ఏపీకి కరెంట్ గండం.. జగన్ పై లోకేష్ ఆగ్రహం.. బండికి వార్నింగ్.. టాప్ న్యూస్@ 7PM
posted on Oct 11, 2021 @ 6:56PM
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఉత్సవర్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బర్డ్ ఆస్పత్రికి చేరుకుని చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు అలిపిరి మెట్ల మార్గాన్ని, నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
-------
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ప్రజలకు భారంగా మారాయని తెలిపారు. కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూఅప్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు. కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడినపెట్టాలని లోకేశ్ తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఆరుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారని లోకేష్ ఆరోపించారు.
-----
రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చన్నారు. ఇళ్లలో కరెంట్ వాడకం తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాత్రి 6-8 మధ్య విద్యుత్ వినియోగం తగ్గించాలని సూచించారు. బొగ్గు కొరత, ధరల పెరుగుదల వల్లే ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు. డబ్బు వెచ్చించినా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదన్నారు సజ్జల.
---
ఈనెల 30న జరగనున్న బద్వేలు ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. నామినేషన్లు పరిశీలించారు. బద్వేలు ఉప ఎన్నిక కోసం 27 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, నేటి పరిశీలనలో 9 మంది అనర్హులుగా తేలారు. వారి నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం బద్వేలు బరిలో 18 మంది మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13 వరకు గడువు ఉంది.
---
హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 61 మంది నామినేషన్ వేశారు. అయితే 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. బరిలో 43 మంది అభ్యర్థులు నిలిచారు. 13న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఉంది. అదే రోజు అభ్యర్థుల ఫైనల్ లిస్టును అధికారులు ప్రకటించనున్నారు.
-------
ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శంషాబాద్, ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీ సమేతంగా వెళ్లిన కేసీఆర్... చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు.
------
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్‌కి మద్దతిచ్చిన వారిని తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు. జనసేన పోరాడే పార్టీగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉద్యమ రైతులను చంపించిన బీజేపీకి మద్దతెలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
--------
దేశంలో అనేక రాష్ట్రాలో విద్యుత్, ఇంధన రంగ సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీలతో నేడు ఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలో విద్యుత్ స్థితిగతులు, బొగ్గు కొరతలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఎన్టీపీసీఅధికారులు కూడా పాల్గొన్నారు.
----
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో ఐదుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ తర్వాత కశ్మీర్‌లో పాక్‌ప్రేరిత తాలిబన్ల ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని వాపోయారు. కశ్మీర్‌లో భయాలన్నీ నిజమౌతున్నాయన్నారు
---------
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కీలక సంభాషణ ఫలవంతం అయింది. భారతీయులకు విధించిన క్వారంటైన్ నిబంధన ఉపసంహరించుకునేందుకు బ్రిటన్ నిర్ణయించింది. ఇకపై కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారతీయులను నేరుగా అనుమతించేందుకు సమ్మతి తెలిపింది. ఈ నిబంధన నేటి నుంచే అమల్లోకి వస్తుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. సరైన వ్యాక్సిన్ ధ్రువపత్రాలు చూపితే సరిపోతుందని పేర్కొన్నాయి.