వామ్మో.. కేసీఆర్ పాలనపై ఇంత వ్యతిరేకతా! కారుకు మూడో స్థానమేనా?
posted on Dec 12, 2021 @ 12:18PM
తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసింది.. ఇదీ కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం. కేసీఆర్ పాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే చర్చ సాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో అది కనిపించింది కూడా. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కారు పార్టీకి షాకిచ్చారు ఓటర్లు. తర్వాత వరి ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యం, వరి సాగు చేయవద్దంటూ కేసీఆర్ ఇచ్చిన ప్రకటనలతో జనాలు భగ్గుమంటున్నారు. దీంతో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా వచ్చిన ఓ సర్వే ఫలితాలు ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ కు , టీఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా సర్వేలో జనాల నాడీ కనిపించింది.
సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ ఆధ్వర్యంలోని వోటా( వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రా) సంస్థ సమగ్ర సర్వే నిర్వహించింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తైన సందర్భంగా ఈ సర్వే నిర్వహించింది వోటా సంస్థ. డిసెంబర్ 1 నుంచి 10 వరకు పది రోజుల పాటు వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించింది. ఎక్కువగా ఆన్ లైన్ ద్వారా శాంపిల్స్ సేకరించింది. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్, టెలిగ్రామ్, యూ ట్యూబ్ ద్వారా జరిగిన సర్వేలో వేలాది మంది పాల్గొని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనపై జనాలు ఏమంటున్నారు, ముందస్తు ఎన్నికలు వస్తాయా.. వస్తే ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది.. కేటీఆర్ ను సీఎంగా జనాలు కోరుకుంటున్నారా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జనాలు ఏ పార్టీని కోరుకుంటారు అన్న అంశాలపై వోటా సంస్థ సర్వే నిర్వహించింది.
వోటా సంస్థ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంగా ఉన్నారనే విషయం సర్వేలో స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని, ఏకంగా మూడో స్థానానికి పడిపోతుందని వోటా సర్వేలో తేలింది. అంతేకాదు టీఆర్ఎస్ లో అసమ్మతి ఖాయమని కూడా మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఏడేళ్ల పాలన ఎలా ఉందని ప్రశ్నించగా.. కేసీఆర్ పాలనకు కేవలం 18 మార్కులే వచ్చాయి. కేసీఆర్ పాలన అసలు బాగాలేదని ఏకంగా 50.8 శాతం మంది, బాగా లేదని 20.3 శాతం మంది తీర్పు ఇచ్చారు. 10.9 శాతం మంది కేసీఆర్ పాలన పర్వాలేదన్నారు. ఏకంగా 71 శాతం మంది కేసీఆర్ పాలన బాగా లేదని చెప్పడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
సీఎం కేసీఆర్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని ప్రశ్నించగా... కేసీఆర్ పాలనకు కేవలం 25 మార్కులే ఎక్కువ మంది వేశారు. 67.1 శాతం మంది కేసీఆర్ పాలన అట్టర్ ప్లాప్ అంటూ 25 మార్కులు వేశారు. 11.7 శాతం మంది 50 మార్కులు వేయగా.. 7.3 శాతం మంది మాత్రమే 75 మార్కులు వేశారు. 13.9 శాతం మంది మాత్రం కేసీఆర్ పాలనకు ఫుల్ 100 మార్కులు వేశారు.
టీఆర్ఎస్ లో అసమ్మతి ఉందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ఏకంగా 70 శాతానికి పైగా ఉందని చెప్పారు. 14 శాతం మంది అసమ్మతి గురించి ఏమి తెలియదని చెప్పగా.. 7 శాతం మంది మాత్రమే గులాబీ పార్టీలో అసమ్మతి లేదని చెప్పారు. 70 శాతానికి పైగా జనాలు కారు పార్టీలో అసమ్మతి ఉందని భావించడం షాకింగే. ఇక దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అంటే దాదాపు 73 శాతం మంది ఇవ్వరనే చెప్పారు. అంటే కేసీఆర్ హామీలపై జనాలకు పూర్తిగా నమ్మకం పోయిందని తెలుస్తోంది.
కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండటంతో.. టీఆర్ఎస్ ను ఎవరూ ఓడిస్తారని ప్రశ్నించగా ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. కారు పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ వైపు మెజార్టీ జనాలు మొగ్గు చూపారు. బీజేపీ పార్టీకి 48.5 శాతం ఓటర్లు జై కొట్టగా.. కాంగ్రెస్ కు మద్దతుగా 27. 1 శాతం మంది నిలిచారు. టీఆర్ఎస్ ను ఎవరూ ఓడించలేరని 18 శాతం మంది తమ అభిప్రాయం చెప్పారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నకు.. బీజేపీకి 38.4 శాతం , కాంగ్రెస్ కు 37 శాతం మంది ఓటేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం దారుణంగా మూడో స్థానానికి పడిపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తే గులాబీ పార్టీకి ఓటేస్తామని కేవలం 22.2 శాతం మంది మాత్రమే ఓటేస్తారని చెప్పారు. టీఆర్ఎస్ కు ఎవరూ ఓడిస్తారన్న ప్రశ్నకు బీజేపీకి ఎక్కువ సపోర్ట్ రాగా.. ఎవరికి ఓటు వేస్తారు అన్న ప్రశ్నకు మాత్రం కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా నిలవడం ఆసక్తి రేపుతోంది.
టీఆర్ఎస్ కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారంపై అభిప్రాయం చెప్పాలని కోరగా.. 28 శాతం మంది సరైంది కాదన్నారు. 15.4 శాతం మంది సరైనదని చెప్పారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు ఇంకా టైముందని 17 శాతం మంది చెప్పగా.. దాదాపు 40 శాతం మంది మాత్రం ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రిగా ఎవరూ బెస్ట్ ఆప్షన్ అన్న ప్రశ్నకు మాత్రం కేసీఆర్ కే ఎక్కువ మంది జై కొట్టారు. కేసీఆరే సీఎంగా బెటరని 45 శాతం మంది చెప్పగా... రెండో స్థానంలో అనూహ్యంగా హరీష్ రావు నిలిచారు. హరీష్ రావుకు 42.5 శాతం మంది ఓటేయగా.. కేటీఆర్ కు కేవలం 10 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేశారు. కవిత బెస్ట్ సీఎం ఆప్షన్ అని కేవలం 1.7 శాతం మంది మాత్రమే తమ అభిప్రాయం చెప్పారు.
ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ గ్రాఫ్ తగ్గిందని 72 శాతం మంది చెప్పగా.. మారలేదని 22. 8 శాతం మంది, పెరిగిందని 4.8 శాతం మంది తమ అభిప్రాయాన్ని సర్వేలో వెల్లడించారు. టీఆర్ఎస్ లో చీలిక వస్తుందా? అని ప్రశ్నించగా.. 45.3 శాతం మంది వస్తుందని, 43 శాతం మంది రాదని చెప్పారు.
మొత్తంగా వోటా సంస్థ సర్వే ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని స్పష్టమవుతోంది. కేసీఆర్ పాలనపై జనాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చిని కారు పార్టీకి ఘోర పరాజయం తప్పదని తెలుస్తోంది. గులాబీ పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.