మల్లన్న సాగర్ లో 10 టీఎంసీలు.. ఆకాశమార్గంలో వీక్షించి పులకించిన సీఎం
posted on Oct 12, 2021 @ 10:30AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో అత్యంత కీలకమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. కొన్ని రోజులుగా రిజర్వాయర్ లో నీటిని నింపుతుండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 10.6 టీంసీల నీరు ఉంది. గోదావరి జలాలతో నిండుతున్న భారీ జలాశయం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశమార్గంలో వీక్షించారు. హెలికాప్టర్ ద్వారా గోదావరి జలాలు మల్లన్న పాదాలను తాకిన దృశ్యాలను చూసి గులాబీ బాస్ పులకించి పోయారు.
మల్లన్నసాగర్ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇటీవలే 10 టీఎంసీల గోదావరి జలాలను తరలించారు. కాళేశ్వరం ఎత్తిపోతలలో అత్యంత కీలకమైన రిజర్వాయర్ నిర్మాణాన్ని విపక్షాలు అడ్డుకొన్నప్పటికీ.. సీఎం పట్టుదలతో రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేశారు.మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులు నింపుతూ.. చివరి ప్రాజెక్టు అయిన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టును 2020 ఏప్రిల్, మే నెలలో గోదావరి జలాలు ముద్దాడాయి. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌ను నింపి రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని పంపించడం వల్ల కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందిస్తున్నారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని తరలించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఒకపక్క సిద్దిపేట అభయారణ్యం.. దాని అంచున వెలసిన అపూర్వ జలసిరి. సిద్దిపేట జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతం అంచున ఈ జలసిరి వెలుస్తున్నది. ప్రాజెక్టు కింద పోను మిగిలిన అటవీ ప్రాంతంలో మల్లన్న వనం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అటవీ అధికారులను ఆదేశించారు. నల్లమల అడవులను తలదన్నేలా ఈ అటవీప్రాంతం విస్తరించి ఉన్నది. ఇందులో తీరొక్క మొక్కలు, వన్యప్రాణులు, కుంటలు ఉన్నా యి. రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న ఈ అటవీప్రాంతం 4,794.47 హెక్టార్లలో విస్తరిం చింది. ఇందులో 1,327.45 హెక్టార్ల అటవీ ప్రాంతం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం తో మునిగింది. ఇది పోను 3,467.02 హెక్టార్ల బ్యాలెన్సు అటవీ ప్రాంతాన్నే 'మల్లన్న వనాలు'గా తీర్చిదిద్దేందుకు అటవీ అధికారులు కృషిచేస్తున్నారు.
రాజీవ్ రహదారి పక్కనే ఉం డటం వల్ల హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాం తాల నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను చూడటానికి ఇప్పటికే పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవిదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా.. దీనిని ఒక మంచి పర్యాటక ప్రాంతంగా, అభయారణ్యం తరహాలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.
దట్టమైన అటవీప్రాంతం కావడంతో వివిధ రకాల జంతువులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో చిరుత సంచరించింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం నుంచి 20 కి.మీ మేర అటవీ ప్రాంతం గుండా వెళ్తే మల్లన్నసాగర్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ఈ అటవీ ప్రాంతం చుట్టూ అందంగా ఆవరించి కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ పునరుజ్జీవనంలో భాగంగా ఖాళీ భూమిలో వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఆయుర్వేద మొక్కలు పెంచుతున్నారు.