టాలీవుడ్ పెదరాయుడు.. మోహన్‌బాబును ఆపతరమా? మెగా ఆధిపత్యం ఫసక్కేనా?
posted on Oct 12, 2021 @ 12:26PM
మంచు మోహన్‌బాబు. టాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్ లీడర్. ఆయనకున్నంత టెంపరితనం మరెవరికీ లేదంటారు. బహిరంగ వేదికలపైనా ఆయన నోటి దురుసును ఏమాత్రం తగ్గించుకోరు. తాజాగా, మా ఎన్నికల్లో మరోసారి చెలరేగిపోయారు. తనయుడు మంచు విష్ణు బరిలో నిలవడం.. అటువైపు నుంచి ప్రకాశ్‌రాజ్ ఉండటం, ఆయన్ను మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడంతో 'మా' పోరు మామూలుగా జరగలేదు. విష్ణు గెలిచారు అని చెప్పడం కంటే మోహన్‌బాబు తన కొడుకును గెలిపించుకున్నారని అనడమే కరెక్ట్. ఈ విషయాన్ని స్వయంగా విష్ణునే ఒప్పుకున్నారు. ఇక, పోలింగ్‌కు ముందు, పోలింగ్ వేళ.. అసెంబ్లీ రౌడీలా రెచ్చిపోయారు మోహన్‌బాబు. ఓ సందర్భంలో నటుడు బెనర్జీని చంపేస్తానని కూడా బెదిరించారట. ఆ రెండు వారాలూ మోహన్‌బాబు.. రాజకీయ నవరసాలు పండించారనే చెప్పాలి. ఇండస్ట్రీ పెద్దలకు, సీనియర్లకు స్వయంగా ఫోన్ చేసి.. తన తనయుడికి ఓటేయమని విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఆరోపణలకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ.. తగ్గేదే లే.. అంటూ స్ట్రాంగ్ పిల్లర్‌గా నిలిచారు. ఆన్‌లైన్ టికెట్ల వ్యవహారంలో పవన్ కల్యాణ్ మోహన్‌బాబును బయటకు లాగాలని ప్రయత్నించినా.. 'మా' ఎన్నికల తర్వాత స్పందిస్తానంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అలా..అలా.. 'మా' అధ్యక్షునిగా విష్ణు గెలుపులో అంతా తానై చక్రం తిప్పారు మోహన్‌బాబు.
సినిమా ఇక్కడితో అయిపోలేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్‌లో ఇన్నేళ్లూ మంచు ఫ్యామిలీ కాస్త సైడ్‌వేస్‌లోనే ఉంది, దాసరి మరణం, మోహన్‌బాబు సినిమాలకు దూరమవడం.. పిల్లలు పెద్దగా రాణించకపోవడంతో.. మంచు ఫ్యామిలీ సిని పరిశ్రమ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకునేది కాదు. అప్పట్లో టాలీవుడ్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో.. వేదిక మీద.. టాలీవుడ్ "లెజెండ్" అవార్డ్ విషయంలో.. మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు మధ్య తారాస్థాయిలో వివాదం జరిగింది. మోహన్‌బాబు అభ్యంతరంతో "లెజెండ్" అవార్డును స్వీకరించనే లేదు చిరంజీవి. ఆ పరిణామంతో ఆవేశంతో ఊగిపోయిన పవన్‌కల్యాణ్.. అదే వేదికగా పరోక్షంగా మోహన్‌బాబుపై విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి మోగా ఫ్యామిలీకి, మంచు కుటుంబానికి మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్‌వార్ నెలకొంది. బయటకు తామిద్దరం మంచి మిత్రులమంటూ.. ఆ ఇద్దరు నటులు.. ఎంతబాగా నటించినా.. వారి మధ్య వైరం జగమెరిగిందే.
దాసరి మరణం తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారారు చిరంజీవి. సినీ పరిశ్రమ సమస్యలన్నీ ఆయన వద్దకే వెళుతుంటాయి. ఇండస్ట్రీలో మెగా-అల్లు ఆధిపత్యం కాదనలేనిది. ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి ఫ్యామిలీలు సైతం మెగా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండటంతో.. టాలీవుడ్ ఆ నలుగురిదే అన్నట్టు సాగింది. ఆ ఏళ్ల ఆధిపత్యాన్ని.. సింగిల్‌గా చితక్కొట్టారు మోహన్‌బాబు. చిన్న ఫలితంతో పెద్ద విజయమే సాధించారు. మెగా కుటుంబం మద్దతుగా నిలిచినా కూడా.. ప్రకాశ్‌రాజ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి.. "మా" మాదే.. ఇకపై టాలీవుడ్ కూడా మాదేననే రేంజ్‌లో మీసం మెలేశారు మోహన్‌బాబు.
అసలే ఆవేశపరుడు. ఆపై మెగా వైరం. అవకాశం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోహన్‌బాబుకు మా రూపంలో అనుకోని ఆయుధం చేజిక్కింది. ఇక మోహన్‌బాబు.. టాలీవుడ్ పెదరాయుడిలా మారుతారా? టాలీవుడ్ రౌడీలా చెలరేగిపోతారా? మెగా ఆధిపత్యానికి చెక్ పెడతారా? పెట్టగలరా? ఇకపై మోహన్‌బాబును ఆపతరమా?