జగన్ సర్కార్ కు ఎదురు గాలి.. ఒక్క ఛాన్స్ కథ కంచికే
posted on Dec 11, 2021 @ 6:16PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ఇంతకాలం ఒక లెక్క ఇప్పుడు ఇంకొక లెక్క అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు తెర మీదకు వస్తున్నాయా, జనంతో జగన్ సర్కార్ర్ హనీమూన్ ముగిసినట్లేనా, అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గడచిన రెండున్నర సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా ప్రజలు చాలా వరకు చూసి చూడనట్లు వదిలేశారు. అంతగా పట్టించుకోలేదు.
మరో వంక సంక్షేమ పధకాల మాటున ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తూ వచ్చింది. రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేస్తూ అణచివేత విధానాలతో ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ విలువలను దోసి రాజని నియంత పాలన సాగిస్తోంది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రజలు జగన్ ప్రభుత్వం నిజరూపాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు. మరో వంక ఆర్థిక క్రమ శిక్షణను పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని దేశానికే అప్పుల రాజదానిగా చేసిన ప్రభుత్వం, ఖాళీ ఖజానాను నింపుకునేందుకు జనం మీద మోయలేని భారం మోపుతోంది. ఒక చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి రెండు చేతులతో జనం జేబులు ఖాళీ చేస్తోందనే అభిప్రాయం రోజు రోజుకు పెరిగి పోతోంది.
నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా చేస్తున్నది అదే, అయితే,ఇంతకాలం దొరికిన కాడికి అప్పులు చేసి ప్రజలకు నొప్పి తెలియకుండా అప్పుల భారం నెత్తికి ఎత్తింది. అలాగే ఆస్తులు అమ్మి, కుదువ పెట్టి, అప్పులు చేసింది. ఈ రెండున్నర ఏళ్లలో జగన్ రెడ్డి మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కని నెత్తిన రూ. 5 లక్షలకు పైగానే అప్పు ఉందని అంచనా. మరో వంక సుమారు, రూ.70 వేల కోట్లకు పైబడిన ప్రభుత్వ ఆస్తులను కుదవ పెట్టి మరీ అప్పులు తెచ్చిందని అధికార వర్గాల సమాచారం. అలాగని పన్నుల భారం తక్కువ అని కాదు. ప్రస్తుత 2021-22 వార్షిక బడ్జెట్’ లో గతసంవత్సరం కంటే రూ. 27 వేల 900 కోట్లు అదనపు పన్నులు కలిపి మొత్తం రూ.85,280.53కోట్ల పన్నులను ప్రతిపాదించారు. అదిగాక, ఇప్పుడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో కోట్ల రూపాయల భారం ప్రజల నెత్తిన మోపుతున్నారు.
ఒక్క ఛాన్స్ అని వేడుకుంటూ ఆధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ఇపుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీపీ) ఒకే ఒక్క దెబ్బతో పేదల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చు కుంటోంది. ఇలా ప్రభుత్వం పట్ల ప్రజల్లో మొదలైనవయారి వ్యతిరేకత ఇంతై ఇంతింతై అన్నట్లుగా పెరుగుతోంది. మరో వంక ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రాధాన కార్యదర్శి లోకేష్ వివిద కార్యక్రమల ద్వారా జనంలోకి దూసుకు పోతున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ పెరిగింది.
అదలా ఉంటే జనసేన మళ్ళీ మరోమారు తెలుగుదేశంతో దగ్గరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, విశాఖ ఉక్కు విక్రయాన్ని జనసేన వ్యతిరేకిస్తోది. అంతేకాదు, డిసెంబర్ 12న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ అమరావతిలో సంఘీభావ దీక్ష చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీ దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో జనసేనతో పాటుగా వామపక్ష పార్టీలు కూడా తెలుగు దేశంతో జట్టుకట్టే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏమైనా ఏపీ రాజకీయాల్లోవస్తున్న మార్పులు వైసీపీ ... ఒక్క ఛాన్స్ సర్కార్’ కథ కంచికి చేరడం ఖాయమని సూచిస్తున్నాయి.