రెండు రోజుల్లో అంధకారంలోకి ఏపీ? జగనన్న పాలన స్పెషలా?
posted on Oct 11, 2021 @ 7:58PM
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోంభం ముదురుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలను భారీగా బాదడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పవర్ భారం అలా ఉండగానే.. ఇప్పుడు కోతలు మొదలుకావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో.. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు,మూడు రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అంటున్నారు. విద్యుత్ కోతలు తప్పవని పాలకులే చెబుతుండటంతో ఏపీలో ఏం జరగబోతుందోనన్న చర్చ మొదలైంది.
విద్యుత్ సంక్షోభం, చార్జీల పెంపుపై సీఎం జగన్ కు తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ప్రజలకు భారంగా మారాయని మండిపడ్డారు నారా లోకేష్. కరెంట్ ట్రూఅప్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడినపెట్టాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారని ఆరోపించారు. వైసీపీ పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలు తప్ప మరేముందని విమర్శించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.20,261 కోట్ల అప్పులు చేశారని, ఆ భారాన్ని ట్రూఅప్ చార్జీల పేరుతో లాగేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. యూనిట్ గరిష్ఠంగా రూ.20కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ లోకేశ్ ప్రశ్నించారు. యూనిట్ కు అదనంగా చెల్లిస్తున్న రూ.10 ఎవరి జేబులోకి వెళుతోందని నిలదీశారు.
విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేసి ప్రజలపై భారాన్ని మోపడంతో పాటుగా, నేరాన్ని కేంద్రంపై మోపే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యుత్ రంగంలో సంక్షోభం తలెత్తిందని కేశవ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో వచ్చే నెలలో ఇళ్లకు కరెంట్ ఉంటుందో ఉండదో చెప్పలేమంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.