అమరవీరుల స్థూపంలోనూ కమీషన్లా? కేటీఆర్ అంతగా దిగజారారా?
posted on Dec 11, 2021 @ 4:37PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ టార్గెట్ గా విపక్షాలు దూకుడు పెంచాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ కాక రేపుతున్నారు. ఇటీవలే వందల కోట్ల భూ కుంభకోణంలో కేటీఆర్ కీలకంగా ఉన్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఆ ఆరోపణలు దుమారం రేపుతుంగానే తాజాగా మరో బాంబ్ పేల్చారు రేవంత్ రెడ్డి. అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కలిసి కేటీఆర్ వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు.
అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమరుల స్థూపం కట్టడానికి కూడా పొద్దుటూరు వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు. అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే అమరుల స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారన్నారు. ఈ టెండర్ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఇచ్చిందన్నారు. ఈ కంపెనీ పొద్దుటూరుకు చెందిన వ్యక్తిదేదన్నారు.
6 శాతం కన్సల్టెంట్ ఫీజు ఇస్తుందన్నారు రేవంత్ రెడ్డి. రేకులు, ఇనుముతో కట్టిన నిర్మాణానికి 177 కోట్లకు పెంచారన్నారు. 60 కోట్లతో మొదలైన స్థూపం.. రూ.180 కోట్లకు పెంచారన్నారు. కేటీఆర్ ను మెప్పించి వ్యయం పెంచుకున్నాడన్నారు. 300 శాతం బడ్జెట్ పెంచారన్నారు. అమరుల స్థూపం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. అసలు కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా? డీఎన్ఏ టెస్టు చేయించాలన్నారు. నాలుగేళ్లైనా అమరుల స్థూపం ఎందుకు పూర్తికాలేదో విచారణ కమిటీ వేయాలన్నారు. కమిటీ వేసి ఆలస్యానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆంద్రా కాంట్రాక్టర్ కు ఇవ్వడానికి కారణం ఏంటి? తెలియాలన్నారు. ఈ అవినీతికి కేటీఆర్, అతని ఫ్రెండ్ తెలుకుంట శ్రీధరే కారణమన్నారు రేవంత్ రెడ్డి.