రేవంత్ తో కొండా దంపతులకు గ్యాప్! అందుకే పక్కన పెట్టేశారా?
posted on Oct 11, 2021 @ 4:23PM
హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. అన్ని పార్టీల నేతలంతా అక్కడే మకాం వేశారు. మండలాల వారీగా సీనియర్ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అధికార టీఆర్ఎస్ ఎన్నికల బాధ్యతలన్ని మంత్రి హరీష్ రావు చూస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులు హుజురాబాద్ లోనే మకాం వేశారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతర మంత్రులు సభలకు హాజరవుతున్నారు. బీజేపీ కూడా పార్టీ సీనియర్ నేతలకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఆలస్యంగా ప్రచారంలోకి దిగిన కాంగ్రెస్ కూడా సీనియర్ నేతలను హుజురాబాద్ లో మోహరించింది.
అయితే కాంగ్రెస్ ప్రచారకుల జాబితాలో మాజీ మంత్రి కొండా సురేఖ పేరు లేకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. అన్ని పార్టీలకు చెందిన వరంగల్ నేతలే ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొండా సురేఖది వరంగల్ జిల్లా అయినా ఆమెను ఎక్కడా ఇంచార్జ్ గా నియమించలేదు. అంతేకాదు హుజురాబాద్ లోని కమలాపుర్ మండలం గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన పరకాల నియోజకవర్గానికి కలుపుకునే ఉంటుంది. పరకాలతోనే కమలాపూర్ వాసులు అటాచ్ ఉంటారు. అయినా కొండాకు హుజురాబాద్ ప్రచారం బాధ్యతలు అప్పగించకపోవడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది.
నిజానికి హజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కొండా కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాననే సంకేతమిచ్చారు. బలమైన నేతగా ఉన్న కొండాను ఉప ఎన్నిక బరిలో దించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. అయితే పార్టీలో సీనియర్ నాయకులు స్థానికులకే అవకాశం ఇద్దామని ప్రతిపాదించడంతో రేవంత్ వెనక్కి తగ్గాల్సి వచ్చిందనే విషయం బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి వెంకట్ కూడా స్థానికుడు కూడా వెంకట్ ది పెద్దపల్లి, స్థానికురాలు కాదనే కారణంతో కొండా సురేఖను కాదన్నప్పుడు... పెద్దపల్లికి చెందిన వెంకట్ ను ఎలా ఖరారు చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది. వెంకట్ ను అభ్యర్థిగా పెట్టిన తర్వాత కొండాను బరిలోకి దించకపోవడానికి లోకల్ అంశం కారణం కాదని తేలిపోయింది.
కొండా సురేఖ హుజూరాబాద్లో పోటీ చేయకపోవడం వెనక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ప్రతిపాదనను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని అంటున్నారు. ఓ సీటు విషయంలో సురేఖ పెట్టిన షరతును రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదని, అందుకే హుజురాబాద్ లో పోటి నుంచి కొండా తప్పుకున్నారని అంటున్నారు. భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో తాము సూచించిన అభ్యర్థులకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలో సీట్లు ఇవ్వాలని కొండా షరతు పెట్టారట. అయితే భూపాలపల్లి విషయంలో రేవంత్ ససెమిరా అన్నారట. అంతేకాదు కొండా దంపతులకు ఇష్టం లేకపోయినా గండ్ర సత్యనారాయణను రేవంత్ పార్టీలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఆయనకే భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.
తన ప్రతిపాదనలను తిరస్కరించడంతో పాటు తమకు తెలియకుండానే గండ్ర సత్యనారాయణను కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో రేవంత్ రెడ్డిపై కొండా దంపతులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ విషయంపై రేవంత్ ను నేరుగా అడిగారని తెలుస్తోంది. అందుకే కొండా దంపతులకు హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలు రేవంత్ రెడ్డి ఇవ్వలేదని కాంగ్రెస్ లోనే చర్చ జరుగుతోంది. అయితే మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాకు నేతలను ఇంచార్జులుగా నియమించి.. హుజురాబాద్ లో మంచి సంబంధాలున్న కొండా దంపతులకు బాధ్యతలు అప్పగించకపోవడంపై కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.