సీఎం కేసీఆర్‌కు చలిజ్వరమట! హుజురాబాద్ ఉపఎన్నికే కారణమా?
posted on Oct 11, 2021 @ 2:47PM
తెలంగాణ రాజకీయాలను హీటెక్కిక్కిస్తున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ప్రత్యేకమైన వ్యూహాలతో జనంలోకి వెళుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీలో మూడు నెలల ముందు నుంచే జోరుగా ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం నామినేషన్లు ఘట్టం ముగిశాకే స్పీడ్ పెంచింది. హుజురాబాద్ లోని మండలాలు, గ్రామల వారీగా పార్టీ నేతలకు ప్రఛార బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
హుజురాబాద్ లో మొదటి నుంచి కాంగ్రెస్ సైలెంటుగా ఉంది. దీంతో ఈటల రాజేందర్ గెలిచేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి వేస్తున్న వ్యూహాలతో ఉప ఎన్నికను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుందనే చర్చ సాగుతోంది. వెంకట్ నామినేషన్ సందర్భంగా కేసీఆర్ తో పాటు ఈటల రాజేందర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ దూకుడు పెంచడంతో హుజురాబాద్ లో సమీకరణలు మారిపోతున్నాయని అంటున్నారు.
సోమవారం కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా బయటికి రావడం లేదని, మహాత్మ గాంధీ జయంతి రోజున నివాళి అర్పించేందుకు కూడా రాలేదని విమర్శించారు. కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉందని సర్వేల్లో రావడంతో ఆయనకు భయం పట్టుకుందని , హుజురాబాద్ లో ఓడిపోతామనే బెంగతోనే కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, హుజురాబాద్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు.
యూపీలో రైతులపై జరిగిన దాడికి నిరసనగా ఇందిరా పార్క్ లో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు .యూపీలో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని...దీనిపై మోడీ, అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదు 80 శాతం మంది రైతుల సమస్య అని.. 80 కోట్ల మంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారని ఆరోపించారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారని..దీనిపై రైతులు తిరగబడి ఎర్రకోటపై జెండా ఎగరేశారని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారని అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ మాట మార్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారన్నారు రేవంత్ రెడ్డి. ఈ దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంటే మోడీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశ ప్రజల మన్ కీ బాత్ విను మోడీ అని హితవుపలికారు. సిరిసిల్లలో కూడా దళితులను ఇసుక లారీలతో గుద్ది చంపారని ఆరోపించారు. పాలకులే ప్రజలను భయపెట్టి, చంపి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. రైతులను చంపిన వారిని నడిబజారులో ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీకి లొంగిపోయారని విమర్శించారు. మోదీ, కేసీఆర్‌ను బొందపెడితేనే దేశంలో రాష్ట్రంలో శాంతి ఉంటుందన్నారు. మోదీ, అమిత్ షా రైతుల హత్యలను ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.