నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. సామాన్యుల పరిస్థితి ఏంటో?
posted on Dec 12, 2021 9:01AM
దేశంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోతోంది. హ్యాకర్ల బెడద ప్రధానమంత్రి నరేంద్రమోడీని తప్పలేదు. ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఆయన వ్యక్తిగత ఖాతాను హ్యాక్ చేసి బిట్‌కాయిన్‌ను ప్రమోట్ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రధానమంంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేయడం కలకలం రేపుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్ల ప్రకారం ప్రభుత్వం బిట్‌కాయిన్లను అధికారికం చేసిందని, దేశంలోని ప్రతి ఒక్కరికి 500 బిట్‌కాయిన్ల చొప్పున పంచుతోందని పోస్టు చేశారు. దానికింద ఓ స్కామ్ లింకు కూడా ఇచ్చారు. అయితే, కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్లు జనాల్లోకి వెళ్లిపోయాయి. అంతేకాదు హ్యాక్‌డ్ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో ట్రెండింగ్ అయిపోయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా కొంతసేపు హ్యాక్ అయిందని, ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఖాతాను పునరుద్ధరించినట్టు పీఎంఓ ఇండియా ఈ తెల్లవారుజామున ట్వీట్ చేసింది. హ్యాక్ అయిన సమయంలో షేర్ అయిన ట్వీట్లను పట్టించుకోవద్దని సూచించింది.
అయితే ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అత్యంత భద్రత ఉండే ప్రధాని వ్యక్తిగత అకౌంట్ కు దిక్కులేకపోతే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. సైబక్ హ్యాకర్ల నియంత్రణకు మరిన్ని కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు,