఒక్క శాఖకు మంత్రి అవుతారో లేక సకల శాఖలకు మంత్రి అవుతారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జలే మాట్లాడుతున్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సజ్జల సకలశాఖ మంత్రిగా.. సకల విషయాలు చూస్తారా? అంటూ ర‌ఘురామ ప్ర‌శ్నించారు.  ‘‘రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై కోల్‌ ఇండియా ఛైర్మన్‌తో చర్చించా. రాష్ట్రాలు బొగ్గు నిల్వల పెంపునకు యత్నించాలని చెప్పారు. కోల్‌ ఇండియాకు ఏపీ రూ.300 కోట్లు బాకీ ఉన్నట్టు చెప్పారు. 25 ఏళ్లవి రద్దు చేసి 30 ఏళ్ల  ఒప్పందాలు చేసుకున్నారు. జగనన్న కొవ్వొత్తి ప‌థ‌కం, వైఎస్సార్‌ అగ్గిపెట్టె పథక‌మ‌ని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని ర‌ఘురామ విమ‌ర్శించారు. జెన్‌కో, ట్రాన్స్‌కోకు ఒకరే చైర్మన్‌గా ఉండాలని సూచించారు.   అమ్మఒడి నిధులు జూన్‌కు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్టేనని రఘురామ మండిప‌డ్డారు. జగన్‌ నవరత్నాల్లో ఒక ర‌త్నం రాలిపోయిందన్నారు. అమ్మ ఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో అప్పుల సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.    జగన్‌ ప్రభుత్వం వచ్చాక రూ.2.87 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్ర ఖజానాలో రూ.1.31లక్షల కోట్ల లెక్కలు తేలట్లేదు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పలు వివరాలు విడుదల చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.   

హెటిరోలో దొరికిన డబ్బంతా జగన్ దేనా? 

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖమైన హెటిరో ఫార్మా సంస్థల్లో జరిగిన ఐటీ సోదాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.  నాలుగు రోజులుగా హెటిరో ఫార్మా కార్యాల‌యాలు, యూనిట్లు, కంపెనీ డైరెక్ట‌ర్లు, సీఈఓ ఇళ్ల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు. రూ. 142 కోట్ల నగదు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డిపై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసులో స‌హ నిందితుడిగా ఉన్న హెరిటో ఫార్మా చైర్మ‌న్ బండి పార్ధ‌సార‌ధి రెడ్డికి సంబంధించి చీక‌టి కోణాలు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 6 రాష్ట్రాల్లో హెటిరో సంస్ధల్లో 60 చోట్ల 4 రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. బీరువాల నిండా రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి. నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్‌ చేశారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ. 142 కోట్లు దాచారని అధికారులు వెల్లడించారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని తెలిపారు. ఒక్కో అల్మారాలో రూ. 5 కోట్ల నగదు దాచారని తెలిపారు. బీరువాల్లో లబించిన డబ్బుల కట్టలు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. బోర‌బండ‌లో హెటిరో ర‌హ‌స్య స్థావ‌రంగా భావిస్తున్న  డెన్‌లోనే  ఏకంగా రూ.142.87 కోట‌మ్ల న‌గ‌దు క‌ట్ట‌ల రూపంలో బ‌య‌ట‌ప‌డిందని తెలుస్తోంది.  హెటిరో సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో దీనిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. రాజకీయ నేతలకు సంబంధాలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. రూ. 147 కోట్లు కాదని ఇంకా వేల కోట్లలో దాచారన్నారు. ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనన్నారు. సీఎం జగన్ మల్లె పూలు కూడా అమ్ముకుంటారని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.  విశాఖలో వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు  తాకట్టు పెట్టారని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఏ ప్రజలు అయితే అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారో.. అదే ప్రజలు కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. జైల్లో చిప్ప కూడు తిన్నవారికి పాలనపై అవగాహన ఏం ఉంటుందన్నారు. ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు మద్యం చాటున ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సీఎం యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.

కారుకు రోడ్ రోలర్ బ్రేకేసేనా? కమలానికి కాలి ఫ్లవర్ కష్టాలేనా? హుజురాబాద్ ఎవరిది? 

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికలో కంప్లీట్ పిక్చర్ వచ్చేసింది. ఉపపోరులో 30 మంది నిలిచారు . ఇందులో ముగ్గరు ప్రధాన పార్టీల అభ్యర్థులు కాగా.. ఏడుగురు రిజిస్టర్ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. మరో 20 మంది ఇండిపెండెంట్లు. హుజురాబాద్ లో మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా .. స్క్రుటినీ అనంతరం 42 మందికి చెందిన 69 నామినేషన్లు ఆమోదం పొందాయి. బుధవారం 12 మంది నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 30 మంది మిగిలారు.  ఉపఎన్నికలో రెబెల్స్  గొడవ లేకుండా ప్రధాన పార్టీలు చర్యలు తీసుకున్నాయి. కొందరు నామినేషన్లు వేసినా బుజ్జగింపులతో వాళ్లను బరి నుంచి తప్పించాయి. అయితే అసమ్మతి లేకుండా చూసుకున్న అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఆ రెండు పార్టీలను కొన్ని సింబల్స్ భయపెడుతున్నాయి. కారు, కమలం పువ్వు గుర్తులను పోలిన సింబల్స్ కొందరు ఇండిపెండెంట్లకు రావడమే వీళ్ల టెన్షన్ కు కారణం. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ట్రక్కు, ఆటో గుర్తులకు కారుకు నష్టం కల్గించినట్లు టీఆర్ఎస్ గుర్తించింది. ఈ సింబల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తమ పార్టీ గుర్తు అయిన కారు మరింత స్పష్టంగా కనిపించేలా కొన్ని మార్పులు చేయాలని కూడా ఆ ఫిర్యాదులో విన్నవించింది . టీఆర్ఎస్ వినతితో తెలంగాణలో ట్రక్కు, ఆటో గుర్తులను ఈసీ కేటాయించడం లేదు. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తు కారుకు షాకిచ్చింది. ఆ ఎన్నికలో టీఆర్ఎస్ కంటే బీజేపీకి వెయ్యి ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థికి దాదాపు 4 వేల ఓట్లు వచ్చాయి. అవన్ని కారుకు పడాల్సిన ఓట్లని.. రోడ్డు రోలర్ ను కారు అనుకుని కొందరు ఓటర్లు వేశారని గులాబీ నేతలు చెప్పారు. అందుకే హుజురాబాద్ లో కారును పోలిన గుర్తులు ఎవరికి ఇవ్వవద్దని ఈసీని కోరింది. కాని హుజురాబాద్ లో ఇండిపెండెంట్లకు రోడ్ రోలర్ , చపాతి రోలర్ గర్తులు వచ్చాయి. ఇదే ఇప్పుడు అధికార టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతోంది. హుజురాబాద్ లో కమలనాధులను సైతం సింబల్ పంచాయతీ వెంటాడుతోంది. ఒక ఇండిపెండెంట్ కు పెన్నుపాళి ( పెన్ విత్ సెవెన్ రేస్ )  గుర్తు, మరో అభ్యర్థికి  కాలీఫ్లవర్ సింబల్ వచ్చింది. దూరం నుంచి వీటని చూసినప్పుడు , కంటి సమస్యలు ఉన్నవారు కమలం పువ్వు అని భ్రమపడే ప్రమాదం లేకపోలేదని బీజేపీ నేతలు భయపడుతున్నారు. ఈ గుర్తులు ఎక్కడ తమ ఓట్లకు గండికొడ తాయో అన్న ఆందోళన కమలనాథుల్లోనూ నెలకొంది. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి రవీందర్.. ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న గుర్తులనే కేటాయించామని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని క్లారిటీ ఇచ్చారు.  హుజురాబాద్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వచ్చిన గుర్తులు.. 1. ఈటల రాజేందర్, బిజెపి కమలం, గుర్తు 2. గెల్లు శ్రీనివాసయాదవ్ టిఆర్ఎస్ కార్ గుర్తు  3. బల్మూరి వెంకట నర్సింగ్ రావు కాంగ్రెస్, చేయి గుర్తు  4. అలీ మన్సూర్ మహ్మద్ అన్న వైయస్సార్పార్టీ , బ్యాట్స్ మెన్ గుర్తు 5. కన్నం సురేష్ కుమార్, జై స్వరాజ్,పార్టీ.పెన్ విత్ నిబు గుర్తు  6. కర్ర రాజిరెడ్డి ఎంసీఐ (యు ),పార్టీ.కంప్యూటర్ గుర్తు 7. కేశెట్టి విజయకుమార్, యువతరం పార్టీ, glass tumbler గుర్తు 8. దేవునూరి శ్రీనివాస్, దళిత బహుజన పార్టీ, కప్పు సాసర్ గుర్తు 9. లింగిడి వెంకటేశ్వర్లు, ప్రజావాణి పార్టీ, రోడ్ రోలర్గుర్తు  10. సిలివేరు శ్రీకాంత్, ప్రజా వక్త పార్టీ, చపాతీ రోల్ గుర్తు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు 11. ఉప్పు రవీందర్ హెలికాప్టర్ గుర్తు 12. ఉరుమల్ల విశ్వం, అగ్గిపెట్టె గుర్తు 13. ఎడ్ల జోగిరెడ్డి, కాలిఫ్లవర్ గుర్తు 14. కుమ్మరి ప్రవీణ్, గ్యాస్ సిలిండర్ గుర్తు  15. కోట శ్యామ్కుమార్, బ్యాట్ గుర్తు 16. కంటే సాయన్న, డైమండ్ గుర్తు 17. గుగులోతు తిరుపతి, గౌను గుర్తు 18. గంజి యుగంధర్, కుండ గుర్తు 19. చెలిక చంద్రశేఖర్, విజిల్ గుర్తు 20. చిలుక ఆనంద్, బీరువా గుర్తు 21. పల్లె ప్రశాంత్, కెమెరా గురు. 22. పిడిశెట్టి రాజు, కత్తెర గుర్తు 23. బుట్టింగారి మాధవరెడ్డి, రింగు గుర్తు 24. మేకమల్ల రత్నయ్య, కుట్టు మిషన్ గుర్తు 25. మౌటం సంపత్, సోప్ డిష్ గుర్తు 26. శనిగరపు రమేష్ బాబు, టీవీ గుర్తు 27. రావుల సునీల్, హార్మోనియం గుర్తు 28. లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాగలి గుర్తు 29. వేముల విక్రమ్ రెడ్డి, గాజుల గుర్తు 30. సీ.వీ సుబ్బారెడ్డి, ఏసీ గుర్తు గుర్తు

రేవంత్ రెడ్డికి హైకమాండ్ చివాట్లు ? ఆయనపై కంప్లైంట్ చేసిందెవరు? 

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతున్నారు. అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నారు. దళిత గిరిజన దండోరా సభలు.. తాజాగా చేపట్టిన నిరుద్యోగ గర్జనలతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి జెట్ స్పీడులో  వెళుతుంటే.. అదే సమయంలో ఆయనకు బ్రేకులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రేవంత్ కు పీసీసీ పగ్గాలు ప్రకటించినప్పుడే కొందరు సీనియర్లు ఓపెన్ గానే అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత రేవంత్ పై ఏకంగా హైకమాండ్ కే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. సీనియర్ ఫిర్యాదుతో హైకమాండ్ రేవంత్ రెడ్డికి క్లాస్ పీకారని అంటున్నారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల  ఢిల్లీ వెళ్లారు. అయితే హైకమాండ్ పిలుపుతోనే ఆయన హస్తిన వెళ్లారని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు రాష్ట్రంలోని పరిస్థితులపై వివరణ ఇచ్చారట రేవంత్. అదే  సమయంలో అధిష్టానం పెద్దలు ఓ విషయంపై ఆయనను వివరణ కోరినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో రేవంత్ ప్రజా దర్బార్ పేరుతో ఆయన అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ సైన్యం పేరుతో మరో గ్రూప్ కూడా యాక్టివ్ గా ఉంది. దీనికి అనుబంధంగా నియోజకవర్గాల వారీగా కొందరు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. దీనిపై టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా స్పందించారట. రేవంత్ ప్రజా దర్బార్‌ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్‌ విషయాన్ని ఆయన ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట.  టీపీసీసీ చీఫ్ అయిన తరువాత కూడా ఇలాంటి ప్రచారం ఎందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు కూడా సీరియస్‌గానే తీసుకుని.. ఇలా ఎందుకు జరుగుతోందని రేవంత్ రెడ్డి వివరణ కోరినట్టు తెలుస్తోంది. ప్రజా దర్బార్ విషయంపై ఢిల్లీ పెద్దలు ప్రశ్నించడంతో షాకయ్యారట రేవంత్ రెడ్డి.  ఈ విషయం అధిష్టానం వరకు ఎలా వెళ్లిందని ఆరా తీసిన రేవంత్ రెడ్డి.. దీని వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని తెలుసుకున్నారట. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఉత్తమ్‌ను కలిసి దీనిపై వివరణ ఇచ్చారనే చర్చ కూడా సాగుతోంది.  రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి ఆయనతో కొందరు సీనియర్ నేతలకు గ్యాప్ వచ్చింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేరుగానే  రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా.. ఉత్తమ్ మాత్రం పార్టీ వేదికల మీదే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఇబ్బందిపెట్టేలా ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసి ఉంటారని రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్‌లో దూసుకుపోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి అనుకోని అనుభవాలు ఎదురవుతున్నాయనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అనుచరులు మాత్రం ఎవరూ ఏం చేసినా తమ నేతకు నష్టం జరగదని చెబుతున్నారు. రోజురోజుకు రేవంత్ గ్రాఫ్ పెరిగిపోతుందని, ఆయన సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నారు. 

'మెగా'కు కౌంట‌ర్‌గా 'లెజెండ్‌'.. 'మా'లో ద‌బిడి దిబిడే...

ప్ర‌కాశ్‌రాజ్‌కు మెగా స‌పోర్ట్ ఉంది. ఆయ‌న సింగిల్‌గా ఉండుంటే.. ఇంత సీన్ క్రియేట్ అయ్యేదే కాదు. మా ఎన్నిక‌లు ఇంత ప్రెస్టీజియ‌స్‌గా సాగేవే కాదు. క‌సురుకోవ‌డాలు.. కొరుక్కోవ‌డాలు.. తిట్టుకోవ‌డాలు.. బెదిరించుకోవ‌డాలు.. రాజీనామాలు.. ఇలా ర‌చ్చ రంభోలా జ‌రిగేదే కాదు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌డ‌మే.. ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు వ‌చ్చాకా స‌మ‌ర‌మే.. త‌గ్గేదే లే అంటూ ఇరు ప‌క్షాలు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. రాత్రి గెలిచాం.. ఉద‌యానికి ఓడిపోయాం... ఎలా ఓడిపోయామో దుర్గ‌మ్మ‌కే తెలియాలంటూ.. 'మా' వేడిని అలా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక మూకుమ్మ‌డి రాజీనామాల‌తో మంచు విష్ణుకు ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. విష్ణు ఏం చేస్తారో చూడాల‌ని వెయిట్ చేస్తోంది.  అబ్బా.. ఇంత ప‌ని చేస్తారా.. అంటూ మంచు సైతం ఏమాత్రం త‌గ్గ‌ట్లేదు. ఒక రోజు టైమ్ తీసుకొని.. ఖ‌త‌ర్నాక్ స్టెప్ వేశారు. మెగాకు కౌంట‌ర్‌గా.. మోహ‌న్‌బాబు, విష్ణులు క‌లిసి.. టాలీవుడ్ లెజెండ్ బాల‌య్యను ఆశ్ర‌యించారు. తండ్రిత‌న‌యులు ఇద్ద‌రూ నంద‌మూరి ఇంటికెళ్లి క‌లిశారు. మ‌రోసారి నంద‌మూరి మ‌ద్ద‌తు తీసుకున్నారు. బాల‌య్య సైతం మంచు విష్ణుకు నేనున్నానంటూ అభ‌య‌మిచ్చారు.  మెగా కాక‌పోతే నంద‌మూరి. అంతే కానీ.. ఇందాకా వ‌చ్చాక ఇక‌ ఏమాత్రం వెన‌క‌డుగు వేసేది లేద‌ని మంచు ఫ్యామిలీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేసింది. త‌మ‌ను ఎంత ఇబ్బంది పెడదామ‌ని చూసినా.. ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామా చేసినా.. డోంట్‌కేర్ అన్న‌ట్టు ముందుకు సాగుతున్నారు. ఇండ‌స్ట్రీ అంటే వాళ్లేనా.. ఇంకా చాలా మంది పెద్ద‌లు ఉన్నార‌న్న‌ట్టు.. కోటా, కైకాల‌, ప‌రుచూరి.. త‌దిత‌రుల‌ను ఇప్ప‌టికే క‌లిసి మ‌ద్ద‌తు కోరారు. ప‌నిలో ప‌నిగా త్వ‌ర‌లోనే చిరంజీవినీ క‌లుస్తానంటున్న మంచు విష్ణు.. ఆయ‌న‌కు లాస్ట్ ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్టు చెప్ప‌క‌నే చెప్పారు.  ఇలా బాల‌య్య‌ను క‌లిసి.. ఆయ‌న్ను రంగంలోకి దింపి.. మంచు విష్ణు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారని అంటున్నారు. ఇటు మెగా డైరెక్ష‌న్‌లో ప్ర‌కాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాల‌తో 'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వ‌గా.. సింహంలాంటి బాల‌య్య బాబుతో మ‌రింత అదిరేలా రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చారు మంచు విష్ణు. ఇలా ఎత్తుల‌కు పైఎత్తుల‌తో 'మా' రాజ‌కీయం రంజుగా సాగుతోంది. వ‌న్స్ బాల‌య్య స్టెప్ ఇన్‌.. ఇక 'మా'లో ద‌బిడి దిబిడే...  

మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు.. అసలేం జరిగిందంటే? 

వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి ఎరుక.. ఈ సామెతను పెద్దలు ఎక్కువగా వాడుతుంటారు. ఎవరైనా ఆకస్మాత్తుగా చనిపోతే.. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరని చెప్పడానికి ఈ సామెత ఉపయోగిస్తుంటారు. మన అదృష్టం బాగా లేకుంటే.. అరటి పన్ను తిన్నా పన్ను ఊడిపోతుందని అంటారు.  ఒక్క క్షణంలో జీవితం తలకిందులై పోతుంది. అప్పటిదాకా బాగున్న వారు  కూడా హఠాత్తుగా చనిపోతుంటారు. టీ తాగుతూ చనిపోయిన ఘటనలు జరిగాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. కోడి గుడ్డు  తిని ఓ మహిళ కన్నుమూసింది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం.  తిమ్మాజి పేట మండలం నేరళ్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ అనే 50 ఏండ్ల మహిళ బుధవారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేశారు.  భోజనంతో పాటు ఉడకబెట్టిన కోడి గుడ్డు కూడా తీసుకున్నారు. గుడ్డును ముక్కలుగా కోయకుండా.. మొత్తం నోట్లోకి వేసుకున్నారు. తర్వాత గుడ్డును నమిలేందుకు ప్రయత్నించగా.. అది ఒక్కసారిగా గొంతులోకి జారిపోయింది. గుడ్డు గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక నీలమ్మ విలవిల్లాడిపోయారు. శ్వాస ఆగిపోయి అక్కడిక్కడే కుప్పకూలారు.  కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గుడ్డుని గొంతులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శ్వాస అందక నీలమ్మ కన్నుమూశారు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా తమ ముందే ఉన్న మనిషి.. క్షణాల్లోనే మరణించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నీలమ్మ మృతిని తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

వైసీపీకి ప్రచారం చేసినందుకు మోహన్ బాబు పశ్చాతాపం!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిసినా హీట్ కొనసాగుతూనే ఉంది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేసి సంచలనానికి తెర తీశారు. ఇక ఈనెల 16న మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారని భావించిన మంచు విష్ణు.. సడెన్ గా సాదాసీదాగా 13వ తేదీ బుధవారమే బాధ్యతలు చేపట్టారు. తర్వాత కూడా కీలక పరిణమాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చినందుకు నందమూరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. నందమూరి బాలకృష్ణను అతని నివాసంలో కలిసిన సందర్భంగా హీరో మోహన్ బాబు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నిక‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ అల్లుడు లోకేశ్‌కు వ్య‌తిరేకంగా తాను మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారం చేశానని, అయినప్ప‌టికీ త‌న కుమారుడు విష్ణుకి బాల‌య్య 'మా' ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తుగా నిలిచార‌ని  మోహ‌న్ బాబు అన్నారు. బాలకృష్ణ గొప్ప సంస్కారం ఉన్న వ్య‌క్తి అని చెప్పారు. మా భ‌వ‌నం విష‌యంలో విష్ణుకు తోడు ఉంటాన‌ని చెప్పారని అన్నారు. ఎన్టీఆరే త‌న‌ను బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద‌కు పంపించిన‌ట్లు ఉందని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో బాల‌య్య అల్లుడి ఓటమికి ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ.. అదేమీ ఆయ‌న మ‌న‌సులో పెట్టుకోలేద‌ని మోహన్ బాబు చెప్పారు. విష్ణు బాబుకి తోడుగా ఉంటాన‌ని బాల‌కృష్ణ ఇప్ప‌టికే చెప్పారని తెలిపారు. 'బాల‌కృష్ణ‌కు నేను ఇటీవ‌ల ఫోను చేశాను.. మీరు ఎందుకు ఫోను చేశారు? అని అడిగారు. విష్ణు బాబుకే ఓటు వేస్తాన‌ని అన్నారు. అయినా, మీరు చెబితేనే నేను ఓటు వేస్తానా? అని వ్యాఖ్యానించారు' అని మోహ‌న్ బాబు చెప్పారు. బాల‌కృష్ణ ఆశీర్వాదం తీసుకోవ‌డానికి వచ్చాన‌ని అన్నారు మంచు విష్ణు.'మా' ఎన్నిక‌ల్లో మొద‌టి నుంచి బాలకృష్ణ తనకు స‌హ‌క‌రించారని తెలిపారు. ఇప్ప‌టికే తాను కోట శ్రీ‌నివాస‌రావు, కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, కృష్ణంరాజు, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటి వారిని  క‌లిశానని చెప్పాడు. ఇప్పుడు బాల‌య్య‌ను క‌లిశాన‌ని వివ‌రించారు. పెద్ద‌లందర్నీ క‌లుస్తానని, అంద‌రినీ క‌లుపుకుని ముందుకు వెళ్తానన్నారు మంచు విష్ణు. 

కారును పోలిన సింబల్స్.. కేసీఆర్ కు హుజురాబాద్ టెన్షన్

హుజురాబాద్ ఉప ఎన్నికను పోటీలో ఉన్న ప్రధాన పార్టీలతో పాటుగా, పోటీలో లేని పార్టీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రజా సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే   రాజకీయాలతో ప్రత్యక్ష పరోక్ష సంబందాలున్న ప్రతిఒక్కరిలో, హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికను అత్యంత  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎప్పుడూ, ఎక్కడ  లేని విధంగా, ఒక్క ఉపఎన్నికకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వందల కోట్లు ఖర్చు  పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. ‘ఫ్యామిలీకి పది లక్షలు ... ఇంటికి పదివేలు’ ఇలా డబ్బును వెదజల్లుతున్నారని, అంటున్నారు. ఇక మద్యం విషయం అయితే, చెప్పనే అక్కర లేదు, హుజూరాబాద్ ..పేరు హుజూరా ‘బార్’ గా మారిపోయిందని అంటున్నారు.   ఇంత చేసినా  ఎందుకనో  అధికార పార్టీలో ఇంకా గెలుస్తామనే విశ్వాసం కలుగుతున్నట్లు లేదు .. అందుకే కావచ్చును లేదంట చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే విజ్ఞతతో కావచ్చును, నామినేషన్ల ఘట్ట్టం ముగిసి, ఉపఎన్నిక పోలింగ్ పక్ష రోజుల్లోకి వచ్చినా, అధికార పార్టీ ఇప్పటికే వేట కొనసాగిస్తూనే ఉంది.ఇతర పార్టీల చిన్నా చితక  నాయకుకులతో బేర సారాలు సాగిస్తూనే ఉందని అంటున్నారు.  ముఖ్యంగా తెరాస ప్రధాన ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ అనుచరులను ఖరీదు కట్టి తమవైపుకు తిప్పేసుకుంటున్నారు. అందుకే, నిన్నటి దాకా ఈటల వెంట ఉండి ఆయనకు జై ..కొట్టిన నాయకులు, మంత్రి హరీష్ రావు వెంట తెరాస ప్రచారంలో పాల్గొంటూ కూడా.. ఈటలకు జై కొడుతున్నారు.  ఇంత చేసినా ఎంతగా దిగాజరినా, ఫలితం లేక పోవడం ఒకెత్తు అయితే, ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కొత్త సమస్యలు,తెరాస నాయకత్వం ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇదే క్రమమలో ఇప్పుడు ‘కారు’ పార్టీని ఆ గుర్తే కంగారుకు గురిచేస్తోంది. ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం ఎంపిక  చేసిన ఉచిత  చిహ్నాల (సింబల్స్) లో  కారు గుర్తును పోలిన చిహ్నాలుఉండటంతో గులాబీ నేతల గుడెల్లో ఆ గుర్తులు  పరుగులు తీస్తున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ముగిసిన తర్వాత 30 అభ్యర్ధులు బరిలో మిగిలారు, ఇదులో గుర్తులున్న పార్టీల అభుర్ధులు పది మంది ఉన్నారని అనుకున్నా, 20 మంది స్వతంత్ర అభ్యర్ధులున్నారు. స్వతంత్రులు లేదా గుర్తింపు పొందని పార్టీల తరపున పోటీ చేస్తున్న ఈ 20 మంది అభ్యర్థుల్లో చాలా మంది అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కారును పోలిన గుర్తులే కావాలని ఈసీని అభ్యర్థించారు. దీంతో కారు పార్టీకి గతం గుర్తుకు వస్తోంది.  గతంలో ట్రక్కు, రోడ్డు రోలర్, ట్రాక్టర్, ఆటో రిక్షా, , బస్సు, లారీ వంటివి టీఆర్ఎస్‌ను భారీ దెబ్బ కొట్టాయి. వాటి కారణంగా కొన్ని స్థానాల్లో మెజార్టీ పడిపోగా.. మరికొన్ని స్థానాల్లో ఏకంగా టీఆర్ఎస్ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం గతంలోనే ఉచిత చిహ్నాల జాబితా నుంచి ఆటో రిక్షా, ట్రక్, వంటి కొన్ని గుర్తులు  తొలగించింది. అయినప్పటికీ మరికొన్ని గుర్తులు కారును పోలినవి అందుబాటులోనే ఉన్నాయి. దుబ్బాక ఉపఎన్నికలో ఇలాంటి గుర్తుల కారణంగా టీఆర్ఎస్ పరాభవం చూసింది. దుబ్బాకలో టీఆర్ఎస్ పై బీజేపీకి వచ్చిన మెజార్టీ కంటే.. కారును పోలిన సింబల్ వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా కారు గుర్తులను పోలిన వాటిని ఎన్నికల సంఘం ఆమోదించడంతో దుబ్బాక రిపీట్ అవుతుందని అధికార పార్టీ ఆందోళన చెందుతోందని, సమాచారం.

బాత్‌రూంలో రే*ప్‌.. చేసింది ఎవ‌రంటే..?

అన‌గ‌న‌గా ఓ ఇల్లు. య‌జ‌మానితో పాటు మ‌రికొంద‌రు ఆ ఇంట్లో అద్దెకు ఉంటారు. ఓ గ‌దిలో ఇద్ద‌రు కుర్రాళ్లు రెంట్‌కు ఉన్నారు. కొన్నాళ్లూ మంచిగానే ఉన్నారు. మంచోళ్లే క‌దా అనుకున్నారు. కానీ, వాళ్లు మ‌నుషులు కాదు మాన‌వ మృగాల‌ని ఆ త‌ర్వాత తెలిసింది. అద్దెకున్న వాళ్లు రేపిస్టులుగా మారారు. య‌జ‌మాని కుటుంబంలో క‌ల్లోలం రేపారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.... ఢిల్లీలో ఓ యువతిని బాత్‌రూంలో బంధించి ఇద్దరు యువకులు అత్యా-చారానికి తెగ‌బ‌డ్డారు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా.. వెన‌క‌నుండి వ‌చ్చి.. బాత్‌రూంలో బ‌ల‌వంతంగా అఘాయిత్యానికి పాల్ప‌డటం క‌ల‌క‌లం రేపింది. సొంత ఇంట్లోనే ర‌క్ష‌ణ లేక‌పోవ‌డంపై స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. ఎవ‌రినీ న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని వాపోతున్నారు.  ఇంటి య‌జ‌మాని కూతురిని రే*ప్ చేసిన నిందితులిద్దరూ ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఘటన అనంతరం యువతిని వారిద్దరూ బెదిరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. వెంట‌నే అక్కడి నుంచి పరారయ్యారు.  జ‌రిగిన దారుణాన్ని బాధితురాలు ఇంట్లో వారికి చెప్పింది. కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్ద‌రిలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

ట‌మోటా కొనేట‌ట్టు లేదు.. ఉల్లి తినేట‌ట్టు లేదు.. ఏందిరో ఈ రేట్లు!

ఏ కూర వండాల‌న్నా ఉల్లి మ‌స్ట్‌. ఏ కూర లేక‌పోతే.. ట‌మోటా కూర ది బెస్ట్‌. క‌ర్రీ క్వాంటిటీ పెర‌గాల‌న్నా.. ఏ కూర‌కు టేస్ట్ రావాల‌న్నా.. నాలుగు ట‌మోటాలు ప‌డేస్తే సూప‌ర్‌. అందుకే, కూర‌గాయ‌లందు ట‌మోటా ప్ర‌త్యేక‌తే వేరు. ఇక ఉల్లి గురించి చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. అందుకే ట‌మోటా, ఉల్లిలు అంద‌రికీ అత్య‌వ‌స‌రం. అలాంటి ట‌మోటా ఇప్పుడు ధ‌ర‌లో మోత మోయిస్తోంది. 20 రూపాయ‌లు పెడితే కిలో ట‌మోటా ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు 60-70 చెబుతున్నారు. బేర‌మాడే ప‌రిస్థితి లేదు. ఇష్ట‌ముంటే తీసుకో లేదంటే లేదంటూ క‌సురుతున్నారు. ఇక, ఇంకో ట‌మోటా కొస‌ర‌డిగితే కొట్టేసేలా ఉన్నారు. ఒక‌ప్పుడు ఉల్లికి ఈ త‌ర‌హా డిమాండ్ ఉండేది.. ఇప్పుడు ఉల్లితో పాటు ట‌మోటా కూడా కాస్ట్లీ వెజిట‌బుల్... మ‌న ద‌గ్గ‌ర‌నే కాదు.. దేశ‌వ్యాప్తంగా ట‌మోటా రేట్ తారాజువ్వ‌లా ఎగిసింది. ఢిల్లీలో కిలో 72 రూపాయలు. కోల్‌క‌తాలో కూడా అంతే. చెన్నై, ముంబైలో 60కి అటూఇటూ అమ్ముతున్నారు. ఇక తెలుగురాష్ట్రాల్లోనూ సుమారు రూ.60 వ‌సూలు చేస్తున్నారు. ఉల్లి ధ‌ర కూడా ట‌మోటా రేటు చుట్టూనే తిరుగుతోంది. కిలో ఉల్లి రూ.60 ప‌లుకుతోంది.  ట‌మోటా ఎక్క‌డ పండినా.. వాటిని స్థానిక మార్కెట్ల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ర‌వాణా చేస్తుంటారు. డిమాండ్‌ను బ‌ట్టి.. ఎక్క‌డ రేట్ ఎక్కువ ఉంటే.. అక్క‌డికి త‌ర‌లించి అమ్ముతుంటారు. కానీ, ప్ర‌స్తుతం దేశంలో ఏ పెద్ద న‌గ‌రంలో చూసుకున్నా.. ట‌మోటా రేటు ఒకేలా ఉంది. మెట్రో సిటీస్‌లో 70 దాటేసింది. ఇంకా మ‌న‌ద‌గ్గ‌రే కాస్త బెట‌ర్‌. 60కి ద‌గ్గ‌ర‌గా అమ్ముతున్నారు. పండుగ స‌మ‌యంలో ట‌మోటా రేట్లు పెర‌గ‌డంతో ఖ‌ర్చు మ‌రింత పెరుగుతోంది. పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ట‌మోటా క‌ర్రీని త‌గ్గించుకుంటున్నారు.  ఇంత‌కీ ట‌మోటాల‌కు ఇంత‌లా ధ‌ర ఎందుకు పెరిగిందో తెలుసా? ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ట‌మోటా పంటంతా నాశ‌న‌మైంది. దేశ‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కుర‌వ‌డంతో.. అన్నిచోట్ల పంట న‌ష్టం జ‌రిగింది. వాన‌లో, వ‌ర‌ద‌లో, బుర‌ద‌లో టమోటా మొక్క‌లు పాడ‌య్యాయి. సో.. ఉత్త‌త్తి లేక‌.. ధ‌ర సెంచ‌రీ దిశ‌గా దూసుకుపోతోంది. 

తెలంగాణలో వెలుగులు.. ఏపీలో చీకట్లు.. మిగులు రాష్ట్రంలో ఎందుకీ దుస్థితి? జగనన్న చీకటి పథకమా? 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడేండ్లు దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. విభజన తర్వాత ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలవగా.. తెలంగాణలో విద్యుతో కొరత తీవ్రంగా ఉండేది. అసలు విభజన సమయంలో ఈ వాదన వచ్చింది. తెలంగాణ విడిపోతే.. అక్కడ కరెంట్ సంక్షోభం వస్తుందనే భయాలు వ్యక్తమయ్యాయి. అప్పటి తెలంగాణ విద్యుత్ లెక్కలు అలానే ఉండేవి. కాని తర్వాత క్రమంగా సీన్ మారింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. చాలా రాష్ట్రాల్లో కరెంట్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. విద్యుత్ కొరతతో కోతలు విధిస్తున్నారు. రెండు , మూడు రోజుల్లో ఏపీలో చీకట్లు అలుముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాని గతంలో విద్యుత్ కొరత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వెలుగులు ఆరడం లేదు.  దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం ఏపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దసరా ఉత్సవాలు .. పండగ సెలవులు..  మహానది కోల్‌ ఫీల్డ్స్‌లో తవ్వకాలు నిలిచిపోవడం మొదలైన కారణాలతో విద్యుత్కేంద్రాలకు బొగ్గు అందడం కష్టసాధ్యంగా మారింది. ఏపీలో బుధవారానికి  ఉన్న నిల్వలు 65 వేల టన్నులే. కోల్‌ మైన్స్‌ నుంచి రోజువారీ సరఫరా 8-12 వేల టన్నులకు మించడం లేదు. దీంతో రన్‌ అవుతున్న మూడు యూనిట్లలో ఒకదాన్ని మంగళవారం షట్‌డౌన్‌ చేశారు. విజయవాడ ఎన్‌టీటీపీఎస్ లో 5,010 మెగావాట్లకు గాను 2,224 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. జల విద్యుత్‌ 1,728 మెగావాట్లకు గాను 1,122 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. మంగళవారం 196 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంది. ఉదయం పూట ఎలాగోలా సర్దుబాటు చేస్తున్నా.. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకూ అధిక వినియోగం కారణంగా డిమాండ్‌ను తట్టుకోవడం ట్రాన్స్‌కోకు కష్టమవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. దేశచరిత్రలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్‌ అమ్మకపు ధరలు మండిపోతున్నాయి. ‘భారత ఇంధన ఎక్స్ఛేంజ్‌’(ఐఈఎక్స్‌)లో యూనిట్‌ ధర రూ.6.50 నుంచి 20 వరకూ పలుకుతోంది. గతంలో కొన్నిసార్లు రూ.18కి చేరితేనే డిస్కంలు అల్లాడాయి. ప్రస్తుత సంక్షోభంతో బొగ్గు కొరత ఉన్న రాష్ట్రాల డిస్కంలు ఎంతకైనా కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఇతర రాష్ట్రాలు గరిష్ఠంగా రూ.20కి యూనిట్‌ చొప్పున కొంటుండగా.. తెలంగాణలో మిగులు విద్యుత్‌ ఉండటంతో రోజుకు 2 మిలియన్‌ యూనిట్ల దాకా ఐఈఎక్స్‌లో రాష్ట్రం విక్రయిస్తోంది. బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి సరఫరాలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుకు పోటీ పడుతుండటంతో ధర పెరుగుతోంది.      విద్యుత్‌ అమ్మే సంస్థలు, రాష్ట్రాలు ఇష్టారీతిన ధర పెంచవద్దని కేంద్రం హెచ్చరికలు జారీ చేసినా.. రూ.20 నుంచితగ్గడం లేదు. ఇంత ధర పెట్టి కొనలేక కొన్ని రాష్ట్రాలు కరెంట్‌ కోతలు విధిస్తున్నాయి.    తెలంగాణలో మిగులు ఎందుకంటే..    ఒక రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ ఎంత ఉంటుందో పరిశీలించి దానికన్నా కొంత అదనంగా అందుబాటులో ఉంచుకోవడానికి విద్యుత్కేంద్రాలతో పంపిణీ సంస్థలు  కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకుంటాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒకరోజు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ 2021 మార్చి 26న 13,608 మెగావాట్లుగా నమోదైంది. ‘డిమాండ్‌’ అంటే ఒక రోజులో ఏదో ఒక సమయంలో అత్యంత ఎక్కువ వినియోగం. అది కాసేపు లేదా ఆ రోజంతా ఉండవచ్చు. దీంతో ప్రజలకు నిరంతర సరఫరా కోసం 16,613 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు పలు సంస్థలతో తెలంగాణ డిస్కంలు గతంలో పీపీఏలు చేసుకున్నాయి. రాష్ట్ర డిమాండ్‌ ఏడాదిలో చాలా రోజులు 10 వేల మెగావాట్ల వరకూ ఉండటంతో విద్యుత్‌ మిగులుతోంది. బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండు 8 వేల మెగావాట్లుంది. మిగులుగా ఉన్న సుమారు 2 మిలియన్‌ యూనిట్లను ఐఈఎక్స్‌లో సగటున రూ.10 వరకూ అమ్ముతున్నట్లు రాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి.    గతంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణలో పరిస్థితి ఇలా ఉండగా.. గతంలో మిగులు రాష్ట్రంగా ఉన్న ఏపీలో మాత్రం అంతా తలకిందులైంది. విద్యుత్‌ కొరత కారణంగా ఎక్స్ఛేంజ్‌లో కొంటోంది. బుధవారం సాయంత్రం 6.45 నుంచి 7 గంటల మధ్య ఏపీ రాష్ట్ర గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 7,280 మెగావాట్లుండగా 8 లక్షల యూనిట్ల కొరత ఉంది. దీంతో ఐఈఎక్స్‌లో  2102 మెగావాట్లను కొన్నట్లు కేంద్ర విద్యుత్‌శాఖ వెల్లడించింది. ఒకవేళ విద్యుత్‌ కొనకపోతే కోతలు విధించాల్సి ఉంటుందని కేంద్ర అధికారులు వివరించారు.  ఇందుకు కారణం పాలకుల విధానాలే అని తెలుస్తోంది. జగన్ రెడ్డి పాలనలో గత రెండున్నర ఏండ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు ఏపీకి గుది బండగా మారాయంటున్నారు. తెలంగాణ తరహాలోనే చంద్రబాబు ప్రభుత్వం కూడా విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా గతంలో పీపీఏలు కుదుర్చుకుంది. కాని జగన్ రెడ్డి పాలన వచ్చాకా వాటిని రద్దు చేసే ప్రయత్నాలు చేసింది. దీంతో ప్రస్తుతం ఏపీకి విద్యుత్ కష్టాలు వచ్చాయని అంటున్నారు.   

హైదరాబాదీలకు గుడ్ న్సూస్..  గణేష్ నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ లో కాలుష్యం తగ్గింది..

హైదరాబాదీలకు ఇది నిజంగా గుడ్ న్యూసే. హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ కాలుష్యం కాసారంగా మారింది. పాలకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సాగర్ మాత్రం క్లీన్ కావడం లేదు. ఇక ప్రతి ఏటా జరిగే గణేష్ నిమజ్జనోత్సవం తర్వాత హుస్సేన్ సాగర్ లో కాలుష్యం మోతాదు మరింత పెరుగుతుంది. అందుకే గణేష్ విగ్రహాలను సాగర్ లో నిమజ్జనం చేయవద్దంటూ పర్యావరణ ప్రేమికులు న్యాయ పోరాటం చేస్తుంటారు. కాని పూర్తి స్థాయిలో మాత్రం సాధ్యం కావడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం హుస్సేన్ సాగర్ కు సంబంధించి గుడ్ న్యూస్ హైదరాబాదీలకు వచ్చింది. హుసేన్‌సాగ‌ర్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం త‌ర్వాత కాలుష్యం పెరుగుతుంద‌నుకుంటే భారీగా త‌గ్గింది. గ‌ణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం వ‌ల్ల హుసేన్‌సాగ‌ర్‌లో కాలుష్యం పెరుగుతుంద‌ని ఇటీవ‌ల ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన వేళ  కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక శుభ‌వార్త తెలిపింది. ప్ర‌తి ఏడాది గణేశ్ విగ్ర‌హాల‌ నిమజ్జనం త‌ర్వాత హుసేన్‌సాగ‌ర్‌లో కాలుష్య స్థాయిని ప‌రిశీలిస్తారు. గ‌త ఏడాది కంటే హుసేన్‌సాగర్‌లో ఈ సారి కాలుష్యం భారీగా త‌గ్గింద‌ని పీసీబీ స్ప‌ష్టం చేసింది.  గ‌ణేశ్ విగ్ర‌హాల‌ నిమజ్జనానికి ముందు, విగ్ర‌హాల‌ నిమజ్జనాలు జరిగిన రోజులతో పాటు ఆ త‌ర్వాత హుసేన్‌సాగ‌ర్ నీటి నాణ్యతను పరిశీలించారు.ట్యాంక్‌ బండ్, నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్, లేపాక్షి ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించారు. గ‌ణేశ్ విగ్ర‌హాల‌ నిమజ్జనం సమయంలో ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం తగ్గుముఖం పట్టిందని పీసీబీ తెలిపింది. ఇందుకు గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం త‌ర్వాత కురిసిన భారీ వ‌ర్షాలే కార‌ణమని చెబుతున్నారు, అయితే, కరిగిన ఘనపదార్థాల  మోతాదు పెరిగిందని పీసీబీ నివేదికలో వెల్లడైంది. బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్ తో పాటు కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌, భార లోహాల మోతాదు పెరిగాయి. గ‌ణేశ్ విగ్ర‌హాల నిమజ్జనం త‌ర్వాత‌ భారీగా వర్షాలు కురవడంతో హుసేన్‌సాగ‌ర్‌లో భారీగా వరద నీరు చేరింది. దీంతో కాలుష్య స్థాయి త‌గ్గిందని అంచా వేస్తున్నారు. 

కవితమ్మా.. నీ బతుకమ్మకు పట్టిన గతేంటో చూడమ్మా

బతుకమ్మ అంటేనే తెలంగాణ. తెలంగాణకు ఆ గౌరవం, ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది కూడా బతుకమ్మ వల్లే. నిజాముల కాలంలో రజాకార్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొని ఆత్మగౌరవం నిలబెట్టుకున్న ఓ సాంస్కృతిక విప్లవం బతుకమ్మ పండుగ. అయితే ఆంధ్రాలో కూడా తెలంగాణ సరిహద్దు జిల్లాలకు ఆనుకొని ఉన్న కొన్న ప్రాంతాల్లో బతుకమ్మలు ఆడేవారు. ఇప్పటికీ ఆడుతున్నారు కూడా. కృష్ణా జిల్లాలో గతేడాది బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్న ఓ గ్రామంలో ఆడపడుచులను అక్కడి పోలీసు అధికారి అటకాయించాడు. బతుకమ్మలు ఎలా ఆడతారో చూస్తా  అంటూ గుడ్లురిమాడు. నిస్సహాయులైన ఆ ఊరి ఆడపడుచులు.. ఎంతో నిరాసక్తంగా ఉండిపోయారు. ఈ విషయంలో ఆ పోలీసు అధికారి మీద అప్పట్లో విమర్శలు బాగానే వచ్చాయి. అతను క్రిస్టియన్ కాబట్టే ముఖ్యమంత్రి జగన్ ప్రాపకం కోసం అలా చేసి ఉంటాడన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. అయితే బతుకమ్మ పండక్కి తెలంగాణ ప్రజా జీవనంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఒక్క బతుకమ్మ పేరుతోనే యావత్ ప్రజానీకానికి కనెక్ట్ అయిపోవచ్చు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత బతుకమ్మకే బ్రాండ్ అంబాసిడర్ గా అవతారమెత్తారు. దేశ, విదేశాల్లో కూడా తెలంగాణ జాగృతి బృందాలను ఏర్పాటు చేసుకొని బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ సర్కారు కూడా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఆకాశానికెత్తింది. ప్రతియేటా ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తోంది. బతుకమ్మలు ఆడుకోవడానికి మైదనాల ఏర్పాటు, విద్యుద్దీపాలు, సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేస్తోంది. అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బతుకమ్మ పండుగలో అధికారికంగా పాల్గొంటున్నారు. అంతేకాదు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేస్తోంది.  ఇంతటి చారిత్రక నేపథ్యం, పాలనాపరమైన వైభవం సంతరించుకున్న బతుకమ్మను కొందరు క్రైస్తవ మత ప్రచారకులు దుర్వినియోగం చేస్తున్నారు. అమాయకులైన ప్రజలను ప్రలోభపెట్టి బతుకమ్మ పండుగను సాంస్కృతికంగా దెబ్బ తీస్తున్నారు. ప్రధాన స్రవంతి ప్రజల సెంటిమెంట్లు గాయపడేలా వ్యవహరిస్తున్నారు. బతుకమ్మలకు బదులు మధ్యలో  భారీ సైజు శిలువను పెట్టి, శిలువను దీపాలతో అలంకరించి బతుకమ్మ పాటల పేరడీలతో ఏసుక్రీస్తును కొలుస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగినట్టుగా చెబుతున్న ఓ వీడియో మీద సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.  రామ రామ రామ ఉయ్యాలో... రామనే శ్రీరామ ఉయ్యాలో.. ఇలాంటి పాటలకు బదులుగా దయచూపు ఏసయ్య, నాతో మాట్లాడు ఏసయ్యా.. అంటూ మధ్యలో మత ప్రచారకుడు నిలబడి పాటలు పాడుతూ ఉంటే.. మహిళలంతా బతుకమ్మ స్టయిల్లో చప్పట్లు కొడుతూ పాస్టర్ పాడే పాటలకు కోరస్ ఇస్తున్నారు. హిందూ అక్క-చెల్లెళ్లంతా ఎంతో భక్తి భావనతో, ఉపవాసాలతో దేవీ నవరాత్రుల సమయంలో జరుపుకునే ఈ వేడుక ఈ విధంగా క్రైస్తవమయం అయిపోతుండడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల అవసరాలనే అవకాశాలుగా మలచుకొని, వారిని ప్రలోభపెట్టి మతం మార్చే ప్రక్రియ కాస్తా మరింత పరాకాష్టకు చేరి నేరుగా బతుకమ్మ పండుగలో సైతం మతమార్పిడి వ్యవహారం ప్రవేశించిందని.. మత మార్పిడి కోసం ఇంత నీచానికి దిగజారే క్రైస్తవ ప్రచారకులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పూలకు, పూజలకు దూరం ఉండే క్రైస్తవులు.. పూలకే పూజ చేసే బతుకమ్మ సంస్కృతిని ఇంతగా కలుషితం చేయడం సాంస్కృతికపరమైన దాడిగా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. తాము ఎంతో పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగను శిలువ చుట్టూ చేరి ఏసుక్రీస్తు పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకగా జరుపుకోవడం అవమానించడమేనంటున్నారు.  బతుకమ్మ పండుగకే బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ విషయంలో నోరు మెదపాలంటున్నారు. బతుకమ్మ పేరుతో ప్రచారం చేసుకోగానే సరిపోదని, ఆ పండుగలో ఉండే అసలైన స్ఫూర్తిని కాపాడడంలో కూడా కవిత ముందుండాలంటున్నారు. బతుకమ్మ పండుగను ఇంతలా కలుషితం చేస్తున్న సంబంధిత క్రైస్తవ ఫాదర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటున్నారు. మైనారిటీ ప్రజల మనోభావాలను ఎంత గొప్పగా ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందో మెజారిటీ ప్రజల మనోభావాలకు కనీసం అందులో సగమైనా విలువ ఇవ్వాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.  అమ్మవారి ముందు భక్తి చాటుకున్న అబ్దుల్ అజీజ్ మత స్వేచ్ఛ అంటే ఒకరి మత విశ్వాసాలను పేరడీల పేరుతో కించపరచడం కాదని, అవతలి ప్రజల విశ్వాసాలను సొంత విశ్వాసాలతో సమానంగా ఆదరించడమేనని సికింద్రాబాద్ సీతాఫల్ మండీకి చెందిన అబ్దుల్ అజీజ్ నిరూపించారు. అజీజ్ స్థానిక బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాల్లో అజీజ్ అమ్మవారి మండపాలలో  అన్నదాన కార్యక్రమాల కోసం 25 కిలోల బియ్యం ఇస్తూంటారు. గత కొన్నేళ్లుగా ఆయన ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. మెజారిటీ ప్రజల సెంటిమెంట్లు గౌరవించడంలో అజీజ్ ను చూసి ప్రముఖ రాజకీయ నాయకులంతా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు స్థానికులు. ఎప్పుడూ మైనారిటీల పాట పాడుతూ మెజారిటీ ప్రజల సెంటిమెంట్లకు పూచికపుల్ల విలువ ఇవ్వని పార్టీల కన్నా ఏ రాజకీయాలతో సంబంధం లేని అజీజ్ సర్వమత సమ భావనను ఆచరణలో చూపారని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ స్ఫూర్తి ప్రదర్శించినందుకు గాను ఆలయ కమిటీ అజీజ్ ను శాలువాతో సత్కరించడం విశేషం.

బతుకమ్మ వేడుకలకు కవిత డుమ్మా.. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదా? 

కల్వకుంట్ల కవితకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదా? కేటీఆర్ తో ఆమెకు విభేదాలు మరింత తీవ్రమయ్యాయా?  ఈ చర్చ తెలంగాణలో కొన్ని రోజులుగా సాగుతోంది. అన్న కేటీఆర్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత కనిపించిన సందర్భాలు కూడా ఇటీవల కాలంలో కనిపించలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. రాఖి పౌర్ణమి రోజున జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. అన్న కేటీఆర్ కు కవిత రాఖీ కట్టకపోవడం చర్చగా మారింది. ప్రతి ఏటా అన్నకు రాఖీ కట్టి సందడి చేసేది కవిత. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవి. కాని ఈసారి కవిత రాఖీ కట్టకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ భారీగా పెరిగిందనే చర్చ వచ్చింది. ఈ వార్తలను ఇద్దరు కూడా ఖండించకపోవడంతో నిజమేనని అందరూ భావించాల్సి వచ్చింది. కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన కవిత.. గత రెండు వారాలుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో బిజీగా గడిపారు. ఈసారి జాగృతి తరపున ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో హై రేంజ్లో బతుకమ్మ సాంగ్ రూపొందించారు కవిత. ఆ సాంగ్ ఆవిష్కరణను కూడా ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పలు వేడుకలకు హాజరవుతున్నారు కవిత. మంగళవారం పీపుల్స్ ప్లాజా లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆడి పాడారు.  బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కల్వకుంట్ల కవిత... బుధవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాత్రం కనిపించలేదు. ప్రగతి భవన్ లో జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ  మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాని కేసీఆర్ కూతురు కవిత మాత్రం హాజరుకాలేదు. గతంలో ప్రగతి భవన్ లో నిర్వహించిన వేడుకల్లో అంతా తానై వ్యవహరించేవారు కవిత. అలాంటిది ఈసారి ప్రగతి భవన్ కు రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేకపోవడం వల్లే బతుకమ్మ వేడుకలకు కవిత వెళ్లలేదని అంటున్నారు. గత కొన్ని నెలలుగా కవిత ముఖ్యమంత్రి నివాసానికి రావడం లేదంటున్నారు. కవిత ప్రగతి భవన్ కు ఎందుకు రావడం లేదన్నదానిపై పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తండ్రి కేసీఆర్ తో విభేదాలున్నాయా లేక అన్న కేటీఆర్ తో గ్యాప్ వచ్చిందా అన్నదానిపై రకరకాల చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి మార్పు విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరిగాయని గతంలో ప్రచారం జరిగింది. కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావించగా.. కవిత తీవ్రంగా వ్యతిరేకించారనే చర్చ జరిగింది. అప్పటి నుంచి కేటీఆర్, కవిత మధ్య విభేదాలు వచ్చాయని.. క్రమంగా అది పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు. కేటీఆర్ తో గ్యాప్ బాగా పెరగడం వల్లే ఆయనకు రాఖీ కట్టడానికి కవిత ఇష్టపడలేదని చెబుతున్నారు. అందుకే రాఖీ పౌర్ణమి రోజున హైదరాబాద్ లో ఉండకుండా విదేశాలకు వెళ్లారనే గుసగుసలు వినిపించాయి. తాజాగా ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కవిత హాజరు కాకపోవడంతో బయట జరుగుతున్న ప్రచారమంతా నిజమేనని తెలుస్తోంది. కేటీఆర్ సతీమణితో కలిసి బతుకమ్మ ఆడటం ఇష్టం లేకే కవిత.. ప్రగతి భవన్ వెళ్లలేదని అంటున్నారు. మొత్తంగా ప్రగతి భవన్ బతుకమ్మ వేడుకలకు కవిత హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. 

జగన్ రెడ్డి దొంగ భక్తీ?.. అమరావతిలో దొంగలు.. కరెంట్ కోతలు షురూ..టాప్ న్యూస్ @8PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వేదపండితులు తలపై వేసిన అంక్షితలను జగన్ అసహ్యంగా దులుపుకున్నారని, పవిత్రమైన ప్రసాదాన్ని వాసన చూశారని లోకేశ్ ఆరోపించారు. వెంకటేశ్వరస్వామిపై ఎందుకీ దొంగభక్తి జగన్ రెడ్డి గారూ? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అంటూ ప్రశ్నించారు. --- ఏపీ రాజధాని అమరావతిలో 50 ఎకరాల ప్రభుత్వ  భూమి అన్యాక్రాంతమైంది. అధికార వైసీపీ నేతల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు అయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తుళ్ళూరు తహశీల్దార్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. భూ మాయ వెలుగు చూడటంతో తహశీల్దార్ సెలవులోకి వెళ్లారు.  --  కేఆర్‌ఎంబీ తీర్మానాలకు ఎలా ఆమోదం తెలుపుతారు? అని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర రైతాంగానికి గొంతు కోసే కార్యక్రమమని దుయ్యబట్టారు. మీకు మీకు లోపాయికారి ఒప్పందాలు ఏమైనా ఉండొచ్చు... కానీ రాష్ట్ర రైతాంగం హక్కులను ఎలా తాకట్టు పెడతారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ------ విజయవాడ సమీపంలోని వీటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గు కొరత ఏర్పడుతోంది. బొగ్గు సరఫరాను పెంచుకునేందుకు జెన్‌కో ప్రయత్నాలు చేస్తోంది. వీటీపీఎస్‌లోని 7 యూనిట్లకు గాను 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్ నిర్వహణ పనుల కారణంగా రెండో యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటీపీఎస్‌లో 1760 మెగావాట్ల సామర్థ్యానికి గాను 1280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ------- ఏపీలోను తెలంగాణ తెలుగు అకాడమీ అక్రమార్కులు దోచేశారు.  ఏపీలో రెండు ప్రభుత్వ సంస్థల నుంచి సాయి కుమార్ బ్యాచ్ రూ.15 కోట్లు కొట్టేసినట్లు గుర్తించారు. ఏపీ గిడ్డంగుల శాఖ నుంచి 9.60.కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్‌ల నుంచి రూ.5 కోట్ల ఎఫ్‌డీలు గల్లంతయ్యాయి. భవానిపురం IOB లోని గిడ్డంగుల కార్పొరేషన్ FD నుంచి రూ.9.60.కోట్లు నిందితులు కొట్టేశారు. కార్పొరేషన్ అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తామని బ్యాంక్ అధికారులు చెప్పినట్లు సమాచారం ----- హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో 30 మంది అభ్యర్థులు నిలిచారు. చివరి రోజున 12 మంది అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరించారు. దీంతో ఉప ఎన్నికల బరిలో 30 మంది మిగిలిపోయారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇందులో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉండగా.. మరో ఏడుగురు గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు. 20 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు హుజురాబాద్ ఉప సమరంలో పోటీలో నిలిచారు.  ---- ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిధులు వస్తున్నాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. పెన్షన్‌, రేషన్‌ కార్డు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే వారందరూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారని ఈటల విమర్శించారు. ఇవన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటి నుంచి, ఆయన సొంత భూమి అమ్మి, కూలీ పని చేసి ఇచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే నిధులు, పథకాలు ఇస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. -------- తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు. జుడిషియల్ అధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. శ్రీ సుధా, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, తుకారం జి, వెంకటేశ్వర్ రెడ్డి, మాధవి దేవిలకు పదోన్నతి కల్పించారు. గతనెల 16న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు -------- అవార్డులు అందజేయడం ద్వారా మరెంతో మందికి ప్రేరణ కలుగుతుందని, భాషాభివృద్ధి దిశగా యువత ముందుకు రావడానికి దోహదపడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వెంకయ్య నాయుడు డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు ఆచార్యులైన పోలూరి హనుమజ్జానకీ రామశర్ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా స్వయంగా అవార్డును నెలకొల్పి,తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్యకి అందజేశారు. తమ ఆచార్యుల పేరిట అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, పోలూరి హనుమజ్జానకీ రామశర్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు ------- మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయనకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. జ్వరం, నీరసంతోనూ ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 88 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ---