ఈటలతో బండి సంజయ్ వైరమా? ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు అందుకే వేయలేదా?
posted on Dec 11, 2021 @ 2:17PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు విభేదాలున్నాయా? పార్టీలో ఇద్దరి మధ్య ఆదిపత్య పోరు సాగుతుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ అవుననే సమాధానమే వస్తోంది. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ వచ్చిందని కొంత కాలంగా ప్రచారం జరుగుతుండగా.. శుక్రవారం జరిగిన శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలతో ఈ అనుమానం మరింత బలపడింది. అధికార పార్టీకి అత్యంత సవాల్ గా నిలిచిన స్థానిక కోటా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ తన ఓటు హక్కు వినియోగించుకోకపోవడం చర్చగా మారింది.
ఐదు జిల్లాల పరిధిలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఐదు జిల్లాల్లో ఎన్నికలు జరిగినా.. కరీంనగర్ లో మాత్రమే హోరాహోరీ పోరు సాగింది. మెదక్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ లో విపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో అక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికి అనుమానాలు లేవు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జరిగిన రెండు స్థానాల ఎన్నిక మాత్రం హాట్ హాట్ గా సాగింది. టీఆర్ఎస్ రెబెల్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి టీఆర్ఎస్ కు చెమటలు పట్టించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ డైరెక్షన్ లోనే రవీందర్ సింగ్ పోటీ చేశారు. సింగ్ గెలుపు కోసం ఈటల తెరవెనుక పెద్ద ఎత్తున కసరత్తు చేశారని తెలుస్తోంది.
రవీందర్ సింగ్ విజయం ఖాయమని బహిరంగంగానే ప్రకటించారు ఈటల రాజేందర్. దీంతో రవీందర్ సింగ్ కోసం ఈటల పెద్ద ఎత్తున ఖర్చు కూడా చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా వాళ్ల మద్దతు రవీందర్ సింగ్ కు దక్కేలా ఈటల స్కెచ్ వేశారు. అందుకే కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులంతా రవీందర్ సింగ్ కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ నిర్వహించిన క్యాంపులు కూడా రాజేందర్ అరేంజ్ చేశారని అంటున్నారు. టీఆర్ఎస్ ఓటర్లు కూడా కొంత మంది ఈటల రాజేందర్ తో టచ్ లో ఉన్నారని, వాళ్లంతా రవీందర్ సింగ్ కే ఓటేశారని చెబుతున్నారు. ముఖ్యంగా హుజురాబాద్, మానకొండురూ, చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులు.. అధికార పార్టీ క్యాంపులోనే ఉన్నా.. ఓటింగ్ రోజున మాత్రం రవీందర్ సింగ్ కు జై కొట్టారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పోలింగ్ ముగియగానే రవీందర్ సింగ్ సంబరాలు చేసుకున్నారని చెబుతున్నారు.
ఇంత హోరాహోరీగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఉన్న ఓటు హక్కు ఉన్న బండి సంజయ్ ఓటేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు షాకివ్వాలని ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తే.. బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఓటు వేయకపోవడం ఏంటనే చర్చ సాగుతోంది. కరీంనగర్ పరిధిలో మొత్తం 1324 మంది ఓటర్లు ఉండగా.. 1320 మంది ఓటేశారు. కొందరు సభ్యులు అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయినా.. స్ట్రెచర్ పై తీసుకొచ్చి ఓట్లు వేయించింది అధికార పార్టీ. ఓటేయని నలుగురిలో బండి సంజయ్ ఒకరు. మరో ఇద్దరు చనిపోయారు. టీఆర్ఎస్ కు రవీందర్ సింగ్ గట్టి పోటీ ఇచ్చారని తెలిసి, ప్రతి ఓటు కీలకమని తెలిసి కూడా బండి సంజయ్ ఓటేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే సంజయ్ ఓటింగ్ కు రాకపోవడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు.
రవీందర్ సింగ్ .. ఈటల రాజేందర్ మనిషని అందరికి తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీజేపీ నిర్ణయించినా.. అందుకు భిన్నంగా రవీందర్ సింగ్ ను ఈటల బరిలో దింపారని అంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ లో గెలుపుతో రాజేందర్ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. బీజేపీలో ఆయనో పవర్ సెంటర్ గా మారారనే చర్చ ఉంది. ఈటల జిల్లాలు కూడా తిరుగుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తుంది. ఈ సమయంలో ఎమ్మెల్సీగా రవీందర్ సింగ్ గెలిస్తే.. ఆ క్రేడిట్ అంతా రాజేందర్ కు వెళుతుందని సంజయ్ భావించారని అంటున్నారు. అదే జరిగితే పార్టీలో ఈటల పట్టు మరింత పెరుగుతుందని సంజయ్ భయపడ్డారని, అందుకే రవీందర్ సింగ్ గెలవాలని ఆయన కోరుకోలేదనే చర్చ కరీంనగర్ జిల్లాతో పాటు బీజేపీ వర్గాల్లోనూ సాగుతోంది. రవీందర్ సింగ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయలేదు కాబట్టి.. ఓటు వేయకపోయినా ఎవరూ ప్రశ్నించడానికి ఉండదనే సంజయ్ అలా చేశారంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తీవ్రంగానే ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.