సర్కారు వారి సినిమా ఫట్.. పీఆర్సీ పీటముడి.. రోజా గింగిరాలు.. టాప్‌న్యూస్ @ 7pm
posted on Dec 14, 2021 @ 5:37PM
1. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఏపీలో ఊహించిన దానికంటే ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ లాంటి ఉచిత పథకాల వల్ల ఏపీలో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందని తెలిపారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
2. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషనర్ల తరఫున న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను సస్పెండ్ చేసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పాత రేట్లే అమల్లోకి వస్తాయి.
3. పీఆర్సీ విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్ చర్చించనున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చలు జరిపారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ బుధవారం ఉదయం సీఎంతో ఉద్యోగ సంఘాల చర్చలు ఏర్పాటు చేస్తామని సజ్జల చెప్పారని అన్నారు.
4. సీపీఎస్ విషయంలో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెబుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీపీఎస్ నుంచి బయటకు వస్తే వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఫైనాన్స్‌కు సంబంధంలేని 71 డిమాండ్లను అధికారులు తేల్చేస్తారని సజ్జల తెలిపారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందేనన్నారు.
5. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్‌ను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు వెళ్లిన సీఎం కేసీఆర్.. సోమవారం తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు.
6. కేసీఆర్ పతనం మొదలయ్యిందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్ గుళ్ళు గోపురాలని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపాన్ని కడిగేసుకుందామనా... కేసీఆర్ వైకుంఠం వెళ్లినా పాపం పోదన్నారు. తలకిందులు తపస్సు చేసినా పాపం తీరదని విమర్శించారు.
7. ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్ కావలసిన విమానం గంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రోజా సహా ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. టెక్నికల్ సమస్యతో విమానాన్ని ల్యాండింగ్ చేయలేకపోయారని రోజా ఆరోపించారు. అసలు విషయం చెప్పకుండా వాతావరణంమీద సాకులు చెప్పారని అన్నారు.
8. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసింది. నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరులో ప్రారంభించిన మహా పాదయాత్ర 45 రోజులకు అలిపిరిలో పరిసమాప్తమైంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా 450 కి.మీ.పైగా రైతులు పాదయాత్ర చేశారు. వెంకన్న దర్శనం అనంతరం.. ఈనెల 17న తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాజధాని రైతులు సిద్ధమవుతున్నారు.
9. ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఏపీలో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని రాజ్యసభలో మంత్రి భారతి పవార్ తెలిపారు.
10. హైదరాబాద్ కోకాపేట యాక్సిస్ బ్యాంకులో శిల్పాచౌదరి విచారణ ముగిసింది. బ్యాంక్ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు తెలుసుకున్నారు. యాక్సెస్ బ్యాంక్ లాకర్‌లో పోలీసులు ఏమీ గుర్తించలేక పోయారు. ఎటువంటి నగదు కాని బంగారు ఆభరణాలు కానీ లభించ లేదు. ఓ సొసైటీకి సంబంధించిన డాకుమెంట్స్‌ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.