చేరికలకు సీనియర్ల బ్రేకులు.. కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డే టార్గెట్టా?
posted on Oct 12, 2021 @ 12:06PM
తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోందా? పార్టీలో చేరికలను సీనియర్లు అడ్డుకుంటున్నారా? గాంధీభవన్ లో అసలేం జరుగుతోంది? ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చగా మారింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామం కాగానే.. ఆ పార్టీలో జోష్ కనిపించింది. గతంలో పార్టీని వీడిన చాలా మంది నేతలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డితో మంతనాలు సాగించారు. దీంతో వాళ్లంతా హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరిగింది. కాని తర్వాత సీన్ మారిపోయింది. ఒకరిద్దరు నేతలు తప్ప ప్రచారం జరిగిన నేతలంతా కాంగ్రెస్ లో చేరలేదు. పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే చేరికలు ఆగిపోయాయని తెలుస్తోంది.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరికకు బ్రేకులు పడినట్లు సమాచారం. జిల్లాలో బలమైన బీసీ నేతగా ఉన్న ఎర్ర శేఖర్ జడ్చర్ల నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత లేదని ఉద్దేశంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చలు కూడా జరిపారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని భావించినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నెల 12న మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో జరగనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్ సభలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు పీసీసీ నుంచి కూడా సంకేతాలు వచ్చాయి.
ఎర్ర శేఖర్ జడ్చర్ల నియోజకవర్గంలోని తన అనుచరుల వద్ద సమావేశం కూడా అయ్యారు. చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే సోమవారం సాయంత్రానికి సీన్ మారినట్లు సమాచారం. త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని ఆయన సమక్షంలో చేరాలని సూచించారని తెలుస్తోంది. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎర్ర శేఖర్ ను పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానానికి లేఖ రాయడంతో ఎర్ర శేఖర్ చేరిక ఆగిపోయిందని తెలుస్తోంది. కోమటిరెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఎర్ర శేఖర్ రాకను వ్యతిరేకించారని అంటున్నారు. ఎర్ర శేఖర్ సోమవారం సాయంత్రం నుండి ఫోన్ లోనూ అందుబాటులో లేకపోవడం, ఇతర పలు విషయాలు శేఖర్ చేరికకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయని భావిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో తిరిగి చేరాలని భావించినా.. ఆయనకు కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా చేసిన హర్షవర్ధన్ రెడ్డి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు నేతలు వ్యతిరేకించడంతో వాయిదా పడుతూ వస్తోంది.
కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో కేడర్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇతర పార్టీలు వలసల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. పార్టీ చేరాలనుకుంటున్న వారిపై ఆపడం ఏంటనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి బలం పెరగకుండా ఉండాలనే లక్ష్యంతోనే కొందరు సీనియర్లు ఇలా అడ్డుపులల్లు వేస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతోంది.