రూ.2వేలు దాటేసిన గ్యాస్.. లీటర్ పాలు రూ.వెయ్యికిపైనే.. వింటున్నారా మోదీజీ!
posted on Oct 11, 2021 @ 7:58PM
దేశంలో గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి దిశగా దూసుకుపోతోంది. లీటర్ పాలు సెంచరీ కొట్టేందుకు సై అంటున్నాయి. పప్పులు, నూనెలు ఇలా అన్ని నిత్యవసరాల ధరలూ పైపైకి పెరుగుతున్నాయి. మోదీ పాలనలో ఇదేమి ధరాఘాతమంటూ సామాన్యులు అల్లాడిపోతున్నారు. ధరలపై మండిపడుతూనే.. జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గ్యాస్ బండ ధర వెయ్యి ఉంటేనే మనం ఇంత ఇదైపోతున్నాం.. అదే గ్యాస్ సిలిండర్ రేట్ రూ.2,657కి చేరితే..? అందులోనూ రెండు రోజుల గ్యాప్‌లోనే రూ.1257 పెరిగితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. లీటర్ పాలు వంద వైపు పరుగులు పెడితేనే పరేషాన్ అవుతున్నాం.. అదే లీటర్ మిల్క్ రేట్ 2 డేట్ గ్యాప్‌లో వెయ్యి రూపాయలు పెరిగి రూ.1195కి చేరితే..? గ్యాస్, మిల్క్ అనే కాదు.. పప్పు, పంచదార, నూనె, బియ్యం, గోధుమపిండి.. ఇలా ప్రతీ ఒక్క ఐటమ్.. ఆకాశాన్ని అంటితే..? వాటిని కొనేదెలా? తినేదెలా? అందుకే, ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదంటూ.. సింహళ భాషలో బాధపడుతున్నారు శ్రీలంక వాసులు. ఎందుకంటే.. ఇదంతా శ్రీలంకలో ధరల మోత గురించే....
శ్రీలంకలో ఒక్కసారిగా నిత్యావసర ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. శుక్రవారం రూ.1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర.. సడెన్‌గా రూ.2,657కు చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాల ధర రూ.250 నుంచి రూ.1195కు చేరింది. అన్నిరకాల నిత్యావసర వస్తువులతో పాటు సిమెంట్ తదితర వస్తువుల ధరలూ భారీగా పెరిగాయి. ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక దేశం. నిత్యావసర ధరల నియంత్రణను శ్రీలంక ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం.
ఏడాదిగా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో శ్రీలంక విదేశీ మారక ద్రవ్యం విలువ భారీగా పతనమైంది. కరోనా కారణంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వాటికి కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి.. ఫలితంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో రాజపక్సే ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది. అది కూడా బెడిసికొట్టింది. ధరలపై నియంత్రణ తీసుకురావడంతో నిల్వలను బ్లాక్ మార్కెట్ చేసేశారు వ్యాపారులు.
అక్రమ నిల్వలు పెరిగిపోవడంతో మార్కెట్లో సరఫరా తగ్గి ఆహార కొరత ఏర్పడింది. దీంతో, హడావుడిగా ధరలపై నియంత్రణ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సర్కారు ఇలా నియంత్రణ ఎత్తివేయగానే.. ధరలు చుక్కలను తాకేలా అమాంతం పెంచేశారు వ్యాపారులు. ఫలితంగా.. శ్రీలంకలో గ్యాస్ సిలిండర్ ధర రూ.2,657.. లీటర్ పాల రేటు రూ.1195. మన దగ్గర ప్రస్తుతం గ్యాస్ బండ ధర వెయ్యి సమీపంలో ఉంది. భవిష్యత్తులో ఇక్కడా 2వేలు దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.