జై భీమ్ తో జగన్ రెడ్డి మాట్లాడించారా?
posted on Dec 11, 2021 @ 2:52PM
న్యాయ స్థానాలు, ఏపీ హైకోర్టును ఉద్దేశించి జై భీమ్ ఫేమ్, మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆయన కామెంట్లపై న్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరినో కావాలనే టార్గెట్ చేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఖండించారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని ఎంపీ రఘురామ అన్నారు. జగన్ సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై జస్టిస్ చంద్రు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. జస్టిస్ చంద్రుతో న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడించినట్లు ఉందన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవన్న సంగతి జస్టిస్ చంద్రుకు ఎందుకు అర్థం కావడం లేదని ఎంపీ రఘురామ అన్నారు.
జస్టిస్ చంద్రు ఏమన్నారంటే..
పౌర హక్కుల అమలు, సామాజిక న్యాయం, జై భీమ్ సినిమాపై విశ్లేషణ అనే అంశంపై విజయవాడ జరిగిన సదస్సుకు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు జస్టిస్ చంద్రు. ఆ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏపి హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని అన్నారు. ఏపిలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిసతోందనీ, శతృవులు, ప్రత్యర్ధులతో కాదు న్యాయ వ్యవస్థతో యుద్ధం చేస్తోందన్నారు. అమరావతి భూ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు.
కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని జస్టిస్ చంద్రు అన్నారు. రాజధాని పిటిషన్ లకు సంబంధించి బెంచ్ లో ఇద్దరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు కేటాయించారు వారిని తప్పించాలని ప్రభుత్వం కోరితే ధర్మాసనం అంగీకరించలేదన్నారు. ఇక కేసు విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఆ బిల్లులను వెనక్కి తీసుకుందన్నారు. ఇలాంటి జడ్జిలు న్యాయ వ్యవస్థలో ఉన్నంత కాలం తమకు న్యాయం జరగదని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకునట్లు ఉందన్నారు జస్టిస్ చంద్రు.
సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టుల వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేయించి సీబీఐకి అప్పగించిందన్నారు జస్టిస్ చంద్రు. నలుగురుని అరెస్టు చేసిన సిబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేయడానికి విదేశాలకు వెళ్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నామన్నారు. కోర్టు తీర్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సీబీఐ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వంలో ఏదైనా వ్యవస్థ కౌంటర్ ఫైల్ చేయకపోతే వాళ్లకి జరిమానా విధించవచ్చనీ, మొన్న సుప్రీం కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కౌంటర్ వేయకపోతే లక్ష రూపాయల జరిమానా విధించిందని జస్టిస్ చంద్రు గుర్తు చేశారు.