'మందుల' రెడ్డి వెనకున్న రాజకీయ శక్తులెవరు? అక్రమ సొమ్ము బినామీలెవరు?
posted on Oct 11, 2021 @ 9:12PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో సహ నిందితుడిగా ఉన్న హెరిటో ఫార్మా చైర్మన్ బండి పార్ధసారధి రెడ్డికి సంబంధించి చీకటి కోణాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగు రోజులుగా హెటిరో ఫార్మా కార్యాలయాలు, యూనిట్లు, కంపెనీ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు. రూ. 142 కోట్ల నగదు సీజ్ చేశారు.
6 రాష్ట్రాల్లో హెటిరో సంస్ధల్లో 60 చోట్ల 4 రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని గుర్తించారు. బీరువాల నిండా రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి. నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్ చేశారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ. 142 కోట్లు దాచారని అధికారులు వెల్లడించారు. ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని తెలిపారు. ఒక్కో అల్మారాలో రూ. 5 కోట్ల నగదు దాచారని తెలిపారు.
బీరువాల్లో లబించిన డబ్బుల కట్టలు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికారులు మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్నారు.హెటిరో సంస్థ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూసినట్లుగా శనివారం ఐటీ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. హెటిరో ఫార్మాలో రూ.550 కోట్ల నిధులకు అసలు లెక్కలే లేవని, ఇందులో రూ.142.87 కోట్ల మేర నగదు పట్టుబడిందని వెల్లడించింది .కంపెనీకి సంబంధించి చీకటి కోణాలు కూడా భారీ ఎత్తునే వెలుగు చూసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
హెటిరో ఫార్మాకు సంబంధించిన ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో ఉంది. ఇక ఆ సంస్థ ఉత్పత్తి చేసే ఔషధాలకు సంబంధించి హైదరాబాద్‌తో పాటు విశాఖల్లోనూ యూనిట్లు ఉన్నాయి. అయితే ఐటీ సోదాలు మాత్రం ఆ సంస్థకు చెందినవిగా భావించిన 50 ప్రాంతాల్లో జరిగాయి. ఓ ప్రాంతంలో సోదాలు చేస్తే.. ఆ సంస్థకు చెందిన మరో స్థావరం బయటపడుతూ వచ్చాయి. ఇలా హైదరాబాద్‌లోని బోరబండలోనూ ఓ కీలక స్థావరం కూడా ఐటీ అధికారుల దృష్టికి వచ్చింది. హెటిరో రహస్య స్థావరంగా భావిస్తున్న ఈ డెన్‌లోనే ఏకంగా రూ.142.87 కోటమ్ల నగదు కట్టల రూపంలో బయటపడిందని తెలుస్తోంది. ఈ నగదును తరలించేందుకు ఐటీ అధికారులు ఏకంగా నాలుగు వాహనాలను వినియోగించాల్సి వచ్చింది. ఈ నగదుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క పత్రమూ లేదట. అసలు విశాలంగా ఉన్న కంపెనీ హెడ్ ఆఫీస్ ఉండగా.. బోరబండలోని సీక్రెట్ డెన్‌ను ఆ సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసుకున్న వైనం.. యాజమాన్యం అక్రమాలను ఇట్టే కళ్లకు కట్టేసినట్టుగా చెప్పింది.
ఇటీవలే దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను హురూన్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో హెటిరో చైర్మన్‌గా ఉన్న పార్థసారధి రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాకు వారం పది రోజుల ముందు ఆయనకు టీటీడీ బోర్డులో వరుసగా రెండో సారి సభ్యత్వం ఇచ్చింది జగన్ రెడ్డి సర్కారు. ఈ జాబితా విడుదలైన రెండు రోజులకే ఐటీ అధికారులు దాడులు మొదలెట్టేశారు. ఒక్కరోజుతోనే దాడులు ముగించకపోగా.. రోజుల తరబడి సోదాలు.. రోజుకో కొత్త డెన్‌ను వెలికి తీస్తూ అందులోని అక్రమాలు లాగేశారు. హెటిరో సంస్థల్లో భారీగా నగదు, బ్లాక్ మనీ పట్టుబడటంతో ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది. హెటిరో సంస్థ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే వాదన వస్తోంది. అక్రమ సొమ్ముకు బినామీలెవరన్న చర్చ జోరుగా సాగుతోంది.