ప్రజలంతా కరెంట్ వాడకం తగ్గించుకోండి.. చేతులెత్తేసిన జగన్ సర్కారు..
posted on Oct 11, 2021 @ 4:23PM
అనుకున్నట్టే అవుతోంది. విద్యుత్ సమస్యలపై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. ఇప్పటికే అనధికారికంగా ఎడాపెడా కరెంట్ కోతలు విధిస్తుండగా.. త్వరలోనే అధికారికంగా పవర్ కట్స్ తప్పకపోవచ్చంటూ ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం ఏసీలు వాడొద్దని అధికారులు వేడుకుంటుంటే.. ఇక, సజ్జల ప్రజల ముందుకు వచ్చి.. ఏకంగా సాయంత్రం వేళల్లో ఏసీలే కాదు.. ఎలాంటి విద్యుత్ ఉపకరణాలూ వాడొద్దంటూ ఉచిత సలహా పడేశారు. వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేల్చిన పవర్ బాంబ్ ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఇంతకీ సజ్జల ఏమన్నారంటే...
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు విధించాల్సి రావొచ్చని హెచ్చరించారు. ఇళ్లల్లో కరెంట్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-10 గంటల మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు.
బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందని తెలిపారు. డబ్బు వెచ్చించినా ఇది పరిష్కారమయ్యే పరిస్థితి లేదని వివరించారు. విద్యుత్ అంశంపై కేంద్ర మంత్రి చెప్పింది అవాస్తవమన్నారు. సీఎం ఇప్పటికే సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సజ్జల చెప్పారు.
ప్రభుత్వ తరఫున సజ్జల చేసిన విజ్ఞప్తిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇళ్లలో కరెంట్ వాడకం తగ్గించుకోవాలని చెప్పడమేంటని మండిపడుతున్నారు. కరెంట్‌తో అత్యవసరం ఉండేదే.. సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య. అలాంటిది ఆ సమయంలో కరెంట్ వాడకం తగ్గించుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ మేమే చేస్తే.. ఇక మీరున్నది ఎందుకంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో ఎలాంటి విద్యుత్ సంక్షోభం లేకున్నా.. ఏపీలో మాత్రం ఈ విపరీత కరెంట్ కోతలు ఏంటంటూ.. ఇదంతా జగన్ సర్కారు వైఫల్యమేనంటూ మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.
వైసీపీ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా థర్మల్ ప్లాంట్లు మూతపడే స్థితికి చేరుకున్నాయని అంటున్నారు. విజయవాడ సమీపంలోని ఏకైక థర్మల్ ప్లాంట్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్‌లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. సరిపడ నిల్వలు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించారు. దీంతో విద్యుత్ కోతలకు రంగం సిద్ధమైనట్టేనని తెలుస్తోంది.
అటు, అప్పు చెల్లించకపోవడంతో ఏపీలో విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి. హైడల్ పవర్‌తో పాటు ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న 15 వందల మెగావాట్లు.. బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్‌తో ప్రస్తుతం రాష్ట్రాన్ని నడుపుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయాలంటే థర్మల్ విద్యుత్ మినహా ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకుండా పోయింది. థర్మల్ విద్యుత్‌కు సంబంధించి ఇప్పటికే రాయలసీమ, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు మూతపడ్డాయి. ఉత్పాదన ఖర్చు అధికంగా ఉందన్న కారణంతో ఈ రెండు ప్లాంట్లను మూసివేశారు. ఒక్క విజయవాడకు సమీపంలోని ఎన్టీటీపీఎస్‌లో మాత్రమే ఉత్పాదన జరుగుతోంది. దాని పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉండటంతో.. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అంధకారమయం కానుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.