సజ్జన్నార్ దసరా ధూంధాం.. ఏపీ ఆర్టీసీ ఢాం ఢాం..
posted on Oct 11, 2021 @ 3:36PM
దసరా వచ్చేస్తోంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ హోరెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో దేవీన్నవరాత్రులు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం దసరా పండుగ కావడంతో.. ప్రయాణీకుల రాకపోకలతో తెలుగురాష్ట్రాల్లో సందడి నెలకొంది. సందట్లో సడేమియాలా.. దసరా పండగకి ఎప్పటిలానే దోచుకోడానికి సిద్ధమైపోయాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు. దసరా పేరు చెప్పి.. ప్రత్యేక బస్సులను సాకుగా చూపించి.. 50శాతం టికెట్ రేట్లు పెంచేసి.. ప్యాసింజర్లను దోచుకోవడం ఏటేటా జరిగే దోపిడీ తంతే. ఈసారి కూడా అలానే చేస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలు దసరాకు స్పెషల్ సర్వీసులు నడిపిస్తూ.. టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి. పండగ పేరుతో ఖజానా నింపేసుకోవాలని స్కెచ్ వేశాయి. కాకపోతే చిన్న ఛేంజ్.
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జన్నార్ రావడంతో సీన్ మారిపోయింది. పండగ పేరుతో ప్రయాణీకులను దోచుకోవడమేంటని అధికారులపై మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. కానీ, ఏపీలో అలా లేదు. ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. ఆర్టీసీని ప్రభుత్వపరం చేసేసి చేతులు దులిపేసుకున్నారు సీఎం జగన్.
ఇక, అసలే అప్పుల రాష్ట్రం. ఇప్పటికే పన్నులపై పన్నులు బాదేస్తున్నారు. లిక్కర్ ఆదాయంతోనూ అప్పులు తెస్తున్నారు. ఆర్ అండ్ బీ ఆస్తులనూ తనఖా పెట్టేస్తున్నారు. ఎక్కడ అణాపైసా కనిపించినా.. లాగేసుకుంటున్నారు. అలాంటి వైసీపీ సర్కారుకు దసరా రావడం పండుగలా మారింది. మరేమీ ఆలోచించకుండా అదనపు చార్జీలు బాదేసింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఛార్జీలను తగ్గిస్తే.. ఏపీ మాత్రం అలానే కంటిన్యూ చేస్తోంది. ప్రయాణీకుల నుంచి ఒత్తిడి వస్తున్నా.. డోంట్‌కేర్ అంటోంది.
దసరా పండుగకు ఏపీలో కంటే తెలంగాణలోనే రద్దీ ఎక్కువ. ఏపీలో సంక్రాంతి ఎలానో.. తెలంగాణలో దసరా అలాగ. బతుకమ్మ, దసరా జంట పండుగలకు తెలంగాణ ప్రజలంతా సొంతూళ్ల బాట పడతారు. వచ్చీపోయే వాళ్లతో ఆ మూడు రోజులూ బస్సుల్లో తెగ రద్దీ ఉంటుంది. ప్యాసింజర్ల డిమాండ్ మేరకు బస్సులు నడపలేని స్థితి ఉంటుంది. అంత డిమాండ్ ఉండే తెలంగాణలోనూ టికెట్ల రేట్లు పెంచకుండా టీఎస్ఆర్టీసీ ప్రయాణీకులు మన్నన పొందుతుంటే.. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రద్దీ తక్కువగా ఉండే దసరాకు ఏపీఆర్టీసీ మాత్రం 50శాతం అధిక ధరలు వసూలు చేస్తుండటం విమర్శల పాలవుతోంది.
ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్, తిరుపతి, కర్నూల్‌లాంటి నగరాలను నడిచే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ధరలు తక్కువగా ఉండటంతో.. ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు ఉన్న సీట్లు సైతం బుక్ కాని పరిస్థితి ఏర్పడింది. బస్సులే ఖాళీగా ఉంటే.. టికెట్లు ఎవరూ కొనకపోతే.. ఇక ధరలు పెంచి ఏం లాభం? సజ్జన్నార్ నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీకి ఫుల్ డిమాండ్ పెరిగితే.. ఆ దెబ్బకు ఏపీ ఆర్టీసీకి దిమ్మతిరిగి పోతోంది. రండి బాబూ రండి.. అంటూ ప్రయాణీకులను వేడుకునే దుస్థితి వస్తోంది. ఇప్పటికైనా పెంచిన అధనపు ధరలను వెంటనే తగ్గిస్తేనైనా కాస్త తేరుకునే అవకాశం ఉందంటున్నారు. మరి, ఆ మేరకు జగన్ సర్కారు కాస్త వెనక్కి తగ్గుతుందా? దసరాకు ఆర్టీసీని గట్టెక్కిస్తుందా?