'అఖండ'కు చంద్రబాబు రివ్యూ.. తనదైన స్టైల్‌లో రేటింగ్..
posted on Dec 11, 2021 @ 2:40PM
'అఖండ'. బాలకృష్ణ నట విశ్వరూపానికి ప్రతీక. రికార్డు కలెక్షన్లతో బాక్సులు బద్దలవుతున్నాయి. బాలయ్య యాక్టింగ్.. యాక్షన్.. అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక, అఘోరాగా నటసింహం గాండ్రింపు వెండితెరపై చూసి తీరాల్సిందే. మ్యూజిక్ మరో లెవల్‌లో ఉంది. అందుకే, పది రోజులుగా పూనకంతో ఊగిపోతున్నారు బాలయ్య ఫ్యాన్స్. హిందూ సంస్థలన్నీ 'అఖండ'ను భుజాలపై మోస్తున్నాయి. ఆ హిట్ టాక్‌తో ముగ్థుడైన చంద్రబాబు.. అఖండ మూవీ చూడకుండా ఉండలేక పోయారు. నిత్యం రాజకీయ కార్యకలాపాలతో ఫుల్ బిజీగా ఉండటం.. సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేకపోవడంతో చంద్రబాబు అత్యంత అరుదుగా మాత్రమే సినిమాలు చూస్తారు. తాజాగా, వియ్యంకుడి సినిమాను చూశారు. బావమరిది మూవీకి తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చారు. ఇంతకీ అఖండపై చంద్రబాబు అభిప్రాయం ఏంటంటే.....
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ‘అఖండ’ మూవీని తాను చూసినట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతోందో దాన్ని ‘అఖండ’ సినిమాలో చూపించారని, సినిమా చాలా బాగుందని చంద్రబాబు ప్రశంసించారు.
ఆలయాలపై దాడులు, పేకాట ఆడటం.. లాంటి సీన్స్ అఖండ సినిమాలో ఉంటాయి. రెండేళ్లుగా ఏపీలోనూ పలు ఆలయాలపై దాడులు జరగడం.. ఆ కేసుల్లో ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోవడం.. రాష్ట్రంలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తుండటం.. ఇలా రాష్ట్ర పరిస్థితులు.. అఖండ మూవీ సీన్లను పోలుస్తూ చంద్రబాబు మాట్లాడారు. సినిమాలో మాదిరే బాలకృష్ణ రాజకీయాల్లోనూ అఘోరాగా మారి.. చెడును చీల్చి చెండాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.