వైఎస్ షర్మిల అరెస్ట్.. నిరాహార దీక్ష భగ్నం
posted on Dec 11, 2021 @ 3:10PM
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేస్తున్న వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిల సహా నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వైఎస్సార్ టీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దాదాపు మూడున్నర గంటల పాటు షర్మిల దీక్ష కొనసాగింది.
హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్‌లో వరి సాగు చేయవద్దని చెప్పినందుకు రైతు రవి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆవేదనను చెబుతూ సీఎం కేసీఆర్ కు లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు రవి. ఈ ఘటన తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. రవి కుటుంబాన్ని పరామర్శించేందుకు బొగుడు భూపతిపూర్ వెళ్లింది వైఎస్ షర్మిల. రైతు కుటుంబ సభ్యులను ఓదార్చింది. తర్వాత రైతు రవికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అక్కడే దీక్షకు దిగారు షర్మిల. ప్రభుత్వ తీరుతో రైతు రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రభుత్వం స్పందించే వరకు నిరాహార దీక్ష చేపడుతానని ఆమె స్పష్టం చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. అప్పటి దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. స్వయంగా సీఎం పేరు చెప్పి రైతు రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. రైతులకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పి, సీఎం పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.