ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు... ఉత్తరాంధ్ర జిల్లాలో వణుకు..
posted on Dec 12, 2021 @ 11:04AM
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దగ్గరకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమైక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి ఒమైక్రాన్ వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిళ్లను జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే.. 10 శాంపిళ్లకు నివేదికలు ఆందాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 కేసుల్లో ఒక కేసు మాత్రమే ఒమైక్రాన్ వైరస్ ఉన్నట్టు గుర్తించారు.
విజయనగరం వాసికి ఒమిక్రాన్ నిర్దారణ కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఆందోళన నెలకొంది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఐర్లాండ్ నుంచి వచ్చిన తర్వాత విజయనగరం, విశాఖలో తిరిగారని గుర్తించారు. దీంతో అతను తిరిగిన ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రజలెవ్వరూ భయాందోళనలు చెందనక్కర్లేదని వైద్యారోగ్య శాఖ భరోసా ఇచ్చింది.