ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. రవాణా మంత్రి ఆర్యా రాజీనామా
posted on Oct 11, 2021 @ 4:54PM
మరో నలుగు నెలల్లోఅసెంబ్లీ ఎన్నికల జరగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యష్‌పాల్ ఆర్యా, ఆయన కుమారుడు, నైనిటాల్ ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యాబీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. యష్‌పాల్ ఆర్యా తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పటికే ఆరు నెలలలో ముగ్గురు ముఖ్య మంత్రులను మార్చి, సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న బీజేపీకి ఆర్యా తండ్రీకొడుకుల రాజీనామా గట్టి ఎదురు దెబ్బగా పరిశీలకులు సైతం భావిస్తున్నారు.
యష్‌పాల్ ఆర్యా, ఆయన కుమారుడు సంజీవ్ ఆర్యా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కున్నారు. నిజానికి, గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వరితించారు. 2007 నుంచి 2014 వరకు ఉత్తరాఖండ్ పీసీసీచీఫ్’గా ఉన్నారు. 2016లో ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యశ్‌పాల్.. ఎన్‌డీ తివారీ హయాంలో 2002 మార్చి 15 నుంచి 2007 మార్చి 11 వరకు ఉత్తరాఖండ్ స్పీకర్‌గా ఉన్నారు. యశ్‌పాల్ కాంగ్రెస్ గూటికి వెళతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయనను బీజేపీ నుంచి వెళ్లకుండా అడ్డుకోడానికి సీఎం పుష్కర్ సింగ్ ధామీ శతవిధాలుగా ప్రయత్నించారు. అయినా చివరకు ఆర్యా సొంత గూటికి చేరారు.
బీజేపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం చూస్తుంటే ఉత్తరాఖండ్‌లో గాలి ఎటు వీస్తుందో స్పష్టమైన సంకేతమని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. యశ్‌పాల్ కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వచ్చినట్టయ్యిందని అన్నారు.