లక్ష్మీనారాయణపై ఏంటా కేసు? ఆయనే ఎందుకు టార్గెట్?
posted on Dec 11, 2021 @ 2:11PM
70 ఏళ్ల పైబడిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ. ఉన్నతాధికారిగా సుదీర్ఘ అనుభవం. గతంలో చంద్రబాబుకు ఓఎస్డీ. ఆయనకు సన్నిహితుడు కూడా. ఇదే కారణమే ఏమో.. హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ ఇంటిపై ఏపీ సీఐడీ అధికారులు సడెన్‌గా దాడి చేయడం.. ఓవరాక్షన్ చేయడం.. ఓ మీడియా అధినేత హుటాహుటిన తరలిరావడం.. ఇలా హాట్‌హాట్‌గా సాగిందా ఎపిసోడ్. సీఐడీ విచారణలో లక్ష్మీనారాయణ సొమ్మసిల్లిపడిపోయేంతలా సీఐడీ విచారణ సాగింది. ఇంతకీ, ఉన్నట్టుండి రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఎందుకు ఏపీ సీఐడీకి టార్గెట్ అయ్యారు? ఆయనపై పెట్టిన కేసు ఏంటి? అందులో ఈయన రోల్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అమలు చేసిన ‘సీమెన్స్ ప్రాజెక్టు’ పర్యవేక్షణకు నియమించిన అనేక మంది కమిటీ సభ్యుల్లో రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఒకరు. నామినేటెడ్ డైరెక్టర్. సీమెన్స్ ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు జరిగాయనేది సీఐడీ అనుమానం. నిజంగానే ఏదైనా తేడా జరిగుంటే.. ప్రాజెక్ట్ సీఈవోనో, ఎండీనో ప్రశ్నించాలి. కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణపై కేసు పెట్టడమే సీఐడీ తీరు అనుమానాస్పదంగా మారింది.
ఎవరిని ఇరికించాలి? ఎవరిపైన ఎలా కేసులు పెట్టాలి? అనేదే లక్ష్యంగా జగన్ అండ్ బ్యాచ్.. గత టీడీపీ ప్రభుత్వ కార్యకలాపాల్లో లూప్‌పోల్స్ వెతుకుతోందని అంటారు. అందులో భాగంగా.. నైపుణ్యాభివృద్ధి సంస్థకు-సీమెన్స్‌కు మధ్య జరిగిన ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ కొన్నాళ్ల కిందట నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న చల్లా మధుసూదన్ రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోనూ లక్ష్మీనారాయణ పేరు లేదు. అనూహ్యంగా.. శుక్రవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ అజయ్‌రెడ్డి మరో ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. ఎఫ్‌ఐఆర్‌లో రెండో నిందితుడిగా లక్ష్మీనారాయణ పేరు చేర్చింది. ఇంటిపై దాడి చేసింది. ఆయన ఆసుపత్రి పాలు కావడానికి కారణమైంది.
అసలు ఏంటీ సీమెన్స్ ప్రాజెక్ట్?
ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు గత చంద్రబాబు ప్రభుత్వం ‘సీమెన్స్’ ప్రాజెక్టు రూపొందించింది. ఈ ప్రాజెక్టును సీమెన్స్ కంపెనీ తొలుత గుజరాత్‌లో అమలు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించింది. సీమెన్స్-డిజైన్‌టెక్ సంస్థలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. నైపుణ్యాభివద్ధి కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పడం. దానికింద ఐదు టెక్నికల్ స్కిల్ డెవల్‌పమెంట్ కేంద్రాలు (టీఎస్‌డీఐ) ఏర్పాటుచేయడం ప్రాజెక్టు లక్ష్యం. ఐదు టీఎస్‌డీఐల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 546 కోట్లు. అందులో 90శాతం, అంటే రూ.491కోట్లు సీమెన్స్-డిజైన్‌టెక్‌లు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇచ్చాయి. 10శాతం నిధులు.. అంటే రూ.55 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. మొత్తం ఆరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటి పరిధిలో 34 టీఎస్‌డీఐ కేంద్రాలు నెలకొల్పారు. సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా 2020 మార్చి నాటికి ఏపీలో మొత్తం 2,11,984 మందికి శిక్షణ ఇచ్చారు.