టీడీపీ నేతపై హత్యాయత్నం.. డీజీపీకి చంద్రబాబు లేఖాస్త్రం
posted on Dec 12, 2021 @ 1:17PM
కర్నూల్ జిల్లాలో టీడీపీ నేత తిక్కారెడ్డికి హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో దాడి జరిగింది. తిక్కారెడ్డి వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తిక్కారెడ్డిని చంపాలనే ఈ దాడి చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కర్నూలు జిల్లా కోసిగిలో తిక్కారెడ్డిపై దాడి జరగడంపై టీడీపీ సీరియస్ గా స్పందించింది. ఘటనలో చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. బొంపల్లె ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గాయపడినట్టు లేఖలో చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని కోరారు.
గతేడాది ఫిబ్రవరిలోనూ తిక్కారెడ్డిపై వైసీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చంద్రబాబు చెప్పారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. తిక్కారెడ్డికి ఏవిధమైన ప్రమాదం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, నేరస్థులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. మరిన్ని నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.
టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగినా పోలీసులు భద్రత కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలే తిక్కారెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారని లోకేష్ ఆరోపించారు. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ అనే కత్తికి జగన్ బలిచేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. కత్తిని నమ్ముకుంటే కత్తికే బలికాక తప్పదని హితవు పలికారు. ప్రజలు గెలిపించింది ప్రతిపక్ష నేతలకు హతమార్చడానికా అంటూ జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ సూటిగా ప్రశ్నించారు.